ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో గందరగోళం | Students And Parents Confuxing In Mcet online counselling Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో గందరగోళం

Published Tue, May 29 2018 12:39 PM | Last Updated on Wed, May 30 2018 11:13 AM

Students And Parents Confuxing In Mcet online counselling Visakhapatnam - Sakshi

కౌన్సెలింగ్‌ కేంద్రం వద్ద సందేహాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు సమాధానమిస్తున్న సిబ్బంది

ఎంసెట్‌ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌.. ఈ ఏడాదే తొలిసారి ప్రారంభమైన ప్రక్రియ. ఆప్షన్లు వెబ్‌సైట్‌లో నమోదు చేయడం ముందే ఉన్నప్పటికీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కూడా ఆన్‌లైన్‌లోనే జరగడం ఇదే మొదటిసారి. గతంలో వెబ్‌ ఆప్షన్లు నమోదు ఉన్నప్పటికీ సర్టిఫికెట్ల పరిశీలన కోసం కేంద్రాలకు నేరుగా హాజరు కావాల్సి వచ్చేది, ఈ ఏడాది మాత్రం అంతా ఆన్‌లైన్‌లోనే. కౌన్సెలింగ్‌ సెంటర్లకు దూరప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు ఇది అనుకూలమైన అంశమే.. కానీ దీనిపై అవగాహన కల్పించే వారేరీ? ఒకవైపు సరైన సమాచారం లేక కొందరు.. ర్యాంక్‌ కార్డులు రాక మరికొందరు.. పేమెంట్‌ ఎకనాలెడ్జ్‌మెంట్‌ రాకపోవడం, మరికొందరికి రెండుసార్లు పేమెంట్‌ అయినట్లు రావడం వంటి ఎన్నో సమస్యలతో చాలామంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హెల్ప్‌లైన్‌ సెంటర్లకు క్యూ కట్టారు.

ఏయూక్యాంపస్‌(విశాఖ తూర్పు): ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో గందరగోళం ఎదురవుతోంది. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌పై విద్యార్థులకు పూర్తి సమాచారం అందించడంలో అధికారులు విఫలం కావడంతో పాత విధానంలో కౌన్సెలింగ్‌ జరుగుతుందనుకుని చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులను వెంటబెట్టుకుని ఏయూలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రానికి ఉదయాన్నే చేరుకున్నారు. వీరిలో దూర ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నారు. వీరంతా అరకొర సమాచారంతో ఏం చేయాలో తెలియక కౌన్సెలింగ్‌ కేంద్రం వద్దే పడిగాపులు కాశారు. తీరా ఇక్కడ కేంద్రాల వద్ద విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఏయూలో సెక్యూరిటీ సిబ్బందే విద్యార్థుల సందేహాలకు సమాధానం ఇవ్వడం కనిపించింది. వర్సిటీ పరిశోధకులు, సహాయ ఆచార్యుల సహకారం తీసుకుని విద్యార్థులకు పూర్తి సమాచారం ఇస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు.

ఓపెన్‌ కాని లింక్‌
విద్యార్థులు ముందుగా కౌన్సెలింగ్‌ రుసుము చెల్లించాలి. దీనిని ఆన్‌లైన్‌ విధానంలో వెబ్‌సైట్‌లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏపీ ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన సమాచారం, లింక్‌ పొందు పరచలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. ఏయూ కేంద్రం సంచాలకులు ఆచార్య కూడ నాగేశ్వరరావు వెంటనే ఎంసెట్‌ అధికారులతో మాట్లాడి ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చునే సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచాలని సూచించారు. దీంతో కొద్దిసేపు సందిగ్ధత నెలకొంది.

వారు కేంద్రానికి రావాల్సిందే..
ఎంసెట్‌ నిర్వహణ అధికారుల నుంచి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాలకు పూర్తిస్థాయి సూచనలు, ఆదేశాలు రాలేదని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 వేలకు పైగా విద్యార్థుల పూర్తి సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. వీరంతో దగ్గరలోని కౌన్సెలింగ్‌ కేంద్రానికి వెళ్లవలసి ఉంది.

