ఇక మనకూ ఎయిర్‌బస్ ఎ-380లు!!
ఎయిర్‌బస్ ఎ-380.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం. ఇది వస్తోందంటేనే పెద్ద రాజసం కనపడుతుంది. ఎన్నాళ్లనుంచో ఈ తరహా విమానాలను మన దేశంలోకి అనుమతించాలని పలు విమానయాన సంస్థలు కోరతుండటంతో.. ఇప్పటికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వాటికి పచ్చజెండా ఊపింది. దేశంలో ఇంత పెద్ద విమానాలను ఆపరేట్ చేయగల నాలుగు విమానాశ్రయాలలోకి మాత్రమే వీటిని అనుమతిస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు విమానాశ్రయాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. పూర్తిస్థాయి డబుల్ డెక్కర్ విమానాలైన వీటిపై ఉన్న నియంత్రణను ఎయిరిండియా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, డీజీసీఏతో చర్చించిన అనంతరం ఎత్తేశారు.
ఈ విమానంలో అంతా ఎకానమీ క్లాస్ అయితే ఒకేసారి మొత్తం 850 మంది ప్రయాణం చేయొచ్చు. అదే మూడు తరగతులు ఉండాలంటే మాత్రం 550-600 మంది వరకు పడతారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్, లుఫ్తాన్సా సంస్థలు ఎప్పటినుంచో ఈ విమానాలు తెస్తామని అంటున్నాయి. మన దేశంలో విమానాలు నడిపిస్తున్న మొత్తం 10 అంతర్జాతీయ విమానయాన సంస్థలో తొమ్మిదింటి వద్ద ఈ భారీ విమానాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 110 ఎ-380లు ప్రస్తుతం ఎగురుతున్నాయి.