operation Failed
-
వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ వికటించి మహిళ మృతి
సాక్షి, వనస్థలిపురం: వెన్నుపూసకు నిర్వహించిన ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శుక్రవారం వనస్థలిపురం చింతలకుంటలోని మెడిసిస్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ అప్పలమ్మగూడంకు చెందిన సిరసవాడ నాగేష్, నాగమణి (27) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగమణి కొంతకాలంగా నడుం, వెన్నునొప్పితో బాధపడుతోంది. ఆపరేషన్ నిమిత్తం బుధవారం చింతలకుంటలోని మెడిసిస్ ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం సాయంత్రం ఆమెకు ఆపరేషన్ చేశారు. అనంతరం నాగమణి ఆరోగ్యం క్షీణించడంతో మధ్యరాత్రి ఆమె మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే నాగమణి మృతి చెందిందని ఆపరేషన్ సమయంలో ఆసుపత్రిలో రక్తం నిల్వలు కూడా లేవని బంధువులు ఆరోపించారు. ఆపరేషన్ తర్వాత నాగమణికి కాళ్లు పని చేయక పోవచ్చు అని చెప్పిన వైద్యులు చివరకు ఆమె ప్రాణాలు తీశారని ఆమె భర్త నాగేష్ రోధిస్తూ తెలిపాడు. వైద్యులు హడావిడిగా ఆపరేషన్ చేసి ఆమె మృతికి కారణమయ్యారని బంధువులు పేర్కొన్నారు. ఆసుపత్రి వద్ద గొడవలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీసీ నాయకులు బాధితుల తరపున ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వారికి నష్టపరిహారం అందేలా చేయడంతో గొడవ సద్దుమణిగింది. మా నిర్లక్ష్యం లేదు: ఆసుపత్రి నిర్వాహకులు నాగమణికి ఆపరేషన్ నిర్వహించిన తర్వాత సడెన్‌గా బీపీ డౌన్ అయ్యిందని, వెంటిలేటర్‌పై ఉంచి ఆమెకు మెరుగైన చికిత్సను అందించామని వైద్యులు వేణుగోపాల్ తదితరులు తెలిపారు. ఒకేసారి హార్ట్ మీద ప్రెషర్ పడటంతో ఆమె మృతి చెందిందన్నారు. చాలా తక్కువ కేసుల్లో ఇలా జరుగుతుందని వారు తెలిపారు. ఆమె ప్రాణాలు కాపాడడానికి తమ వంతు అన్ని ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమి లేదని వారు పేర్కొన్నారు. -
వైద్యుల నిర్వాకం... మహిళకు దుస్థితి
భువనేశ్వర్ : వైద్యుల నిర్లక్ష్యంతో రోగుల పరిస్థితి ప్రాణసంకటంగా మారింది. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఓ మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులో కత్తెర మరిచిపోయిన ఘటన మరవకముందే.. ఒడిశాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత మహిళ ఎడమ కాలికి గాయంతో ఆస్పత్రిని ఆశ్రయిస్తే వైద్యులు ఆమె కుడి కాలికి ఆపరేషన్ చేసిన నిర్వాకం వెలుగుచూసింది. కెంజార్ జిల్లాలోని కాబిల్ గ్రామానికి చెందిన మితారాణి జెనా అనే మహిళ రెండ్రోజుల కిందట తన ఎడమకాలికి గాయం కావడంతో చికిత్స కోసం ఆనంద్‌పూర్ సబ్‌డివిజన్ ఆస్పత్రిలో చేరారు. రోగి పరిస్థితిని పరిశీలించిన ఆస్పత్రి వైద్యుడు గాయానికి డ్రెస్సింగ్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ క్రమంలో గాయమైన కాలికి కాకుండా వైద్య సిబ్బంది వేరే కాలికి డ్రెస్సింగ్ చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో సిబ్బంది తొలుత రోగికి అనస్తీషియా ఇచ్చారు. మరోవైపు తాను స్పృహలోకి వచ్చిన అనంతరం ఎడమ కాలికి బదులు తన కుడి కాలుకు చిక్సిత చేశారని గుర్తించానని వైద్యాధికారికి బాధితురాలు జెనా ఫిర్యాదు చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో తాను నడవలేకపోతున్నానని ఆమె వాపోయారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ ఘటనపై కెంజార్ జిల్లా కలెక్టర్ అశీష్ థాక్రే విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు చేపడతామని ఆనంద్‌పూర్ సబ్ డివిజనల్ ఆస్పత్రి ఇన్చార్జ్ డాక్టర్ కృష్ణ చంద్ర దాస్ పేర్కొన్నారు. -
ఆపరేషన్ వికటించి.. మహిళ మృతి
వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపించిన భర్త మైసూరు: కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ మృతి చెందిన ఘటన బుధవారం మైసూరులో చోటుచేసుకుంది. వివరాలు...నగరంలోని గాయత్రిపురకు చెందిన శివకుమార్ భార్య ప్రతిభా(38) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం మంగళవారం నగరంలోని కృష్ణమూర్తి నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. బుధవారం ఉదయం అల్పాహారం తీసుకెళ్లిన శివకుమార్‌కు తన భార్య కనిపించకపోయే సరికి వైద్యలను ఆరా తీశాడు. ఆరోగ్యం విషమించడంతో కే.ఆర్.ఆసుపత్రికి తరలించామని బదులిచ్చారు. దీంతో కే.ఆర్.అసుపత్రికి వెళ్లిన శివకుమార్‌కు తన భార్య విగతజీవిగా కనిపించింది. వైద్యలను అడగ్గా ఇక్కడికి తీసుకొచ్చేలోపు ఆమె మృతి చెందిందని పేర్కొన్నారు. తన భార్య మృతికి వైద్యులే కారణమని, శస్త్ర చికిత్స చేసేటపుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని శివకుమార్ ఆరోపించారు. తన భార్య మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు.