తొలిరోజు బాహుబలి రికార్డు కలెక్షన్లు!
ముంబై: దేశ వ్యాప్తంగా 6500 స్ర్కీన్లపై విడుదలైన బాహుబలి-2 తొలిరోజు రికార్డు కలెక్షన్లు సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా.. ఈ ఏడాదిలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల రూపాయల కోట్ల క్లబ్లో చేరినా ఆశ్చర్యం లేదని డిస్ట్రిబ్యూటర్ అక్షయ్ రతి చెప్పారు. తొలిరోజు 70 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావచ్చని అంచనా వేశారు. బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన ఆమీర్ ఖాన్ దంగల్ సినిమా పేరిట ఉన్న అడ్వాన్స్ బుకింగ్ రికార్డును బాహుబలి-2 బ్రేక్ చేసిందని బుక్‌మైషో నిర్వాహకులు చెప్పారు. ఇప్పటికే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టు తెలిపారు. 'దేశ వ్యాప్తంగా వస్తున్న సమాచారం ప్రకారం బాహుబలి-2 థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. భారీగా ప్రేక్షకుల రాకతో థియేటర్ల బయట సందడి నెలకొంది' అంటూ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తగా, ఉత్తరాదిన కూడా సినిమా హాళ్లు 90 శాతం నిండాయని అంచనా.
టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘బాహుబలి ది కంక్లూజన్’ పై రివ్యూలు పాజిటివ్‌గా ఉన్నాయి. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్‌ల నటనకు, సాంకేతిక నిపుణుల పనితీరుకు ప్రశంసలు వస్తున్నాయి.