ఉల్లి కోసం బారులు.. తొక్కిసలాట
కంచరపాలెం: విశాఖనగరం కంచరపాలెంలోని ఉల్లిగడ్డల విక్రయ కేంద్రం వద్ద మహిళల తోపులాట యుద్ధ వాతారణాన్నిమరిపించింది. సోమవారం ఉదయం ఏడు గంటలకే కంచరపాలెం రైతు బజార్లో కిలో రూ.20 కే ఉల్లి పాయల విక్రయ కేంద్రం మొదలైంది. మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటయ్యాయి. అయితే, 8 గంటలకల్లా మహిళల క్యూలైన్ మాత్రం కిలోమీటర్ మేర పెరిగిపోయింది. పంపిణీ ఆలస్యం అవుతుండటంతో మహిళల క్యూలో తోపులాట మొదలైంది. అక్కడ మహిళల సిగపట్లు ముదిరిపోయి పరిస్థితి అదుపుతప్పింది.
దీంతో ఒక్కసారిగా రైతుబజార్ లో గందరగోళం ఏర్పడింది. దీంతో అధికారులు ఉల్లి విక్రయాలను నిలిపి వేశారు. పురుషుల క్యూలైనును మాత్రం కొనసాగించారు. గంట తర్వాత పోలీసుల సహాయంతో విక్రయాల కౌంటర్‌ను తిరిగి ప్రారంభించారు. కాగా, కేంద్రంలో మూడు కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేయటంతో రద్దీ ఎక్కువగా ఉందని, మరిన్ని కౌంటర్లు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.