onlie booking
-
సెల్‌కు బదులు ఏటీఎం పౌచ్!
మార్కాపురం టౌన్ (ప్రకాశం): మోసపోయే వాళ్లుంటే మోసగించే వాళ్లకు కొదవ లేదనట్లు ఆన్లైన్లో సెల్ బుక్ చేస్తే ఏటీఎం పౌచ్‌లు వచ్చాయి. వివరాలు.. మార్కాపురానికి చెందిన డి.శ్రీధర్‌రెడ్డి మోటార్ వర్క్స్ షాపులో మోటార్లు రిపేరు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. పది రోజుల కిందట ఆయనకు ఫోన్ వచ్చింది. మీ నంబర్‌కు రూ.12 వేల విలువై వివో స్మార్ట్‌ఫోన్ లక్కీ డీప్‌లో తగిలిందని చెప్పారు. కేవలం రూ.4,150లకు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం నగదు లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ విధానంతో పోస్టల్ ద్వారా పార్శిల్ వస్తుందని, నగదు చెల్లించి తీసుకోవచ్చని సెలవిచ్చారు. శ్రీధర్‌రెడ్డి నగదు చెల్లించి పార్శిల్ అందుకున్నాడు. తీరా విప్పి చూస్తే ఏటీఎం కార్డులు పెట్టుకునే రెండు పౌచ్‌లు, బెల్ట్ ఉన్నాయి. మోసపోయానని గ్రహించి తిరిగి తనకు వచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగా వచ్చిన పార్శిల్‌ను తిరిగి పంపితే ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా నగదు పంపుతామని చెప్పకొచ్చారు. అంతటితో ఆగకుండా ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్ తెలపాలని కోరారు. నగదు రాకపోగా అకౌంట్లో ఉన్న నగదు కూడా పోతాయేమోనని భావించి వారికి నంబర్ చెప్పలేదు. -
ట్రిమ్మర్‌కు బదులు కండోమ్స్ ప్యాకెట్లు!
కోల్‌సిటీ(రామగుండం): ఆన్లైన్ సంస్థల మోసం మరోసారి వెలుగు చూసింది. గడ్డం గీసుకోవడానికి ఉపయోగించే ఎలక్ట్రిక్ షేవర్ (ట్రిమ్మర్) మిషన్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే... కస్టమర్‌కు కండోమ్ ప్యాకెట్లు పంపించిన విడ్డూరమైన సంఘటన గోదావరిఖనిలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... గోదావరిఖని లక్ష్మీనగర్‌లో ఎనగందుల శ్రీనివాస్ సెలూన్‌నిర్వహిస్తున్నాడు. కస్టమర్లకు మెరుగైన సేవలందించడం కోసం ఇటీవల ఎలక్ట్రిక్‌షేవర్ మిషన్ కొనుగోలు చేయాలని స్మార్ట్‌ఫోన్ ద్వారా ఓ ప్రముఖ ఆన్లైన్ కంపెనీలో ఆర్డర్ చేయడంతో పంపించారు. షేవర్‌ను వాడకముందే అది పని చేయలేదు. దీంతో ఆన్లైన్ సంస్థకు ఫిర్యాదు చేయడంతో, షేవర్‌ను స్వాధీనం చేసుకొని డబ్బులు తిరిగి పంపించారు. సదరు కంపెనీపై నమ్మకం ఏర్పడడంతో ఈనెల 11న మరో షేవర్ మిషన్ కొనుగోలుకు అదే సంస్థకు ఆర్డర్ ఇచ్చారు. ఆదివారం కొరియర్ బాయ్ ఇంటికి వచ్చి పార్సిల్ ఇచ్చాడు. తీరా దాన్ని తెరిచి చూడగా దాంట్లో కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. విస్తూపోయిన బాధితుడు హుటాహుటిన సదరు కొరియర్ కార్యాలయానికి వెళ్లి నిలదీశాడు. తమకు సంబంధం లేదని, ఆర్డర్ ఇచ్చిన ఆన్లైన్ సంస్థకే ఫిర్యాదు చేయాలని చెప్పి తప్పించుకున్నారు. దీంతో సదరు సంస్థకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడంతో, ఆర్డర్ చేసిన వస్తువుకు మరోసారి పరిశీలించి పంపిస్తామని అప్పటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. కస్టమర్ చేతికి రిటన్ ఆర్డర్‌గా బుక్ చేసిన షేవింగ్ మిషన్ పార్సిల్ వచ్చాక, కండోమ్ ప్యాకెట్లను తిరిగి పంపించాలని సంస్థ ప్రతినిధులు సూచించారని బాధితుడు తెలిపాడు. తక్కవ ధరలో లభిస్తున్నాయనే ఆశతో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇలాంటి మోసాలే జరుగుతాయని పలువురు వెల్లడిస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. -
ఆన్లైన్ సెల్ బుకింగ్‌తో మోసం
తొర్రూరు (వరంగల్): ఆన్లైన్ సెల్ బుకింగ్‌తో ఓ యువకుడు మోసపోయాడు. తొర్రూరు పట్టణానికి చెందిన ఆబోతు కుమార్ అనే యువకుడు సుమారు రూ. 18,500 విలువ చేసే సామ్సంగ్ సెల్ కోసం గతవారం రోజుల క్రితం అన్లైన్లో బుకిం గ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో సామ్సంగ్ షోరూం హైదరాబాద్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం తొర్రూరుకు వచ్చిన ఫ్యాకింగ్‌ను తీసుకుని తెరిచి చూశాడు. అందులో సామ్సంగ్ సెల్‌కు బదులు ఇనుప ముక్కతోపాటు పాతకాలం నాటి సుమారు రూ.2 వేల విలువ చేసే నోకియా సెల్, బ్యాట్రీ ఉండడంతో యువకుడు కుమార్ ఆందోళనకు గురయ్యాడు. సంబంధిత కంపెనీవారిని సమాచారం అందించినా ఏలాంటి ప్రయోజనం లేకపోవడంతో మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.