ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో అవస్థలు | Students Confused In Eamcet Counselling Centre Chittoor | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో అవస్థలు

Published Tue, May 29 2018 8:43 AM | Last Updated on Tue, May 29 2018 8:43 AM

Students Confused In Eamcet Counselling Centre Chittoor - Sakshi

ఎస్వీయూ హెల్ప్‌లైన్‌ సెంటర్లో తల్లిదండ్రులు, విద్యార్థులు

యూనివర్సిటీ క్యాంపస్‌:  ఎంసెట్‌ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. తొలిసారిగా  ఇంటి నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ తొలిరోజే ఇక్కట్లు తెచ్చిపెట్టింది. రిజిస్ట్రేషన్‌ కోసం విద్యార్థులు ఫీజు చెల్లించినా... ఫీజు చెల్లించినట్లు మొబైల్‌కు మెసేజ్‌లు రాలేదు. రెండోసారి, మూడోసారి ఫీజు చెల్లించినా ఫలితం లేదు. దీంతో విద్యార్థులు,  తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వారంతా ఎస్వీయూలో  హెల్ప్‌లైన్‌ సెంటర్లకు తరలివెళ్లారు. సర్వర్‌ సమస్య ఉందని.. వేచి చూడాలని హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో సిబ్బంది సూచిస్తున్నారు.

పనిచేయని సర్వర్‌
ఏపీ ఎంసెట్‌ –2018 కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ను రూపొందించింది.  దీని ప్రకారం దరఖాస్తు చేసిన సమయంలో  సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాలి. ఈ సర్టిఫికెట్లను డేటా బేస్‌ ద్వారా అధికారులు ఇప్పటికే తనిఖీ చేశారు. దీనివల్ల కౌన్సెలింగ్‌ కేంద్రాలకు వెళ్లి సర్టిఫికెట్లను తనిఖీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లలో తప్పులున్నా.., కొన్ని అప్‌లోడ్‌ చేయకపోయినా దగ్గరలోని హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు వెళ్లి తప్పులు సరిదిద్దుకోవాలి. అవసరమైన పక్షంలో సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలి. ఇలాంటి వారికి మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. వారు మాత్రమే హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు రావాలి. మిగలిన వారు ఇంటి నుంచి..లేదా  ఇంటర్నెట్‌ సెంటర్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అనంతరం వారికి నిర్ధేశించిన తేదీల్లో  బ్రాంచ్, కళాశాల ఎంపిక కోసం వెబ్‌ ఆప్సన్‌ ఇచ్చుకోవాలి.  ఇదంతా చేసుకోవడానికి ముందు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఓసీ, బీసీలు 1,200 రూపాయలు, ఎస్సీ, ఎస్టీలు 600 రూ చెల్లించాలి.  మధ్యాహ్నం 2 వరకు సర్వర్‌ పనిచేయలేదు.  చాలా మంది రిజస్ట్రేషన్‌ ఫీజు చెల్లించలేకపోయారు.

సరిగారాని  ఎస్‌ఎంఎస్‌లు
చాలా మందికి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించిన మెసేజ్‌ రాలేదు. రెండో సారి, మూడోసారి చెల్లించినా రాలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. తమ సర్టిఫికెట్లలో తప్పులు సరిదిద్దుకోవటానికి, అవసరమైన సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయడానికి వీలు లేకుండా పోతుంది. విద్యార్థులు ఆందోళనకు గురై హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు తరలి వచ్చినా.. వారు ఏమీ చేయలేని పరిస్థితి. సాయంత్రం 6 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్య వంద దాటలేదు.

హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని సంప్రదించండి
విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాక.. వారి మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ రాక పోయినా ఆందోళనకు గురికావాల్సిన పని లేదు. తొలిసారిగా ఈ విధానం ప్రవేశపెట్టడంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఫీజు చెల్లించాక కాసేపు ఎదురు చూస్తే ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. రెండు, మూడు సార్లు ఫీజు చెల్లించిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వారి అకౌంట్‌కు రీఫండ్‌ అవుతుంది. ఎలాంటి సందేహాలు ఉన్నా.. ఎస్వీయూలో హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని సందర్శించండి.  –ప్రొఫెసర్‌ జీఎన్‌.ప్రదీప్‌కుమార్, క్యాంప్‌ ఆఫీసర్, హెల్ప్‌లైన్‌ సెంటర్, ఎస్వీయూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement