గందరగోళం సృష్టించేందుకే ప్రతిపక్షాల రాద్ధాంతం
ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల పునర్విభజన
వరంగల్ నగరంలో జిల్లాల విభజనపై పునరాలోచించాలని సీఎంకు విన్నవిస్తాం
వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్
న్యూశాయంపేట : ప్రజలను గందరగోళపరిచేందుకే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రజాభిప్రాయం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేపట్టారని వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ అన్నారు. నయీంనగర్‌లోని టీఆర్ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో శనివారం గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ఎంపీ దయాకర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేపట్టారని, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధిపరిచేందుకు ముఖ్యమంత్రి జిల్లాపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారన్నారు. ఏదో మునిగిపోయినట్టు కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బంద్‌కు పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. చారిత్రాత్మక నగరాన్ని రెండుగా విభజించకుండా ఒక్కటిగా ఉంచేందుకు ముఖ్యమంత్రిని మరోసారి కలిసి విన్నవిస్తామన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కేవలం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను మాత్రమే విడుదల చేశారని, ప్రజల అభిప్రాయ సేకరణ కోసం నెల రోజుల గడువు ఇచ్చినా కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలుగా విభజించడంపై పునరాలోచించాలని కోరుతూ లిఖితపూర్వకంగా కేసీఆర్‌కు లేఖ ఇస్తామన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా నష్టపోయిందని, అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకొని జిల్లాల పునర్విభజన చేపట్టారన్నారు. సమావేశంలో వరంగల్ నగరాన్ని హన్మకొండ జిల్లాగా విభజించే విషయంలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రజాప్రతినిధులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో విభజన విషయంలో గందరగోళంలో ఉన్నట్లు కనిపించింది. విలేకరుల సమావేశంలో తాడు గౌరవ అద్యక్షుడు గుడిమల్ల రవికుమార్, మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు బోడా డిన్నా,చింతల యాదగిరి, రాజు, టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.