కొయ్యకుండానే కన్నీళ్లు
నెల్లూరు (కలెక్టరేట్) : ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. మే నెలలో ఉల్లి కిలో రూ.20 ఉండగా జూలై ప్రారంభానికి ఏకంగా రూ.10 పెరిగింది. ఇప్పుడు కిలో రూ.35 పలుకుతున్నాయి. నిత్యావసరాల్లో భాగమైన ఉల్లిని ప్రతిరోజూ వంటకాల్లో వినియోగించక తప్పదు. ఉల్లి కోయకనే సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఘాటెక్కిన ఉల్లి ధరల తో హోటల్ వ్యాపారులు అమాంతంగా వంటకాల ధరలు పెంచేస్తున్నారు. హోటల్‌కు వెళ్లి బిర్యాని, చపాతి, మాంసాహారాన్ని తీసుకుంటే ఉల్లి, నిమ్మకాయ ముక్కలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో ఉల్లిపాయలు ఇవ్వలేమని వినియోగదారులకు హోటల్ నిర్వాహకులు నిర్మొహమాటంగా చెబుతున్నారు.
తగ్గిన పంటసాగు
ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ఉల్లి పంటసాగు తగ్గిందని స్టోన్‌హౌస్‌పేట హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. పంటసాగు గణనీయంగా తగ్గడం వల్ల ఉల్లి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయంటున్నారు. ఉల్లిపాయలు ఎక్కువగా మహారాష్ర్టలోని పూణే, అహ్మద్‌నగర్, నాశిక్ ప్రాంతాల నుంచి జిల్లాకు ఎగుమతి అవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు వచ్చినా వర్షాల జాడే లేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటడం, బోరు బావులు ఎండిపోవడం, కరెంటు కోతలు అధికమవడం వల్ల రైతులు ఈ పంటపై ఆసక్తి చూపడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. పైగా ఎండలు అధికంగా ఉండటంతో భూమిలో ఉల్లిపాయలు కుళ్లిపోతున్నాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు మరో కారణమని తెలుస్తోంది.
రిటైల్ వ్యాపారుల ఇష్టారాజ్యం :
బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల పెరుగుదలను రిటైల్ వ్యాపారులు ఆసరాగా తీసుకున్నారు. డిమాండ్‌ను బట్టి ఉల్లిపాయలను విక్రయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని స్టోన్‌హౌస్‌పేట నిత్యావసర వ్యాపార రంగానికి కేంద్ర బిందువు. ఇక్కడి నుంచి ప్రతిరోజూ 40 టన్నుల వరకు నగరంలోని వివిధ వ్యాపార కేంద్రాలకు ఉల్లిపాయల విక్రయాలు జరుగుతుంటా యి. గత పదిరోజులుగా రోజుకు కనీసం 25 టన్నుల ఉల్లిపాయల విక్రయాలు జరగడంలేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.
ధరలు పెరిగే అవకాశం :
ఇప్పటికే ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఉల్లి వైపు చూడటం లేదు. మరో రెండు రోజుల్లో ఉల్లి ధరలు మరింత ప్రియం కానున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే మహిళలు వంటకాల్లో ఉల్లి వినియోగాన్ని తగ్గించారు. మరింతగా ధరలు పెరిగితే మహిళలు వాటి వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి.