కొన్ని సవరణల తర్వాత మాత్రమే టాల్గో రన్
న్యూఢిల్లీ: స్పానిష్ టాల్గో రైలు ట్రయిల్ రన్ విజయవంతమైందని రైల్వే శాఖ బుధవారం ప్రకటించింది. రాజధాని ఎక్స్ప్రెస్ కంటే వేగంగా ప్రయాణించే స్పెయిన్ రూపొందించిన హైస్పీడ్ టాల్గో ట్రెయిన్ కొన్ని స్వల్ప మార్పులతో తన సేవలను ప్రారంభించనుందని రైల్వే శాఖ తెలిపింది. కొన్ని సవరణల తర్వాత , ఆపరేషనల్ బేసిస్ గా టాల్గో సర్వీసులు అందుబాటులో ఉంచనున్నట్టు రైల్వే రోలింగ్ స్టాక్ సభ్యుడు హేమంత్ కుమార్ చెప్పారు. టాల్గో ట్రయిల్ రన్ విజయవంతమైనప్పటికీ తక్కువ వెడల్పు, ఎత్తు తక్కువ ఉన్న ఫూట్ బోర్డ్ తదితర అంశాల కారణంగా భారత రైల్వే సేవల్లో ఇపుడే చేరదని చెప్పారు. ముంబై ఢిల్లీ మధ్య గంటకు 150 కి.మీ వేగాన్ని అధిగమించే ట్రయిల్ రన్స్ నిర్వహిస్తున్నామని, ఫైనల్ రన్ ఆగస్ట్ 14 న ఉంటుందని చెప్పారు.
తాజాగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ట్రయల్ రన్లో భాగంగా ఢిల్లీ నుంచి ముంబైకి 1389 కిలోమీటర్ల దూరాన్ని 12 గంటల పది నిమిషాల్లో చేరుకుంది టాల్గో. ఇది రాజధాని ఎక్స్ప్రెస్ కంటే 3 గంటల 40 నిమిషాల సమయం తక్కువగా తీసుకోవడం విశేషం. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ మధ్య వేగవంతమైన రైలుగా ఉన్న రాజధాని ఎక్స్ప్రెస్ ఈ దూరాన్ని చేరుకోవడానికి 15 గంటల 50 నిమిషాల సమయం తీసుకుంటోంది.
అయితే మంగళవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన టాల్గో రైలు బుధవారం తెల్లవారుఝామున 2.55 గంటలకు ముంబై చేరుకున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు. ముంబై, ఢిల్లీ మధ్య ప్రయాణ సమయాన్ని 12 గంటలకే పరిమితం చేయాలని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు భావిస్తున్నారు. గతవారం అత్యధికంగా 130కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న టాల్గో.. ఇదే దూరాన్ని 12 గంటల 50 నిమిషాల్లో చేరుకుంది. కాగా మే 29 నుంచి ఈ రైలు ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. తొలి టాల్గో ట్రయల్ రన్ యూపీలోని బరేలి-మొరదాబాద్ల మధ్య గంటకు 115 కి.మీ వేగంతో జరగ్గా, పల్వాల్-మధుర మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.