online counselling
-
ఆన్లైన్ కౌన్సెలింగ్‌తోనే వైద్య సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల బ్లాకింగ్‌కు చెక్ పెట్టే దిశగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారానే అన్ని సీట్లను భర్తీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష (ఫిజికల్) కౌన్సెలింగ్ చేపట్టవద్దని స్పష్టం చేసింది. పలుమార్లు ఆన్లైన్ కౌన్సెలింగ్‌లు నిర్వహించాలని, అప్పటికీ సీట్లు మిగిలిపోతే వాటికి ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించకుండా అలాగే వదిలేయాలని సూచించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ప్రతిభకు న్యాయం 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్ఎంసీ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సీట్ల బ్లాకింగ్ నిలిచిపోతుందని, ఫలితంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. అభ్యర్థుల ఫిర్యాదులు, కోర్టు కేసులను పరిష్కరించడంలో ఇది సాయపడుతుందని ఎన్ఎంసీ కూడా స్పష్టం చేసింది. కాగా ఈసారి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ యాజమాన్య సీట్లు దాదాపు 50కు పైగా, పీజీ మెడికల్‌లో 30కి పైగా మిగిలిపోయే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. బ్లాకింగ్‌తో కోట్లు దండుకున్న కాలేజీలు! గతేడాది వరకు ఎంబీబీఎస్, పీజీ సీట్ల బ్లాకింగ్‌తో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమ వ్యాపారం చేశాయనే ఆరోపణలున్నాయి. ప్రతిభ కలిగిన విద్యార్థులు తమ కాలేజీల్లోని ఏ, బీ కేటగిరీ సీట్లలో చేరేలా యాజమాన్యాలు ముందస్తు అవగాహన కుదుర్చుకునేవి. దీంతో ఈ కేటగిరీలకు రెండు విడతల కౌన్సెలింగ్, చివరి మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్‌లు పూర్తయ్యేవరకు ఉత్తమ ర్యాంకర్లు తమ సీట్లను అలాగే అట్టిపెట్టుకునేవారు. అన్ని కౌన్సెలింగ్‌లూ పూర్తయిన తర్వాత ఒకవేళ సీట్లు మిగిలితే అవి ఆటోమెటిక్‌గా సీ (ఎన్ఆర్ఐ) కేటగిరీ సీట్లుగా మారిపోతాయి. ఆ సమయంలో అప్పటికే ఫీజు చెల్లించిన మెరిట్ విద్యార్థులు ముందుగా కుదుర్చుకున్న అవగాహన మేరకు తమ సీట్లు వదిలేసుకునేవారు. దీంతో ఇవి కూడా నిబంధనల ప్రకారం సీ కేటగిరీ సీట్లుగా మారిపోతాయి. వీటికి అభ్యర్థులతో ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా ప్రైవేట్ కాలేజీలు కోట్లు దండుకునేవి. కన్వీనర్ కోటాకు ఏడాదికి రూ.60 వేలు, బీ కేటగిరీ సీటుకు రూ.11.55 లక్షల ఫీజు ఉంటుంది. ఇక సీ కేటగిరీ సీటుకు బీ కేటగిరీ సీటు కంటే రెట్టింపు ఫీజు ఉంటుంది. అంటే ఏడాదికి రూ.23.10 లక్షల వరకు ఉంటుందన్న మాట. ఇలా కోర్సు మొత్తానికి కోటికి పైగా వసూలు చేస్తారు. రూ.60 వేలున్న కన్వీనర్ కోటా సీటును కూడా అదే రేటుకు అమ్ముకునేవారు. ఇక అవగాహన మేరకు వర్సిటీకి రూ.3 లక్షల జరిమానా చెల్లించి మరీ సీట్లు వదులుకున్న విద్యార్థులకు వాళ్లు చెల్లించిన ఫీజుతో పాటు రూ.10 లక్షల వరకు అదనంగా యాజమాన్యాలు చెల్లిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ విద్యార్థులు ఆ తర్వాత ఇతర కాలేజీల్లో చేరిపోయేవారు. ఇతర రాష్ట్రాల ముఠాల ప్రమేయం గతంలో మాదిరిగానే ఏ, బీ కేటగిరీ సీట్లను సీ కేటగిరీగా మార్చుకునేలా యాజమాన్యాలు విద్యార్థులకు వల వేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ దందాలో అనేక ఇతర రాష్ట్రాల ముఠాలు, ప్రైవేటు కాలేజీలు, కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాలుపంచుకుంటున్నట్లు తెలిసింది. గతంలో కర్ణాటకలో జరిగిన ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో కాలేజీల చైర్మన్లు, వైద్యాధికారులు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇదంతా గుట్టుగా సాగిపోతుండటం గమనార్హం కాగా.. ఎన్ఎంసీ తాజా నిర్ణయంతో సీట్ల బ్లాకింగ్‌కు చెక్ పడుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. -
నీట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : నీట్–2019 ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) బుధవారం (జూన్ 12) విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా 15 శాతం ఆలిండియా కోటా/ డీమ్డ్/సెంట్రల్ యూనివర్సిటీలు/ ఈఎస్ఐ, ఏఎఫ్ఎంఎస్ (ఎంబీబీఎస్/బీడీఎస్) సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంసీసీ ప్రకటించిన కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకారం జూన్ 19 నుంచి మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 25న మధ్యాహ్నం 2 గంటల్లోగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత కౌన్సెలింగ్ దరఖాస్తు ప్రక్రియ 24 వరకు కొనసాగనుంది. అనంతరం జూన్ 25న ఛాయిస్ ఫిల్లింగ్, 26న సీట్ల కేటాయింపు చేపడతారు. జూన్ 27న మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించనున్నారు. ఆగస్టు 20 నుంచి 26 మధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు జూన్ 28 నుంచి జూలై 3లోగా సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్... ఇక రెండో విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 6 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థుల నుంచి జూలై 6 – 9 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. 9న మధ్యాహ్నం 12 గంటల్లోగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థులు అదేరోజు ఛాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం జూలై 10, 11 తేదీల్లో సీట్లు కేటాయించి.. 12న సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించనున్నారు. సీట్లు పొందినవారు జూలై 13 – 22 మధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. చివరి విడత కౌన్సెలింగ్ చివరి విడతగా సెంట్రల్/ డీమ్డ్/ ఈఎస్ఐసీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 16 వరకు ఫీజు చెల్లించాలి. అనంతరం అదే రోజు సాయంత్రం 5 గంటల్లోగా చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 17న సీట్లను కేటాయి స్తారు. 18న సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటి స్తారు. ఆగస్టు 20 నుంచి 26 మధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. -
ఎంసెట్ కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ఆందోళన
-
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో గందరగోళం
ఎంసెట్ ఆన్లైన్ కౌన్సెలింగ్.. ఈ ఏడాదే తొలిసారి ప్రారంభమైన ప్రక్రియ. ఆప్షన్లు వెబ్సైట్లో నమోదు చేయడం ముందే ఉన్నప్పటికీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లోనే జరగడం ఇదే మొదటిసారి. గతంలో వెబ్ ఆప్షన్లు నమోదు ఉన్నప్పటికీ సర్టిఫికెట్ల పరిశీలన కోసం కేంద్రాలకు నేరుగా హాజరు కావాల్సి వచ్చేది, ఈ ఏడాది మాత్రం అంతా ఆన్లైన్లోనే. కౌన్సెలింగ్ సెంటర్లకు దూరప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు ఇది అనుకూలమైన అంశమే.. కానీ దీనిపై అవగాహన కల్పించే వారేరీ? ఒకవైపు సరైన సమాచారం లేక కొందరు.. ర్యాంక్ కార్డులు రాక మరికొందరు.. పేమెంట్ ఎకనాలెడ్జ్మెంట్ రాకపోవడం, మరికొందరికి రెండుసార్లు పేమెంట్ అయినట్లు రావడం వంటి ఎన్నో సమస్యలతో చాలామంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హెల్ప్‌లైన్ సెంటర్లకు క్యూ కట్టారు. ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఎంసెట్ కౌన్సెలింగ్‌లో గందరగోళం ఎదురవుతోంది. ఆన్లైన్ కౌన్సెలింగ్‌పై విద్యార్థులకు పూర్తి సమాచారం అందించడంలో అధికారులు విఫలం కావడంతో పాత విధానంలో కౌన్సెలింగ్ జరుగుతుందనుకుని చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులను వెంటబెట్టుకుని ఏయూలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రానికి ఉదయాన్నే చేరుకున్నారు. వీరిలో దూర ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నారు. వీరంతా అరకొర సమాచారంతో ఏం చేయాలో తెలియక కౌన్సెలింగ్ కేంద్రం వద్దే పడిగాపులు కాశారు. తీరా ఇక్కడ కేంద్రాల వద్ద విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఏయూలో సెక్యూరిటీ సిబ్బందే విద్యార్థుల సందేహాలకు సమాధానం ఇవ్వడం కనిపించింది. వర్సిటీ పరిశోధకులు, సహాయ ఆచార్యుల సహకారం తీసుకుని విద్యార్థులకు పూర్తి సమాచారం ఇస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఓపెన్ కాని లింక్ విద్యార్థులు ముందుగా కౌన్సెలింగ్ రుసుము చెల్లించాలి. దీనిని ఆన్లైన్ విధానంలో వెబ్సైట్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన సమాచారం, లింక్ పొందు పరచలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. ఏయూ కేంద్రం సంచాలకులు ఆచార్య కూడ నాగేశ్వరరావు వెంటనే ఎంసెట్ అధికారులతో మాట్లాడి ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చునే సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచాలని సూచించారు. దీంతో కొద్దిసేపు సందిగ్ధత నెలకొంది. వారు కేంద్రానికి రావాల్సిందే.. ఎంసెట్ నిర్వహణ అధికారుల నుంచి ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రాలకు పూర్తిస్థాయి సూచనలు, ఆదేశాలు రాలేదని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 వేలకు పైగా విద్యార్థుల పూర్తి సమాచారాన్ని అప్లోడ్ చేయలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. వీరంతో దగ్గరలోని కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లవలసి ఉంది. ర్యాంక్ కార్డేదీ? నరసాపురం నుంచి వచ్చిన బి.ఫిలిప్ అనే విద్యార్థికి ర్యాంకు కార్డు రాలేదు. దీనితో ఇతను ఏయూలోని కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చి ర్యాంకు కార్డు కోసం అధికారులను అడిగాడు. తమకు సంబంధం లేదని కాకినాడ జేఎన్టీయూలో ఎంసెట్ కన్వీనర్‌ను కలవాలని వీరు సమాధానం ఇవ్వడంతో వెనుదిరిగాడు. ఇదీ కారణం ఎంసెట్ కౌన్సెలింగ్ చేసే వ్యవస్థకు, ఫీజు చెల్లింపునకు వినియోగిస్తున్న పేమెంట్ గేట్ వే(థర్డ్ పార్టీ) వ్యవస్థకు మధ్య సమన్వయం కొరవడిందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగానే విద్యార్థులకు మెసేజ్‌లు సరిగా రావడం లేదని వీరు చెబుతున్నారు. సంసిద్ధత లేకనే.. ఏయూలోని కేంద్రానికి వచ్చిన విద్యార్థులను ర్యాంకుల వారీగా పిలిచి, సమస్యలు తెలుసుకుని, ఆన్లైన్లో సరిచేసి పంపుతున్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవస్థపై ముందస్తు సంసిద్ధత లేకుపోవడంతో తొలిరోజు తీవ్ర గందరగోళానికి దారితీసింది. మిగిలిన రెండు రోజులైనా సాఫీగా జరుగుతుందా అనే సందేహం వ్యక్తం అవుతోంది. కౌన్సెలింగ్ ప్రక్రియ ఇలా.. ⇔ విద్యార్థులు గతంలోలా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లనవసరం లేదు. ⇔ ఎంసెట్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ వివరాలను అధికారులు ఆన్లైన్లో స్వీకరిస్తారు, దానికి సంబంధించిన సమాచారం దరఖాస్తు సమయంలో అందించిన మొబైల్ నంబర్లకు వస్తుంది. ఒకవేళ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏవైనా సర్టిఫికెట్లు అప్లోడ్ చేయకుంటే వాటికి సంబంధించిన సమాచారం కూడా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది. ⇔ 28 నుంచి 30వ తేదీ లోపు ఎంసెట్ వెబ్సైట్లో హాల్‌టికెట్ నంబరు, ఫోన్ నంబరు, పుట్టిన తేదీ నమోదు చేసి నిర్ణీత రుసుము చెల్లించాలి. ⇔ ఆన్లైన్ ప్రాసెస్ ఫీజు చెల్లించిన వెంటనే విద్యార్థికి సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్) వస్తుంది. ⇔ ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన సమయంలో పూర్తి వివరాలు అందించిన వారికి ప్రాసెస్ ఫీజు చెల్లించినట్టు, లాగిన్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబరుతో ఈ సందేశం వస్తుంది. ⇔ ఈ సందేశం వచ్చిన వారు కౌన్సెలింగ్ సెంటర్‌కు వెళ్లనవసరం లేదు, వీరు నేరుగా వెబ్ ఆప్షన్లు ఇస్తే సరిపోతుంది. ⇔ ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన తరువాత లాగిన్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబరు రాని విద్యార్థులు మాత్రం సమీపంలోని ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లవలసి ఉంటుంది. ⇔ విద్యార్థులకు ఎటువంటి ఇతర సమస్యలు, సందేహాలు ఉన్నా సమీపంలోని కౌన్సెలింగ్ కేంద్రంలో సంప్రదించవచ్చు. ⇔ ఎంసెట్‌లో ర్యాంకు ప్రకటించని విద్యార్థులు కాకినాడ జెఎన్టీయూలోని ఎంసెట్ కన్వీనర్‌ను కలవాల్సి ఉంటుంది. ⇔ ఏయూ కౌన్సెలింగ్ కేంద్రంలో అధికారులు విద్యార్థుల సర్టిపికెట్లను ప్రత్యక్షంగా పరిశీలించి వాటిని అప్లోడ్ చేస్తారు. ⇔ తరువాత విద్యార్థులకు లాగిన్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబర్లు వస్తాయి, వీటి ఆధారంగా వెబ్ ఆప్షన్లు ఇవ్వవలసి ఉంటుంది. -
పీజీ ప్రవేశాలకు ఇకపై ఒకే పరీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు ఇకపై ఒకటే ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వేర్వేరు యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వేర్వేరుగా ప్రవేశ పరీక్షల నిర్వహణ సరికాదన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్ చేసినందున పీజీ ప్రవేశాలను ఆన్లైన్ చేయడంతోపాటు ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2017-18 విద్యా సంవత్సరంలో దీనిని అమల్లోకి తేవాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలను కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులు వివిధ జిల్లాల్లోని యూనివర్సిటీ క్యాంపస్‌లు, పీజీ కాలేజీల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీ క్యాంపస్‌లు, ప్రభుత్వ పీజీ కాలేజీలు 76 ఉండగా, ప్రైవేటు పీజీ కాలేజీలు 444 ఉన్నాయి. వాటిల్లోని 25,285 పీజీ సీట్లను కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అయితే యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలకు అధిక డిమాండ్ ఉండటంతో విద్యార్థులు రెండు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది. పైగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష రాసేందుకు హైదరాబాద్, మహబూబ్ననగర్ , రంగారెడ్డి తదితర జిల్లాల అభ్యర్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలే జీలు, ఇతర యూనివర్సిటీ క్యాంపస్‌లలో చేరేందుకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే యూనివర్సిటీ ద్వారా ప్రవేశ పరీక్షను అన్ని జిల్లాల్లో నిర్వహించి ఆ ర్యాంకుల ఆధారంగా అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో చేరేలా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే కాకతీయ, ఉస్మానియా, ఇతర యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లతోనూ దీనిపై సమావేశం నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీ ఒక్కటే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. -
జూన్ 9 నుంచి గీతం ఇంజనీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్
సాగర్‌నగర్ (విశాఖపట్నం) : గీతం వర్సిటీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి జూన్9 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల డెరైక్టర్ కె. నరేంద్ర తెలిపారు. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ అడ్మిషన్ కౌన్సెలింగ్ కోసం విశాఖ, హైదరాబాద్ సిటీ, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ రూద్రారం గీతం ప్రాంగణం, బెంగళూరు సిటీ , కర్ణాటకలోని దొడ్డబళ్ళాపూర్ ప్రాంగణంలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జూన్9వ తేదీన 1నుంచి 5000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అలాగే 10వ తేదీన 5001 నుంచి 9500 ర్యాంకు వరకు, 11వ తేదీన 9501 నుంచి 14000 వరకు, 12వ తేదీన 14001 నుంచి 18500 వరకు, 13వ తేదీన 18501 నుంచి 23000 ర్యాంకు వరకు, 14వ తేదీన 23001 నుంచి 28000 ర్యాంకు వరకు అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. 14వ తేదీన మధ్యాహ్నం ఎం.ఫార్మసీ, ఎంటెక్ కోర్సులకు అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. విద్యార్థులు గీతం విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.gitam.edu నుంచి కౌన్సెలింగ్ కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.