orchestra singer
-
గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన.. గోధూళి ఎర్రన.. ఆ పాటలో నటుడు ఎవరో తెలుసా?
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)\తూర్పుగోదావరి: ‘నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి..అవి కొత్తవి.. మెత్తవి.. కాలికి హత్తుకు పోయేవి’ అంటూ నాలుగు దశాబ్దాల క్రితం నాటి ఈ పాట నేటికీ సజీవంగానే ఉంటుంది. ఉర్రూతలూగిస్తుంది.. 1981లో విడుదలైన ముద్దమందారం సినిమాలోని ఈ పాట నాడు కుర్రకారు నోట జోరుగా వినిపించేది. రాజమహేంద్రవరానికి చెందిన జిత్‌మోహన్ మిత్ర పాడిన ఈ పాట ఆయనకు ఓ బ్రాండ్ ఇమేజి తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఈ నటగాయకునిలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. 52 ఏళ్ల క్రితం ఈయన సారథ్యంలో ప్రారంభమైన ఆర్కెస్ట్రా నేటికీ పాటల పల్లకీలో అభిమానులను ఊరేగిస్తూనే ఉంది. వచ్చే నెల 30వ తేదీకి 80 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ పాటల మాంత్రికుడిని రాజమహేంద్రవరం కిషోర్‌కుమార్‌గా పిలిచేవారు.. అలీతో.. వారసత్వ నేపథ్యం.. జిత్‌మోహన్ తండ్రి శ్రీపాద కృష్ణమూర్తి ప్లీడర్ గుమాస్తాగా పని చేస్తూ నాటకాల్లో నటించేవారు. ఆయనకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. పెద్ద కుమారుడు పట్టాభి ఆ రోజుల్లోనే సినిమా రంగమంటే చెవికోసుకునే వారు. ఆదుర్తి నిర్మించిన ‘మూగమనసులు’ నుంచి తెరపై గోదావరి కనిపించడం వెనుక పట్టాభి ముద్ర ఎంతో ఉండేది. ఆయన ప్రభావమే జిత్‌మోహన్‌లోనూ కనిపించేది. జిల్లాలో ఏ సినిమా నిర్మించినా తెర వెనుక కీలక పాత్ర పోషించేవారు. ముఖ్యంగా లొకేషన్ల ఎంపికలో దర్శకునికి సహకరించేవారు. దర్శకుడు కె.విశ్వనాథ్ మొదలుకొని అందరూ రాజమహేంహేంద్రవరం రాగానే ఈయన్ను సంప్రదించేవారంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నగరంలో సినిమాలకు కేరాఫ్‌గా గుర్తింపు పొందారు. కె.విశ్వనాథ్‌తో.. ఆయన నోట.. కిషోర్‌కుమార్ పాట జిత్‌మోహన్ మిత్రకు పాటలంటే విపరీతమైన ఇష్టం. హిందీలో పాడే కిషోర్‌కుమార్ అంటే ప్రాణం. అందుకే చిన్నప్పటి నుంచీ ఆయన పాటలే ఎక్కువగా పాడేవారు. ఈ ఉత్సాహమే ఆయనను 1970లో ఓ ఆర్కెస్ట్రా పెట్టేలా చేసింది. నాటి నుంచి ఇప్పటి వరకూ ఆయన నేతృత్వంలోని ఆర్కెస్ట్రా రాష్ట్రంలోని అన్నిచోట్లా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆర్కెస్ట్రాలో ఈయన పాటల జోష్ చూసిన దర్శకుడు జంధ్యాల తన ముద్దమందారం సినిమాలో అవకాశమిచ్చారు. అందులో ఈయన పాడిన ‘షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి’ పాట సూపర్ హిట్ అయింది. ఎక్కడ పెళ్లిళ్లయినా ఆర్కెస్ట్రాలో ఈ పాట తప్పనిసరిగా వినిపించేది. సూత్రధారులు సినిమాలో.. తాను ప్రాణం కన్నా మిన్నగా భావించే కిషోర్‌కుమార్‌ను కలవా లని 1979లో ముంబయి వెళ్లారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డీ బర్మన్ ఆధ్వర్యంలో సినిమా పాటల రికార్డింగ్ చేస్తున్న సమయంలో దీర్ఘ నిరీక్షణ తర్వాత కిషోర్‌ను కలిశారు. తాను రాజమహేంద్రవరం నుంచి వచ్చానని చెప్పారు. ఆ ఊరెక్కడుందని కిషోర్ అడిగారు. వహీదా రహమాన్, జరీనా వహాబ్, జయప్రదల ఊరు అదేనని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. కిషోర్‌కుమార్ పాడిన పంటూస్ సినిమా లోని ఓ పాట పాడి వినిపించడంతో అచ్చం తనలాగే పాడుతున్నావంటూ ఆయన అభినందించడం నేటికీ తనకు సంతోషం కలిగిస్తుందంటారు జిత్. అభిరుచి.. ఉత్సాహం వయసు పెరిగినా ఆయనలో పాట ఉత్సాహం ఏమాత్రం సన్నగిల్లలేదు. ఆ గొంతులోనూ తేడా కనిపించదంటారు అభిమానులు. ఇప్పటికీ ఆర్కెస్ట్రా ద్వారా వేదికలపై గళం వినిపించడంలోనే ఆనందపడుతుంటారు. సంపాదన యావ ఏమాత్రం లేదు. కేవలం అభిరుచి మాత్రమే. అదే ముందుకు నడిపిస్తోంది. ‘2005లో జరిగిన మా ఆర్కెస్ట్రా స్వర్ణోత్స వాల వేడుకకు విశ్వనాథ్‌లాంటి రావడం ఎప్పటికీ మరువను. ఇప్పటి వరకూ 6 వేల ఆర్కెస్ట్రాలు ప్రదర్శించాం’ అని జిత్‌మోహన్‌మిత్ర చెప్పారు. తెర మీద.. న్యాయవాదిగా ఉంటూ, ఓపక్క ఆర్కెస్ట్రా నడుపుతూ, మరోపక్క సినిమాల నిర్మాణానికి తెరవెనుక పాత్ర పోషించే జిత్‌మోహన్ తెరముందుకు కూడా వచ్చారు. చిన్న పాత్రలే అయినా తనకు గుర్తింపు తెచ్చాయంటారాయన. విశ్వనాథ్ దర్శకత్వంలోని సప్తపదిలో ‘గోవుల్లు తెల్లన.. గోప య్య నల్లన.. గోధూళి ఎర్రన’ పాటలో ఓ పాప ను (ఆయన కుమార్తె సుబ్బలక్ష్మి) భుజాన ఎత్తు కుని సాగే సన్నివేశంలో కనిపించింది ఈయనే. మిత్ర తన కుమార్తెతో కలిసి ఆ పాటకు అభినయించారు. బాపు, కె.విశ్వనాథ్, బాలచందర్, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో నటించారు. శంకరాభరణం, సప్తపది, ఆనందబైరవి, చంటి, స్వాతికిరణం, సిరివెన్నెల, బొబ్బిలి బ్రహ్మన్న, మేఘసందేశం, సీతారత్నం గారి అబ్బాయి, సర్గమ్, సర్ సంగమ్ వంటి సుమారు 210 సినిమాల్లో నటించారు. రాజమహేంద్రవరం నేపథ్యంలోని 400 సినిమాలకు షూటింగ్ స్పాట్ల సహాయకుడిగా ఉన్నారు. ప్రముఖ సినీ నటుడు అలీ తెరంగేట్రం వెనుక కీలక భూమిక మిత్రాదే. జిత్ కుమార్తె సుబ్బలక్ష్మి తరువాత కూడా పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. -
ఎదురుచూపులే మిగిలాయి..
సంగీతం ఒక శక్తి.. దివ్య ఔషధం.. కమ్మని మ్యూజిక్ విన్నప్పుడు తనువు, మనసు పులకిస్తాయి. మధురమైన సంగీతం, సుమధుర గానం ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. సాయంసంధ్యవేళ.. సంగీత, నృత్య, గాత్రాలతో కనువిందు చేసేరవీంద్రభారతి, త్యాగరాయ గానసభ వంటిమందిరాలకు లాక్‌డౌన్‌తో తాళం పడింది.పది మంది సాహిత్య, సాంస్కృతిక ప్రియులు ఒక్కచోట చేరేందుకు అవకాశం లేదు. పెళ్లిళ్లు, వేడుకలు, గానాభజానాలు లేవు. దీంతో కళలపైనే ఆధారపడి ఉపాధిపొందుతున్న వేలాది మంది కళాకారులురోడ్డున పడ్డారు. సాక్షి, సిటీబ్యూరో: నాలుగో దశ లాక్డౌన్లో అనేక రంగాల్లో సడలింపులు లభించినా సాంస్కృతిక వేడుకలపైన మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో 2 నెలలుగా తీవ్రమైన దుర్భర పరిస్థితుల్లో కుటుంబాలను నెట్టుకొస్తున్న సంగీత, నృత్య, గాత్ర, ఆర్కెస్ట్రా, మిమిక్రీ, జానపద, కోలాటం, సన్నాయి తదితర రంగాలకు చెందిన కళాకారులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 5 వేల మందికిపైగా ఆర్కెస్ట్రా కళాకారులు ఉన్నారు. జానపద, లలిత సంగీత పాటలతో ఆకట్టుకునే గాయకులు, తబలా, ఫ్లూట్, ప్యాడ్, డ్రమ్స్, కీబోర్డు, మృదంగం వంటి వివిధ రకాల ఉపకరణాలపై అందమైన సంగీత ప్రవాహాన్ని సృష్టించి ఆహూతులను అలరింపజేసే ఈ కళాకారులంతా తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. ఇలా ఎంతకాలం.. ‘లాక్డౌన్ ఆరంభమైన మార్చి ఆఖరి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం ఇబ్బంది లేకుండా గడిచింది. కానీ ఏప్రిల్ రెండో వారంతో కష్టాలు మొదలయ్యాయి. దాతల సహాయంపైనే బతకాల్సి వస్తోంది. ఇలా ఎంతకాలం. ఇంటిగుట్టు బయటపడకుండా బతికినవాళ్లం నిత్యావసరాల కోసం రోడ్డుపైకి రావడం బాధగా ఉంది.’ మల్కాజిగిరికి చెందిన గాయని అనురాధ ఆవేదన ఇది. ఆమె సుమధుర ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తోంది. 10 మంది కళాకారులు ఒక బృందంగా ఏర్పడి ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు. పెళ్లిళ్లు, వేడుకలు, రవీంద్రభారతి, త్యాగరాయ గానసభల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలే వాళ్లకు వేదికలు, కానీ ఈ 2 నెలలుగా ఎలాంటి కార్యక్రమాలు లేవు. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. దోమలగూడకు చెందిన శ్రీదేవి కూడా చక్కటి గాయని, దేశవిదేశాల్లో తన పాటలతో ఆకట్టుకున్నారు. ‘25 ఏళ్లుగా పాటలే ప్రపంచంగా బతికాను, ఇలాంటి రోజులు వస్తాయని కలలో కూడా ఊహించుకోలేదు. ఎలాంటి ఈవెంట్లు లేవు. పిల్లల చదువులు, భవిష్యత్ ఊహించుకుంటే భయంగా ఉంది’. అన్నారు. ఎదురుచూపులే మిగిలాయి.. సికింద్రాబాద్‌కు చెందిన తబలా ఆర్టిస్టు స్వామి కుటుంబం మరింత దుర్భర పరిస్థిలను అనుభవిస్తోంది. పక్షవాతం కారణంగా కొంతకాలంగా అతడు ఇంటికే పరిమితమయ్యాడు. మరో ఆదాయ మార్గం లేదు. దీంతో ఆయన భార్య మోండా మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు లలిత సంగీతంలో చక్కటి ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన పాతికేళ్ల కనకదుర్గకు అకస్మాత్తుగా కిడ్నీలు ఫెయిలయ్యాయి. వైద్యం భారంగా మారింది. ఒకరిద్దరు దాతలు ఆదుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ఒకవైపు లాక్డౌన్ మరోవైపు ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపాధి లేక కుటుంబ సభ్యులు విలవిలలాడుతున్నారు. ఆదుకొనే ఆపన్నుల కోసం ఇలాంటి కళాకారులు ఎందరో దయనీయంగా ఎదురు చూస్తున్నారు. కన్నీళ్లే మిగిలాయి పదిమంది కలిస్తేనే కళాకారులకు బలం. కానీ కరోనా కారణంగా ఆ పది మంది ఒక్కచోట చేరే అవకాశం లేదు. మా కళలను ప్రదర్శించలేం. ప్రతి ఒక్కరినీ సంతోషపరిచే కళాకారులకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయి. కళాకారులకు తెల్లరేషన్ కార్డులు, ఆర్థిక సహాయం అందజేయాలి. చాలామంది ఎలాంటి గుర్తింపు లేకుండా ఉన్నారు. – పెండ్యాల శ్రీనివాస్, రిథమ్ ప్లేయర్ వేదికలు ఎక్కగలమా..? ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ అయిపోయింది. ఇక ఈ ఏడాది ఎలాంటి కార్యక్రమాలు ఉండకపోవచ్చు. ప్రభుత్వమే కళాకారులను ఆదుకోవాలి. ఆర్థికంగా సహాయం అందజేయాలి. – శ్రీదేవి, గాయని -
పాట పాడలేదని కాల్చేశాడు..
ఉత్తర్‌ప్రదేశ్ (బలియా): ఆర్కెస్ట్రా కార్యక్రమంలో కోరిన పాట పాడలేదని గాయకురాలిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్ లోని చౌబీస్ పరగణకి చెందిన పియూ (23) అనే ఆర్కెస్ట్రా గాయకురాలు బలియాలోని దయా చాప్రా గ్రామంలో ఓ వివాహ కార్యక్రమంలో పాడేందుకు వచ్చింది. అయితే అభిమానులు కోరిన పాటని పాడడానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన బబ్లూ కుమార్ సింగ్ అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున ఆమెను తుపాకీతో కాల్చి చంపాడని ఏఎస్పీ కేసీ గోస్వామీ తెలిపారు. నిందుతుడు బబ్లూ సింగ్ ని అదుపులోకి తీసుకున్నామని, పియూ మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్టు పేర్కొన్నారు.