సంగీతం ఒక శక్తి.. దివ్య ఔషధం.. కమ్మని మ్యూజిక్ విన్నప్పుడు తనువు, మనసు పులకిస్తాయి. మధురమైన సంగీతం, సుమధుర గానం ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. సాయంసంధ్యవేళ..
సంగీత, నృత్య, గాత్రాలతో కనువిందు చేసేరవీంద్రభారతి, త్యాగరాయ గానసభ వంటిమందిరాలకు లాక్‌డౌన్‌తో తాళం పడింది.పది మంది సాహిత్య, సాంస్కృతిక ప్రియులు ఒక్కచోట చేరేందుకు అవకాశం లేదు. పెళ్లిళ్లు, వేడుకలు, గానాభజానాలు లేవు. దీంతో కళలపైనే ఆధారపడి ఉపాధిపొందుతున్న వేలాది మంది కళాకారులురోడ్డున పడ్డారు.
సాక్షి, సిటీబ్యూరో: నాలుగో దశ లాక్‌డౌన్‌లో అనేక రంగాల్లో సడలింపులు లభించినా సాంస్కృతిక వేడుకలపైన మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో 2 నెలలుగా తీవ్రమైన దుర్భర పరిస్థితుల్లో కుటుంబాలను నెట్టుకొస్తున్న సంగీత, నృత్య, గాత్ర, ఆర్కెస్ట్రా, మిమిక్రీ, జానపద, కోలాటం, సన్నాయి తదితర రంగాలకు చెందిన కళాకారులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 5 వేల మందికిపైగా ఆర్కెస్ట్రా కళాకారులు ఉన్నారు. జానపద, లలిత సంగీత పాటలతో ఆకట్టుకునే గాయకులు, తబలా, ఫ్లూట్, ప్యాడ్, డ్రమ్స్, కీబోర్డు, మృదంగం వంటి వివిధ రకాల ఉపకరణాలపై అందమైన సంగీత ప్రవాహాన్ని సృష్టించి ఆహూతులను అలరింపజేసే ఈ కళాకారులంతా తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు.
ఇలా ఎంతకాలం..
‘లాక్‌డౌన్ ఆరంభమైన మార్చి ఆఖరి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం ఇబ్బంది లేకుండా గడిచింది. కానీ ఏప్రిల్ రెండో వారంతో కష్టాలు మొదలయ్యాయి. దాతల సహాయంపైనే బతకాల్సి వస్తోంది. ఇలా ఎంతకాలం. ఇంటిగుట్టు బయటపడకుండా బతికినవాళ్లం నిత్యావసరాల కోసం రోడ్డుపైకి రావడం బాధగా ఉంది.’ మల్కాజిగిరికి చెందిన గాయని అనురాధ ఆవేదన ఇది. ఆమె సుమధుర ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తోంది. 10 మంది కళాకారులు ఒక బృందంగా ఏర్పడి ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు. పెళ్లిళ్లు, వేడుకలు, రవీంద్రభారతి, త్యాగరాయ గానసభల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలే వాళ్లకు వేదికలు, కానీ ఈ 2 నెలలుగా ఎలాంటి కార్యక్రమాలు లేవు. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. దోమలగూడకు చెందిన శ్రీదేవి కూడా చక్కటి గాయని, దేశవిదేశాల్లో తన పాటలతో ఆకట్టుకున్నారు. ‘25 ఏళ్లుగా పాటలే ప్రపంచంగా బతికాను, ఇలాంటి రోజులు వస్తాయని కలలో కూడా ఊహించుకోలేదు. ఎలాంటి ఈవెంట్లు లేవు. పిల్లల చదువులు, భవిష్యత్ ఊహించుకుంటే భయంగా ఉంది’. అన్నారు.
ఎదురుచూపులే మిగిలాయి..
సికింద్రాబాద్‌కు చెందిన తబలా ఆర్టిస్టు స్వామి కుటుంబం మరింత దుర్భర పరిస్థిలను అనుభవిస్తోంది. పక్షవాతం కారణంగా కొంతకాలంగా అతడు ఇంటికే పరిమితమయ్యాడు. మరో ఆదాయ మార్గం లేదు. దీంతో ఆయన భార్య మోండా మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు లలిత సంగీతంలో చక్కటి ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన పాతికేళ్ల కనకదుర్గకు అకస్మాత్తుగా కిడ్నీలు ఫెయిలయ్యాయి. వైద్యం భారంగా మారింది. ఒకరిద్దరు దాతలు ఆదుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ఒకవైపు లాక్‌డౌన్ మరోవైపు ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపాధి లేక కుటుంబ సభ్యులు విలవిలలాడుతున్నారు. ఆదుకొనే ఆపన్నుల కోసం ఇలాంటి కళాకారులు ఎందరో దయనీయంగా ఎదురు చూస్తున్నారు.
కన్నీళ్లే మిగిలాయి
పదిమంది కలిస్తేనే కళాకారులకు బలం. కానీ కరోనా కారణంగా ఆ పది మంది ఒక్కచోట చేరే అవకాశం లేదు. మా కళలను ప్రదర్శించలేం. ప్రతి ఒక్కరినీ సంతోషపరిచే కళాకారులకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయి. కళాకారులకు తెల్లరేషన్ కార్డులు, ఆర్థిక సహాయం అందజేయాలి. చాలామంది ఎలాంటి గుర్తింపు లేకుండా ఉన్నారు. – పెండ్యాల
శ్రీనివాస్, రిథమ్ ప్లేయర్
వేదికలు ఎక్కగలమా..?
ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ అయిపోయింది. ఇక ఈ ఏడాది ఎలాంటి కార్యక్రమాలు ఉండకపోవచ్చు. ప్రభుత్వమే కళాకారులను ఆదుకోవాలి. ఆర్థికంగా సహాయం అందజేయాలి. – శ్రీదేవి, గాయని
Comments
Please login to add a commentAdd a comment