op dhankar
-
అమ్మాయిల మాయంపై 12 జిల్లాల్లో వెతుకులాట
"హర్యానా అబ్బాయిలకు బీహారీ అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయిస్తాం" అని హర్యానా బిజెపి నేత ఓపీ ధన్ కడ్ అనడంతో బీహార్ ప్రభుత్వం ఒక్కసారిగా మేల్కొంది. అసలెందరు బీహారీ అమ్మాయిలను హర్యానా అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేశారు? వారి పరిస్థితేమిటో కనుక్కొమ్మని బీహార్ ప్రభుత్వం 12 జిల్లాల పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ముజఫర్ పూర్, బెగూసరాయ్, పూర్ణియా, సహర్సా, సీతామఢి, ముంగేర్, అరారియా, పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారన్, కిషన్ గంజ్, మధుబని, కటిహార్ జిల్లాల్లో హడావిడిగా అధికారులు సర్వేను చేపడుతున్నారు. అమ్మాయిలను తరలించే ముఠాలేవైనా ఉంటే వాటిపై చర్యలు తీసుకుంటామని వారంటున్నారు. హర్యానాలో స్త్రీశిశు హత్యలు, భ్రూణ హత్యల వల్ల జనాభాలో మహిళల నిష్పత్తి తక్కువగా ఉంది. దీని తో అక్కడ మగవారికి అమ్మాయిలు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ధన్ కడ్ మేం బీహారీ అమ్మాయిలను తీసుకొచ్చి పెళ్లి చేయిస్తాం అని ఒక సభలో అన్నారు. అదిప్పుడు వివాదమై కూర్చుంది. -
పెళ్లికాని ప్రసాదులకు పెండ్లాములు కావలెను!
మగపిల్లాడే కావాలి. ఆడపిల్ల వద్దే వద్దన్న హర్యానా ఇప్పుడు కష్టాల్లో పడింది. అక్కడ మగమహారాజులకు పెళ్లాడేందుకు ఆడపిల్లలు కరువయ్యారు. ఎదురు డబ్బులిద్దామన్నా అమ్మాయిలు దొరకడం లేదు. దాంతో హర్యానా యువకులు అమ్మాయిల కోసం ఎక్కడంటే అక్కడ వెతకడం మొదలుపెట్టారు. పెళ్లికాని ప్రసాదుల సంఖ్య నానాటికీ పెరిగిపోతూండటంతో రాజకీయులు దాన్ని కూడా ఓ ఇష్యూగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హర్యానా బిజెపి నేత, జాతీయ బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు ఓ పీ ధన్ కడ్ ఒకడుగు ముందుకు వేసి 'పెళ్లి కాని ప్రసాదులూ... చింతించకండి. బీహార్ నుంచి అమ్మాయిల్ని తెచ్చి మీకు పెళ్లి చేయిస్తాం. బీహార్ లో మా సుశీల్ మోడీ రాజ్యం రాబోతోంది. మీరేం చింతించకండి,' అంటూ ఆయన చెబుతున్నారు. ఈ మాట ఆయన ఈ మధ్య ఒక బహిరంగ సభలోనే బాహాటంగా చేసేశారు. ఇప్పుడీ ప్రసంగం ఆయన్ని చిక్కుల్లో పారేసింది. ఇది బీహారీలను అవమానించడమేనంటూ బీహారీలు విరుచుకుపడుతున్నారు. ఆయన్ని అరెస్టు చేయాలని కోరుతున్నారు. ధన్ కడ్ గారు ప్రస్తుతం ఎవరికీ దొరకడం లేదు. అయితే నేనేం పొరబాటు మాట అనలేదని ఆయన వాదిస్తున్నారు. హర్యానాలో ప్రతి వెయ్యి మంది మగవారికి 879 మంది స్త్రీలే ఉన్నారు. కాబట్టి సమాజంలో ప్రతి వెయ్యి మందికి 121 మందికి అమ్మాయిలు దొరికేపరిస్థితి లేదు.