మెడిసిన్ జిల్లా టాపర్ రాఫియా కుల్సమ్ తల్లిదండ్రులు
ఎంసెట్ పరీక్ష రోజే ఈ అమ్మాయికి విపరీతమైన జ్వరం.... నీరసంతో నడిచేందుకు కూడా కష్టపడుతోంది. వెంటనే కళాశాల యాజమాన్యం ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి.. అక్కడి నుండి నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లిందా అమ్మాయి. లక్ష్య సాధనపైనే గురిపెట్టిన ఆ విద్యార్థిని జ్వరాన్ని లెక్కచేయకుండా ఎంసెట్ పరీక్ష రాసింది. బాటనీలో 35.6 మార్కులు, జువాలజీలో 35.6, ఫిజిక్స్‌లో 31.8 మార్కులు, కెమిస్ట్రీలో 40 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ఐదో ర్యాంకు సొంతం చేసుకుంది. తన మెడిసిన్ భవితకు బాటలు వేసుకుంది. ఆ అమ్మాయే కదిరికి చెందిన షేక్ జానుభీ రఫియా కుల్సుమ్.
కదిరి: పట్టణంలోని వలీసాబ్‌రోడ్‌లో ఓ చిన్న వీధి. అక్కడ ఎస్‌జే రియాజ్ అనే మంచాల వ్యాపారి నివాసం ఉంటున్నాడు. ఈయన చదివింది పదో తరగతి వరకే. బైపాస్ రోడ్‌లో ఎంఎస్ లాడ్జి పక్కన మంచాలు అల్లి అక్కడే దుకాణంలో అమ్ముకుంటుంటాడు. రోజుకు సరాసరిన రూ.300 రావడం కూడా కష్టమే. ఆయన భార్య కౌసర్ గృహిణి. ఆమె 8వ తరగతి వరకు చదువుకుంది. వీరికి కూతురు రఫియా కుల్సమ్, కుమారుడు రిజ్వాన్ సంతానం. రిజ్వాన్ పట్టణంలోని వాల్మీకి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కూతురు రఫియా కుల్సమ్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివింది. బుధవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి(బైపీసీ)లో 5వ ర్యాంకు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచింది. మొత్తం 160 మార్కులకు గాను 143 మార్కులు సాధించింది. ఇంటర్ లోనూ 1000కి 982 మార్కులు సాధించింది.
పేదరికాన్ని లెక్క చేయక
రఫియాను విజయవాడలో ఇంటర్ చదివించడం కోసం ఏడాదికి రూ. లక్ష చొప్పున రెండేళ్లకు రూ. 2 లక్షలు ఖర్చు చేసింది ఆ పేద కుటుంబం. ఇందుకోసం రియాజ్ అన్నదమ్ములందరూ తమ వంతు సహకారం అందించారు. నాన్న పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన రఫియా కూడా చదువుల్లో ఎప్పుడూ టాపర్‌గా ఉండేది. పట్టణంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో 7వ తరగతి చదివేసమయంలో తన ప్రతిభతో అక్కడి ఉపాధ్యాయులను ఆకట్టుకుంది. అందుకే వారు ‘‘రఫియాను బాగా చదువుతుంది..బాగా చదివించండి..ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులొస్తే మమ్మల్ని సంప్రదించండి’’ అని చెప్పారు. దీంతో ఆనందపడిపోయిన రిజాజ్ ఎంత కష్టమైనా కూతురును బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు. పట్టణంలోని వాల్మీకి పాఠశాలలో 8 నుండి 10వ తరగతి వరకు చదివిన రఫియా.. పదో తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించింది. తల్లిదండ్రుల కష్టం నిరంతరం గుర్తు చేసుకుంటూ శ్రద్ధగా చదువుకుంది. నేడు స్టేట్ టాపర్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment