MCet
-
గురుకుల విద్యార్థులకు ఎంసెట్‌లో ప్రత్యేక శిక్షణ
విశాఖపట్నం, గూడెంకొత్తవీధి (పాడేరు) : ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడికల్ సీటు పొందేందుకు మూడు జిల్లాల్లోని గురుకుల చెందిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు జీకే వీధి గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ పద్మకుమారి అన్నారు. ఇంటర్ మొదటి, ద్వి తీయ సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థు లకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రధానంగా మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షకు శిక్షణ ఇస్తున్నామన్నారు. విశాఖ జిల్లా బాలికలకు జీకే వీధిలో, బాలురకు అరకులోయలో ఈ శిక్షణ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కురుపాం, సీతంపేట, పి.కొత్తవలస, భద్రగిరి, అరకులోయ, జీకే వీధి గురుకుల కళాశాలలకు చెందిన బాలికలకు జీకే వీధి, జి.మాడుగుల, కొయ్యూరు, అరకులోయ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన బాలురకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మార్చి 14 నుంచి ఈ నెలాఖరు వరకు ప్రతి కళాశాల నుంచి 100 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారని, వీరందరికి వసతి, భోజన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఎంసెట్‌లో మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు పొం దేందుకు విద్యాశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ ఎంతో అవసరం మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చదివే పేద విద్యార్థు లకు ఎంతో డబ్బులు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకుంటుంటారు. అయితే విద్యాశాఖ ద్వారా గురుకుల విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరం. ఇది ఎంతో ఉపయోగపడుతుంది.– అశ్వని, కురుపాం, విజయనగరం జిల్లా -
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో గందరగోళం
ఎంసెట్ ఆన్లైన్ కౌన్సెలింగ్.. ఈ ఏడాదే తొలిసారి ప్రారంభమైన ప్రక్రియ. ఆప్షన్లు వెబ్సైట్లో నమోదు చేయడం ముందే ఉన్నప్పటికీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లోనే జరగడం ఇదే మొదటిసారి. గతంలో వెబ్ ఆప్షన్లు నమోదు ఉన్నప్పటికీ సర్టిఫికెట్ల పరిశీలన కోసం కేంద్రాలకు నేరుగా హాజరు కావాల్సి వచ్చేది, ఈ ఏడాది మాత్రం అంతా ఆన్లైన్లోనే. కౌన్సెలింగ్ సెంటర్లకు దూరప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు ఇది అనుకూలమైన అంశమే.. కానీ దీనిపై అవగాహన కల్పించే వారేరీ? ఒకవైపు సరైన సమాచారం లేక కొందరు.. ర్యాంక్ కార్డులు రాక మరికొందరు.. పేమెంట్ ఎకనాలెడ్జ్మెంట్ రాకపోవడం, మరికొందరికి రెండుసార్లు పేమెంట్ అయినట్లు రావడం వంటి ఎన్నో సమస్యలతో చాలామంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హెల్ప్‌లైన్ సెంటర్లకు క్యూ కట్టారు. ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఎంసెట్ కౌన్సెలింగ్‌లో గందరగోళం ఎదురవుతోంది. ఆన్లైన్ కౌన్సెలింగ్‌పై విద్యార్థులకు పూర్తి సమాచారం అందించడంలో అధికారులు విఫలం కావడంతో పాత విధానంలో కౌన్సెలింగ్ జరుగుతుందనుకుని చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులను వెంటబెట్టుకుని ఏయూలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రానికి ఉదయాన్నే చేరుకున్నారు. వీరిలో దూర ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నారు. వీరంతా అరకొర సమాచారంతో ఏం చేయాలో తెలియక కౌన్సెలింగ్ కేంద్రం వద్దే పడిగాపులు కాశారు. తీరా ఇక్కడ కేంద్రాల వద్ద విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఏయూలో సెక్యూరిటీ సిబ్బందే విద్యార్థుల సందేహాలకు సమాధానం ఇవ్వడం కనిపించింది. వర్సిటీ పరిశోధకులు, సహాయ ఆచార్యుల సహకారం తీసుకుని విద్యార్థులకు పూర్తి సమాచారం ఇస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఓపెన్ కాని లింక్ విద్యార్థులు ముందుగా కౌన్సెలింగ్ రుసుము చెల్లించాలి. దీనిని ఆన్లైన్ విధానంలో వెబ్సైట్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన సమాచారం, లింక్ పొందు పరచలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. ఏయూ కేంద్రం సంచాలకులు ఆచార్య కూడ నాగేశ్వరరావు వెంటనే ఎంసెట్ అధికారులతో మాట్లాడి ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చునే సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచాలని సూచించారు. దీంతో కొద్దిసేపు సందిగ్ధత నెలకొంది. వారు కేంద్రానికి రావాల్సిందే.. ఎంసెట్ నిర్వహణ అధికారుల నుంచి ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రాలకు పూర్తిస్థాయి సూచనలు, ఆదేశాలు రాలేదని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 వేలకు పైగా విద్యార్థుల పూర్తి సమాచారాన్ని అప్లోడ్ చేయలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. వీరంతో దగ్గరలోని కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లవలసి ఉంది. ర్యాంక్ కార్డేదీ? నరసాపురం నుంచి వచ్చిన బి.ఫిలిప్ అనే విద్యార్థికి ర్యాంకు కార్డు రాలేదు. దీనితో ఇతను ఏయూలోని కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చి ర్యాంకు కార్డు కోసం అధికారులను అడిగాడు. తమకు సంబంధం లేదని కాకినాడ జేఎన్టీయూలో ఎంసెట్ కన్వీనర్‌ను కలవాలని వీరు సమాధానం ఇవ్వడంతో వెనుదిరిగాడు. ఇదీ కారణం ఎంసెట్ కౌన్సెలింగ్ చేసే వ్యవస్థకు, ఫీజు చెల్లింపునకు వినియోగిస్తున్న పేమెంట్ గేట్ వే(థర్డ్ పార్టీ) వ్యవస్థకు మధ్య సమన్వయం కొరవడిందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగానే విద్యార్థులకు మెసేజ్‌లు సరిగా రావడం లేదని వీరు చెబుతున్నారు. సంసిద్ధత లేకనే.. ఏయూలోని కేంద్రానికి వచ్చిన విద్యార్థులను ర్యాంకుల వారీగా పిలిచి, సమస్యలు తెలుసుకుని, ఆన్లైన్లో సరిచేసి పంపుతున్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవస్థపై ముందస్తు సంసిద్ధత లేకుపోవడంతో తొలిరోజు తీవ్ర గందరగోళానికి దారితీసింది. మిగిలిన రెండు రోజులైనా సాఫీగా జరుగుతుందా అనే సందేహం వ్యక్తం అవుతోంది. కౌన్సెలింగ్ ప్రక్రియ ఇలా.. ⇔ విద్యార్థులు గతంలోలా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లనవసరం లేదు. ⇔ ఎంసెట్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ వివరాలను అధికారులు ఆన్లైన్లో స్వీకరిస్తారు, దానికి సంబంధించిన సమాచారం దరఖాస్తు సమయంలో అందించిన మొబైల్ నంబర్లకు వస్తుంది. ఒకవేళ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏవైనా సర్టిఫికెట్లు అప్లోడ్ చేయకుంటే వాటికి సంబంధించిన సమాచారం కూడా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది. ⇔ 28 నుంచి 30వ తేదీ లోపు ఎంసెట్ వెబ్సైట్లో హాల్‌టికెట్ నంబరు, ఫోన్ నంబరు, పుట్టిన తేదీ నమోదు చేసి నిర్ణీత రుసుము చెల్లించాలి. ⇔ ఆన్లైన్ ప్రాసెస్ ఫీజు చెల్లించిన వెంటనే విద్యార్థికి సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్) వస్తుంది. ⇔ ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన సమయంలో పూర్తి వివరాలు అందించిన వారికి ప్రాసెస్ ఫీజు చెల్లించినట్టు, లాగిన్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబరుతో ఈ సందేశం వస్తుంది. ⇔ ఈ సందేశం వచ్చిన వారు కౌన్సెలింగ్ సెంటర్‌కు వెళ్లనవసరం లేదు, వీరు నేరుగా వెబ్ ఆప్షన్లు ఇస్తే సరిపోతుంది. ⇔ ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన తరువాత లాగిన్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబరు రాని విద్యార్థులు మాత్రం సమీపంలోని ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లవలసి ఉంటుంది. ⇔ విద్యార్థులకు ఎటువంటి ఇతర సమస్యలు, సందేహాలు ఉన్నా సమీపంలోని కౌన్సెలింగ్ కేంద్రంలో సంప్రదించవచ్చు. ⇔ ఎంసెట్‌లో ర్యాంకు ప్రకటించని విద్యార్థులు కాకినాడ జెఎన్టీయూలోని ఎంసెట్ కన్వీనర్‌ను కలవాల్సి ఉంటుంది. ⇔ ఏయూ కౌన్సెలింగ్ కేంద్రంలో అధికారులు విద్యార్థుల సర్టిపికెట్లను ప్రత్యక్షంగా పరిశీలించి వాటిని అప్లోడ్ చేస్తారు. ⇔ తరువాత విద్యార్థులకు లాగిన్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబర్లు వస్తాయి, వీటి ఆధారంగా వెబ్ ఆప్షన్లు ఇవ్వవలసి ఉంటుంది. -
ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో అవస్థలు
యూనివర్సిటీ క్యాంపస్: ఎంసెట్ ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. తొలిసారిగా ఇంటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ కౌన్సెలింగ్ తొలిరోజే ఇక్కట్లు తెచ్చిపెట్టింది. రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు ఫీజు చెల్లించినా... ఫీజు చెల్లించినట్లు మొబైల్‌కు మెసేజ్‌లు రాలేదు. రెండోసారి, మూడోసారి ఫీజు చెల్లించినా ఫలితం లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వారంతా ఎస్వీయూలో హెల్ప్‌లైన్ సెంటర్లకు తరలివెళ్లారు. సర్వర్ సమస్య ఉందని.. వేచి చూడాలని హెల్ప్‌లైన్ సెంటర్లో సిబ్బంది సూచిస్తున్నారు. పనిచేయని సర్వర్ ఏపీ ఎంసెట్ –2018 కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ప్రకారం దరఖాస్తు చేసిన సమయంలో సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి. ఈ సర్టిఫికెట్లను డేటా బేస్ ద్వారా అధికారులు ఇప్పటికే తనిఖీ చేశారు. దీనివల్ల కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లి సర్టిఫికెట్లను తనిఖీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లలో తప్పులున్నా.., కొన్ని అప్లోడ్ చేయకపోయినా దగ్గరలోని హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లి తప్పులు సరిదిద్దుకోవాలి. అవసరమైన పక్షంలో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. ఇలాంటి వారికి మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. వారు మాత్రమే హెల్ప్‌లైన్ సెంటర్‌కు రావాలి. మిగలిన వారు ఇంటి నుంచి..లేదా ఇంటర్నెట్ సెంటర్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం వారికి నిర్ధేశించిన తేదీల్లో బ్రాంచ్, కళాశాల ఎంపిక కోసం వెబ్ ఆప్సన్ ఇచ్చుకోవాలి. ఇదంతా చేసుకోవడానికి ముందు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఓసీ, బీసీలు 1,200 రూపాయలు, ఎస్సీ, ఎస్టీలు 600 రూ చెల్లించాలి. మధ్యాహ్నం 2 వరకు సర్వర్ పనిచేయలేదు. చాలా మంది రిజస్ట్రేషన్ ఫీజు చెల్లించలేకపోయారు. సరిగారాని ఎస్ఎంఎస్లు చాలా మందికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన మెసేజ్ రాలేదు. రెండో సారి, మూడోసారి చెల్లించినా రాలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. తమ సర్టిఫికెట్లలో తప్పులు సరిదిద్దుకోవటానికి, అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడానికి వీలు లేకుండా పోతుంది. విద్యార్థులు ఆందోళనకు గురై హెల్ప్‌లైన్ సెంటర్‌కు తరలి వచ్చినా.. వారు ఏమీ చేయలేని పరిస్థితి. సాయంత్రం 6 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్య వంద దాటలేదు. హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించండి విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాక.. వారి మొబైల్‌కు ఎస్ఎంఎస్ రాక పోయినా ఆందోళనకు గురికావాల్సిన పని లేదు. తొలిసారిగా ఈ విధానం ప్రవేశపెట్టడంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఫీజు చెల్లించాక కాసేపు ఎదురు చూస్తే ఎస్ఎంఎస్ వస్తుంది. రెండు, మూడు సార్లు ఫీజు చెల్లించిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వారి అకౌంట్‌కు రీఫండ్ అవుతుంది. ఎలాంటి సందేహాలు ఉన్నా.. ఎస్వీయూలో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సందర్శించండి. –ప్రొఫెసర్ జీఎన్.ప్రదీప్‌కుమార్, క్యాంప్ ఆఫీసర్, హెల్ప్‌లైన్ సెంటర్, ఎస్వీయూ -
మెడిసిన్.. మెరిక : స్టేట్ ఐదో ర్యాంకు
ఎంసెట్ పరీక్ష రోజే ఈ అమ్మాయికి విపరీతమైన జ్వరం.... నీరసంతో నడిచేందుకు కూడా కష్టపడుతోంది. వెంటనే కళాశాల యాజమాన్యం ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి.. అక్కడి నుండి నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లిందా అమ్మాయి. లక్ష్య సాధనపైనే గురిపెట్టిన ఆ విద్యార్థిని జ్వరాన్ని లెక్కచేయకుండా ఎంసెట్ పరీక్ష రాసింది. బాటనీలో 35.6 మార్కులు, జువాలజీలో 35.6, ఫిజిక్స్‌లో 31.8 మార్కులు, కెమిస్ట్రీలో 40 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ఐదో ర్యాంకు సొంతం చేసుకుంది. తన మెడిసిన్ భవితకు బాటలు వేసుకుంది. ఆ అమ్మాయే కదిరికి చెందిన షేక్ జానుభీ రఫియా కుల్సుమ్. కదిరి: పట్టణంలోని వలీసాబ్‌రోడ్‌లో ఓ చిన్న వీధి. అక్కడ ఎస్జే రియాజ్ అనే మంచాల వ్యాపారి నివాసం ఉంటున్నాడు. ఈయన చదివింది పదో తరగతి వరకే. బైపాస్ రోడ్లో ఎంఎస్ లాడ్జి పక్కన మంచాలు అల్లి అక్కడే దుకాణంలో అమ్ముకుంటుంటాడు. రోజుకు సరాసరిన రూ.300 రావడం కూడా కష్టమే. ఆయన భార్య కౌసర్ గృహిణి. ఆమె 8వ తరగతి వరకు చదువుకుంది. వీరికి కూతురు రఫియా కుల్సమ్, కుమారుడు రిజ్వాన్ సంతానం. రిజ్వాన్ పట్టణంలోని వాల్మీకి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కూతురు రఫియా కుల్సమ్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివింది. బుధవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి(బైపీసీ)లో 5వ ర్యాంకు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచింది. మొత్తం 160 మార్కులకు గాను 143 మార్కులు సాధించింది. ఇంటర్ లోనూ 1000కి 982 మార్కులు సాధించింది. పేదరికాన్ని లెక్క చేయక రఫియాను విజయవాడలో ఇంటర్ చదివించడం కోసం ఏడాదికి రూ. లక్ష చొప్పున రెండేళ్లకు రూ. 2 లక్షలు ఖర్చు చేసింది ఆ పేద కుటుంబం. ఇందుకోసం రియాజ్ అన్నదమ్ములందరూ తమ వంతు సహకారం అందించారు. నాన్న పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన రఫియా కూడా చదువుల్లో ఎప్పుడూ టాపర్‌గా ఉండేది. పట్టణంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో 7వ తరగతి చదివేసమయంలో తన ప్రతిభతో అక్కడి ఉపాధ్యాయులను ఆకట్టుకుంది. అందుకే వారు ‘‘రఫియాను బాగా చదువుతుంది..బాగా చదివించండి..ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులొస్తే మమ్మల్ని సంప్రదించండి’’ అని చెప్పారు. దీంతో ఆనందపడిపోయిన రిజాజ్ ఎంత కష్టమైనా కూతురును బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు. పట్టణంలోని వాల్మీకి పాఠశాలలో 8 నుండి 10వ తరగతి వరకు చదివిన రఫియా.. పదో తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించింది. తల్లిదండ్రుల కష్టం నిరంతరం గుర్తు చేసుకుంటూ శ్రద్ధగా చదువుకుంది. నేడు స్టేట్ టాపర్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటోంది. -
ఉచిత శిక్షణ ... భవితకు రక్షణ
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసెట్ కోచింగ్ అనేది తల్లిదండ్రులకు భారంగా మారింది. వేల రూపాయిల ఫీజుల కట్టలేక పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆర్థిక భారంతో ప్రతిభ ఉండి కూడా పలువురు సాధారణ డిగ్రీలతో సరిపెట్టుకుంటున్నారు. చదువుకు పేదరికం అడ్డుకారాదన్న ధ్యేయంతో ప్రభుత్వం ముందుకొచ్చి శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలయోగి బాలికల గురుకులం ఉచిత ఎంసెట్ శిక్షణ కేంద్రంగా ఎంపికైంది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ప్రతిభ చూపిన విద్యార్థినుల్ని ఎంపిక చేసి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. సత్తెనపల్లి: ఆటపాటలకు, నాణ్యమైన విద్యా బోధనకు నెలవైన సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలయోగి బాలికల గురుకులం ఎంసెట్ శిక్షణ కేంద్రంగా ఎంపికైంది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ప్రతిభ చూపిన విద్యార్థినుల్ని ఎంపిక చేసి ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి కార్పొరేట్ సంస్థల్లో శిక్షణ పొందలేని గురుకుల విద్యార్థినులకు ప్రభుత్వం ఉచితంగా అత్యున్నత నాణ్యత, ప్రమాణాలతో తరగతుల్ని నిర్వహిస్తోంది. ప్రతిభ ఆధారంగా ఎంపిక జిల్లాలోని పలు ప్రాంతాల్లోని గురుకుల కళాశాలలకు చెందిన 91 మంది విద్యార్థినుల్ని(ఎంపీసీ, బైపీసీ) ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన ఎంపిక చేశారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఐఐటీ అ«ధ్యాపకులు వీరికి వర్చువల్ తరగతులు (ఆన్లైన్, ప్రత్యక్ష ప్రసారాలు) ద్వారా నలభై రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గత నెల 20 నుంచి రామకృష్ణాపురంలో శిక్షణ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సబ్జెక్టుల వారీగా ఇస్తున్నారు. మెటీరియల్‌ను సైతం ఉచితంగా అందించారు. వారానికి గ్రాంట్ టెస్ట్ 160 మార్కులతో నిర్వహిస్తున్నారు. డైలీ పరీక్షలు నిర్వహిస్తూ సామర్థ్యాల్ని అంచనా వేస్తున్నారు. ప్రతి ఆదివారం గురుకులాల కార్యదర్శి కల్నల్ రాములు విద్యార్థినులతో ఆన్లైన్లో ఇంట్రాక్ట్ అవుతూ సలహాలు ఇస్తున్నారు. శిక్షణా కేంద్రాన్ని సాక్షి సందర్శించింది. విద్యార్థుల అభిప్రాయాలు.. -
ఎంసెట్–3 ప్రశాంతం
69 శాతం హాజరు నమోదు పడిపోయిన హాజరు శాతం కమాన్‌చౌరస్తా : ఎంసెట్–3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో2, ఎస్సారార్ కళాశాలలో 2, శాతవాహనలో 2, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ జూనియర్ కళాశాలలో ఒకటి చొప్పున మెుత్తం 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3,361 మంది విద్యార్థులకు 2,320 మంది పరీక్షకు హాజరయ్యారుకాగా 69 శాతం హాజరు నమోదైంది. ఎంసెట్–2 పరీక్షకు 91.5 శాతం హాజరు నమోదు కాగా ప్రస్తుతం సుమారు 30 శాతం వరకు తగ్గింది. బయోమెట్రిక్ విధానంతో విద్యార్థులు హాజరు నమోదు చేశారు. కొన్ని కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలు మెురాయించినా సిబ్బంది సరిచేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమనే అధికారులు ఆదేశాలతో ఎక్కువ మంది అభ్యర్థులు 10 గంటల్లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ‘నిమిషం’ నిబంధనతో కొందరు పరీక్ష రాసే అవకాశం కోల్పోయినట్లు తెలిసింది. -
ఎంసెట్–2ను రద్దుచేస్తే ఉద్యమిస్తాం
అచ్చంపేట రూరల్: తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి బాలగౌడ్ ఆరోపించారు. గురువారం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఎంసెట్–2ను రద్దు చేయవద్దని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్–2లో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మల్లేష్, రాజు, శివ, కృష్ణ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.