onions rates
-
ఉల్లి బాటలో టమాట..
న్యూఢిల్లీ : ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తుంటే తాజాగా టమాట కూడా మోతెక్కిస్తోంది. కర్ణాటక సహా టమాట దిగుబడులు అధికంగా ఉండే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా బుధవారం దేశ రాజధానిలో కిలో టమాట రూ 80కి ఎగబాకింది. సరఫరాలు తగ్గడంతో గత ఐదు రోజులుగా టమాట ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్ వర్తకులు టమాటాను రూ 60 నుంచి రూ 80 మధ్య విక్రయిస్తుండగా, మదర్‌డైరీ సఫల్ అవుట్లెట్లలో కిలో రూ 58కి విక్రయిస్తున్నారు. అక్టోబర్ 1న రూ 45 పలికిన కిలో టమాట బుధవారం సగటు రిటైల్ ధర రూ 54కు పెరిగిందని అధికారులు తెలిపారు. వరదలు, భారీ వర్షాలతో పంట దెబ్బతినడం, సరఫరా అవాంతరాలతో టమాట ధరలు మండుతున్నాయని ఆజాద్‌పూర్ మండిలో హోల్‌సేల్ ట్రేడర్ చెప్పుకొచ్చారు. ఇతర మెట్రో నగరాలు కోల్‌కతాలో కిలో టమాట రూ 60 కాగా, ముంబైలో రూ 54, చెన్నైలో రూ 40 వరకూ పలుకుతోంది. -
ఉల్లి ధర ఢమాల్
దేవరకద్ర: ఒకప్పుడు వినియోగదారులను కన్నీరు పెట్టించిన ఉల్లి.. నేడు రైతు కంట పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనడానికి వ్యాపారులే ముందుకు రావడం లేదు. మార్కెట్లో పోసి వ్యాపారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో వచ్చినికాడికే దిక్కు అనుకుంటూ రైతులకు తక్కువ ధరకే పంటను తెగనమ్ముకుంటున్నారు. ఉల్లిపాయల ధరలు మరోసారి పడిపోయాయి. కొన్ని వారాలుగా నిలకడగా ఉన్న ధరలు క్వింటాకు రూ. 300 నుంచి రూ. 400వరకు తగ్గాయి. గత వారం దేవరకద్ర మార్కెట్‌కు సెలవు కారణంగా బహిరంగ వేలం జరగక పోవడంతో బుధవారం రైతులు పెద్ద ఎత్తున ఉల్లిపాయలు అమ్మకానికి తెచ్చారు. పాత మార్కెట్ అవరణతో పాటు కొత్త షాపుల అవరణంతా ఉల్లి కుప్పలతో నిండి పోయింది. నాలుగు వేల బస్తాల ఉల్లి పాయలు మార్కెట్‌కు వచ్చి ఉండవచ్చని వ్యాపారుల అంచనా. ఒక దశలో ట్రాక్టర్లపై వచ్చిన ఉల్లిపాయలను వ్యాపారులు కింద పోయకుండా అలాగే ఉంచారు. రెండు వారాల క్రితం వరకు క్వింటాల్ ఉల్లి ధర గరిష్టంగా రూ.1650వరకు ఉండగా ఈ వారం రూ. 1350కు పడి పోయింది. దీనికితోడు ఉల్లిపాయలు కొనుగోలు చేసేవారు కరువయ్యారు. చాలా కుప్పలను వేలం వేయకుండా రూ.400 నుంచి రూ. 800కు క్వింటాల్ కొనుగోలు చేశారు. వ్యాపారులు వచ్చినా.. ఇతర ప్రాంతాల నుంచి ఉల్లి పాయలను కొనుగోలు చేయడానికి వ్యాపారులు వచ్చిన ఉల్లి ధరలు పెరగలేదు. హైదరాబాద్ మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల వ్యాపారులు వేలంలో ధరలు పెంచడానికి వెనకడుగు వేశారు. అయితే రెండు వారాల ఉల్లిపాయలు ఒకే వారం రావడం వల్ల ఉల్లి ధరలు తగ్గాయని రైతులు అంటున్నారు. తక్కువ మొత్తంలో ఉల్లిపాయలు వచ్చినప్పుడు ఉల్లి ధరలు పెరగడం, ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు ధరలు తగ్గడం పరిపాటిగా మారిందని రైతులు అంటున్నారు. ప్రజలు తమ ఇంటి అవసరాల కోసం ఉల్లి పాయలను కొనుగోలు చేశారు. చాలామంది ఏడాది పాటు ఇంట్లో నిల్వ చేసుకోడానికి, పెళ్లి పేరంటాల కోసం బస్తాలలో కొనుగోలు చేశారు. ఇక సంతల్లో విక్రయించే వారు తక్కువ వేలం వచ్చిన ఉల్లి కుప్పల నుంచి కొనుగోలు చేశారు. -
కొయ్యకుండానే కన్నీళ్లు
నెల్లూరు (కలెక్టరేట్) : ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. మే నెలలో ఉల్లి కిలో రూ.20 ఉండగా జూలై ప్రారంభానికి ఏకంగా రూ.10 పెరిగింది. ఇప్పుడు కిలో రూ.35 పలుకుతున్నాయి. నిత్యావసరాల్లో భాగమైన ఉల్లిని ప్రతిరోజూ వంటకాల్లో వినియోగించక తప్పదు. ఉల్లి కోయకనే సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఘాటెక్కిన ఉల్లి ధరల తో హోటల్ వ్యాపారులు అమాంతంగా వంటకాల ధరలు పెంచేస్తున్నారు. హోటల్‌కు వెళ్లి బిర్యాని, చపాతి, మాంసాహారాన్ని తీసుకుంటే ఉల్లి, నిమ్మకాయ ముక్కలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో ఉల్లిపాయలు ఇవ్వలేమని వినియోగదారులకు హోటల్ నిర్వాహకులు నిర్మొహమాటంగా చెబుతున్నారు. తగ్గిన పంటసాగు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ఉల్లి పంటసాగు తగ్గిందని స్టోన్‌హౌస్‌పేట హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. పంటసాగు గణనీయంగా తగ్గడం వల్ల ఉల్లి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయంటున్నారు. ఉల్లిపాయలు ఎక్కువగా మహారాష్ర్టలోని పూణే, అహ్మద్‌నగర్, నాశిక్ ప్రాంతాల నుంచి జిల్లాకు ఎగుమతి అవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు వచ్చినా వర్షాల జాడే లేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటడం, బోరు బావులు ఎండిపోవడం, కరెంటు కోతలు అధికమవడం వల్ల రైతులు ఈ పంటపై ఆసక్తి చూపడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. పైగా ఎండలు అధికంగా ఉండటంతో భూమిలో ఉల్లిపాయలు కుళ్లిపోతున్నాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు మరో కారణమని తెలుస్తోంది. రిటైల్ వ్యాపారుల ఇష్టారాజ్యం : బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరల పెరుగుదలను రిటైల్ వ్యాపారులు ఆసరాగా తీసుకున్నారు. డిమాండ్‌ను బట్టి ఉల్లిపాయలను విక్రయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని స్టోన్‌హౌస్‌పేట నిత్యావసర వ్యాపార రంగానికి కేంద్ర బిందువు. ఇక్కడి నుంచి ప్రతిరోజూ 40 టన్నుల వరకు నగరంలోని వివిధ వ్యాపార కేంద్రాలకు ఉల్లిపాయల విక్రయాలు జరుగుతుంటా యి. గత పదిరోజులుగా రోజుకు కనీసం 25 టన్నుల ఉల్లిపాయల విక్రయాలు జరగడంలేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరలు పెరిగే అవకాశం : ఇప్పటికే ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఉల్లి వైపు చూడటం లేదు. మరో రెండు రోజుల్లో ఉల్లి ధరలు మరింత ప్రియం కానున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే మహిళలు వంటకాల్లో ఉల్లి వినియోగాన్ని తగ్గించారు. మరింతగా ధరలు పెరిగితే మహిళలు వాటి వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి.