ఉమ్మినా, మూత్రం పోసినా భారీ ఫైన్
స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా కేంద్రప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు ప్రకటించింది. ఇక మీదట బహిరంగ స్థలాల్లో మూత్రవిసర్జన చేసినా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉమ్మినా భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. అలాగే రోడ్ల మీద చెత్త వేయడం, నిర్మాణ సామగ్రిని ఎప్పటికప్పుడు తొలగించకపోవడం లాంటి వాటికి కూడా జరిమానాలు తప్పవు. ఈ విషయాన్ని అన్ని మంత్రివర్గ కార్యాలయాలకు పంపారు. ముఖ్యంగా ఆఫీసులు స్వచ్ఛంగా ఉండేలా చూడాల్సిన బాధ్యతను ఉద్యోగులే తీసుకోవాలని తెలిపారు. ప్రతి శాఖలోను జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో పారిశుధ్య కమిటీని నియమించుకోవాలని, వాళ్లు ఈ వ్యవహారాలను పర్యవేక్షించాలని చెప్పారు.
అలాగే కాంట్రాక్టర్లు కూడా భవనాలను కూల్చినప్పుడు, నిర్మాణ సమయంలోను మిగిలే వ్యర్థాలను పని పూర్తికాగానే తొలగించాలని, లేకపోతే వారికి కూడా జరిమానా విధించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్కా, పాన్ మసాలా మరకలు ఎక్కడపడితే అక్కడ కనిపించడం ఇక మీదట కుదరదని, అందుకోసం సిబ్బందికి కావల్సినన్ని చెత్తబుట్టలు, సిబ్బంది సంఖ్యను బట్టి తగినన్ని యూరినల్స్ కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.