ర్యాంక్‌ కార్డేదీ?
నరసాపురం నుంచి వచ్చిన బి.ఫిలిప్‌ అనే విద్యార్థికి ర్యాంకు కార్డు రాలేదు. దీనితో ఇతను ఏయూలోని కౌన్సెలింగ్‌ కేంద్రానికి వచ్చి ర్యాంకు కార్డు కోసం అధికారులను అడిగాడు. తమకు సంబంధం లేదని కాకినాడ జేఎన్‌టీయూలో ఎంసెట్‌ కన్వీనర్‌ను కలవాలని వీరు సమాధానం ఇవ్వడంతో వెనుదిరిగాడు.

ఇదీ కారణం
ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ చేసే వ్యవస్థకు, ఫీజు చెల్లింపునకు వినియోగిస్తున్న పేమెంట్‌ గేట్‌ వే(థర్డ్‌ పార్టీ) వ్యవస్థకు మధ్య సమన్వయం కొరవడిందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగానే విద్యార్థులకు మెసేజ్‌లు సరిగా రావడం లేదని వీరు చెబుతున్నారు.

సంసిద్ధత లేకనే..
ఏయూలోని కేంద్రానికి వచ్చిన విద్యార్థులను ర్యాంకుల వారీగా పిలిచి, సమస్యలు తెలుసుకుని, ఆన్‌లైన్‌లో సరిచేసి పంపుతున్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవస్థపై ముందస్తు సంసిద్ధత లేకుపోవడంతో తొలిరోజు తీవ్ర గందరగోళానికి దారితీసింది. మిగిలిన రెండు రోజులైనా సాఫీగా జరుగుతుందా అనే సందేహం వ్యక్తం అవుతోంది.

కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఇలా..
విద్యార్థులు గతంలోలా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం కౌన్సెలింగ్‌ కేంద్రాలకు వెళ్లనవసరం లేదు.
ఎంసెట్‌ దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్‌ వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు, దానికి సంబంధించిన సమాచారం దరఖాస్తు సమయంలో అందించిన మొబైల్‌ నంబర్లకు వస్తుంది. ఒకవేళ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏవైనా సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయకుంటే వాటికి సంబంధించిన సమాచారం కూడా రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వస్తుంది.  
28 నుంచి 30వ తేదీ లోపు ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్‌ నంబరు, ఫోన్‌ నంబరు, పుట్టిన తేదీ నమోదు చేసి నిర్ణీత రుసుము చెల్లించాలి.
ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ ఫీజు చెల్లించిన వెంటనే విద్యార్థికి సంక్షిప్త సందేశం(ఎస్‌ఎంఎస్‌) వస్తుంది.
ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన సమయంలో పూర్తి వివరాలు అందించిన వారికి ప్రాసెస్‌ ఫీజు చెల్లించినట్టు, లాగిన్‌ ఐడీ, రిజిస్ట్రేషన్‌ నంబరుతో ఈ సందేశం వస్తుంది.
ఈ సందేశం వచ్చిన వారు కౌన్సెలింగ్‌ సెంటర్‌కు వెళ్లనవసరం లేదు, వీరు నేరుగా వెబ్‌ ఆప్షన్లు ఇస్తే సరిపోతుంది.
ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించిన తరువాత లాగిన్‌ ఐడీ, రిజిస్ట్రేషన్‌ నంబరు రాని విద్యార్థులు మాత్రం సమీపంలోని ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ కేంద్రానికి వెళ్లవలసి ఉంటుంది.
విద్యార్థులకు ఎటువంటి ఇతర సమస్యలు, సందేహాలు ఉన్నా సమీపంలోని కౌన్సెలింగ్‌ కేంద్రంలో సంప్రదించవచ్చు.
ఎంసెట్‌లో ర్యాంకు ప్రకటించని విద్యార్థులు కాకినాడ జెఎన్‌టీయూలోని ఎంసెట్‌ కన్వీనర్‌ను కలవాల్సి ఉంటుంది.
ఏయూ కౌన్సెలింగ్‌ కేంద్రంలో అధికారులు విద్యార్థుల సర్టిపికెట్లను ప్రత్యక్షంగా పరిశీలించి వాటిని అప్‌లోడ్‌ చేస్తారు.
తరువాత విద్యార్థులకు లాగిన్‌ ఐడీ, రిజిస్ట్రేషన్‌ నంబర్లు వస్తాయి, వీటి ఆధారంగా వెబ్‌ ఆప్షన్లు ఇవ్వవలసి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement