ఇకపై జైలుకే...
‘లేట్ నైట్ రోమియోస్’పై పోలీసుల ఉక్కుపాదం
సత్ఫలితాలిస్తున్న ‘ ఆపరేషన్ ఛబుత్రా’
చార్మినార్: ఇప్పటి వరకు ఆపరేషన్ లేట్ నైట్ రోమియోస్ పేరుతో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్న దక్షిణ మండలం పోలీసులు... ఇకపై జైలుకు పంపుతామంటున్నారు. రెండు రోజులుగా నిర్వహించిన దాడుల్లో 119 మంది పట్టుబడగా... 28 మందిపై 188 ఐపీసీ సెక్షన్ కింద, 70ఎ,70బీ సీపీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి స్పెషల్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి వీరికి రెండు రోజుల జైలు శిక్ష విధించడంతో పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరో ముగ్గురిపై నిర్భయ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తమ ఇళ్లకు వెళ్లకుండా దారిన వేళ్లే వారిని వేధిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదంటున్నారు పోలీసులు. ఈవ్ టీజింగ్, బైక్ ైరె డింగ్, పీకలదాక మద్యం తాగి వీధుల్లో తిరుగుతూ ఇతరులకు ఇబ్బందులు కలిగించే వారిపై తప్పనిసరిగా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామంటున్నారు. కాగా, మే నెలలో ప్రారంభమైన ఈ ఆపరేషన్ ఛబుత్రా మిషన్‌ను యువకుల తల్లిదండ్రులు ఆహ్వానిస్తున్నారు.
మేలో ప్రారంభమైన ఆపరేషన్ ఛబుత్రా ...
మీర్‌చౌక్ ఠాణా పరిధిలోని పంజేషాలో మే 3న జరిగిన నబీల్ హత్యోదంతం అనంతరం దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఆపరేషన్ లేట్ నైట్ రోమియోస్ పేరుతో ఆపరేషన్ ఛబుత్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 22,23 తేదీల్లో పాతబస్తీలోని 17 ఠాణాల పరిధిలో అర్దరాత్రి రోడ్లపై తిరుతున్న 110 మంది యువకులను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఫలక్‌నుమా డివిజన్ పరిధిలో 50 మంది, మీర్‌చౌక్ డివిజనల్లో 36, సంతోష్‌నగర్ డివిజన్లో 24 మంది యువకులు పట్టుబడ్డారు. రంజాన్ మాసం సందర్భంగా నెల పాటు వాయిదా వేసిన ఈ ‘ఛబుత్రా మిషన్’ను దక్షిణ మండలం పోలీసులు గత నెల నుంచి తిరిగి ప్రారంభించారు. లేట్‌నైట్ రోమియోస్ పేరుతో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూలై 22న నిర్వహించిన తనిఖీల్లో 158 మంది పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిలో 12 మందికి నేర చరిత్ర ఉన్నట్లు స్పష్టమైంది. ఇందులో 8 మంది పాతబస్తీకి చెందిన వారు కాగా... నలుగురు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. ఇందులో 38 మంది మైనర్లే. ఈ తనిఖీల్లో పట్టుబడిన 38 మంది బాలలు నిబంధనలకు విరుద్ధంగా పల్సర్, సీబీజడ్, ఎఫ్‌జడ్ తదితర ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్తూ పట్టుబడ్డారు. వీరందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి బైక్‌లను స్వాధీనం చేసుకొని మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.
సత్ఫలితాలిస్తున్న తనిఖీలు...
దక్షిణ మండలంలో నిర్వహిస్తున్న లేట్‌నైట్ రోమియో మిషన్ ఛబుత్రా సత్ఫలిస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో దాదాపు నాలుగున్నర వేల మంది యువకులు పట్టుబడ్డారు. గతంలో నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు చైన్ స్నాచర్లు దొరికారు. ప్రస్తుతం పాతబస్తీలో నిర్వహిస్తున్న అర్ధరాత్రి తనిఖీల పట్ల పట్టుబడిన యువకుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను సక్రమ మార్గంలో పెట్టడానికి పోలీసుల చర్యలు తమకు ఉపయోగపడుతున్నాయంటున్నారు.
రూ.10-20 లక్షల ఖరీదైన బైకులు..
పాతబస్తీలో కొందరు మైనర్లు రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలు ఖరీదు చేసే స్పోర్ట్స్ బైక్‌లు నడుపుతున్నారని దక్షిణ మండలం పోలీసుల విచారణలో స్పష్టమైంది. నిమిషానికి 200 కిలో మీటర్లకు పైగా వేగంతో వెళ్లే ఈ బైక్‌లపై మైనర్లు పాతబస్తీ రోడ్లపై దూసుకెళ్తున్నారని, ఇకపై మైనర్లు ఈ స్పోర్ట్స్ బైక్‌లు నడపకుండా అడ్డుకోవాలని పోలీసులు నిర్ణయించారు. మైనర్లు స్పోర్ట్స్ బైక్‌లు నడిపితే వారి తండ్రులపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ తెలిపారు. మైనర్లు నడుపుతున్న స్పోర్ట్స్ బైక్‌లు పాతబస్తీలో దాదాపు 100 ఉన్నాయన్నాయన్నారు.
రెండోసారి పట్టుబడితే జైలుకే: డీసీపీ
ఆపరేషన్ లేట్ నైట్ రోమియోస్ పేరుతో తాము నిర్వహిస్తున్న అర్దరాత్రి తనిఖీల్లో రెండోసారి పట్టుబడితే ఇకపై జైలుకు పంపిస్తామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ హెచ్చరించారు. అర్దరాత్రి దాటిన తర్వాత కూడా యువకులు రోడ్లపై మకాం వేస్తూ తమ విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నారని...చెడు అలవాట్లకు లోనై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కొంత మంది సంఘవిద్రోహ శక్తులు వినియోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని..వీటిని అడ్డుకోవడంతో పాటు యువకులకు క్వాలిటీ లై ఫ్ అందించాడానికి ఈ ఆపరేషన్ ఛబుత్రా నిర్వహిస్తున్నామ ఆయన స్పష్టం చేశారు.