breaking news
ordinary people
-
పరిశ్రమిస్తున్న నారీ లోకం!
‘అన్నీ తెలిసిన వారు ఉండరు.అలాగే ఏమీ తెలియని వారూ ఉండరు’ అనేది సామెత. ‘నీకు తెలిసిందే నీ శక్తి’ అనేది నీతికథ. జిమ్మి రాజుకు అంతర్జాతీయ వ్యాపారాల గురించి తెలియదు కానీ పచ్చళ్ల గురించి బాగా తెలుసు. ‘గ్రాండ్మా’ పేరుతో పచ్చళ్ల కంపెనీ ప్రారంభించి గ్రాండ్ సక్సెస్ అయింది. ఒకప్పుడు కేరళలోని త్రిసూర్‌కే పరిమితమైన ఆ కంపెనీ ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో కూడా సత్తా చాటుతోంది. జిమ్మి రాజు మాత్రమే కాదు ఘనమైన వ్యాపార నేపథ్యం లేని ఎంతోమంది సాధారణ మహిళలు చిన్న చిన్న అడుగులు వేస్తూనే ఎంటర్ప్రెన్యూర్లుగా పెద్ద స్థాయికి చేరుకున్నారు.గ్రాండ్మా..గ్రాండ్ సక్సెస్‘నేను వ్యాపారవేత్త కాగలనా?’ తనకు తాను ప్రశ్న వేసుకుంది జిమ్మి రాజు. ‘కచ్చితంగా!’ తనలో నుంచే సమాధానం వచ్చింది. ‘నాకు ఏం తెలుసు?’ మరో ప్రశ్న.‘పెద్దగా ఏమీ తెలియనక్కర్లేదు. నడిచే దారిలో అన్నీ తెలుస్తాయి’ ఆ ప్రశ్నకు జవాబు.తనకు పచ్చళ్లు అంటే ఇష్టం. ఆసక్తి. ‘యస్...పచ్చళ్లతోనే మొదలెడదాం’ అనుకొని ప్రయాణం ప్రారంభించింది జిమ్మి రాజు. కేరళలోని మరడీలో ‘గ్రాండ్మా’ పేరుతో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించింది. ‘గ్రాండ్మా’ గ్రాండ్ సక్సెస్‌కు కారణం నాణ్యతతో కూడిన నిమ్మకాయ పచ్చళ్లు. ‘గ్రాండ్మా’ ఇంట గెలిచింది. ఇప్పుడు రచ్చ గెలవాలి. వ్యాపారాన్ని విస్తరించాలంటే ముందు డబ్బు కావాలి. ‘ఫెడరల్ బ్యాంక్’ నుంచి లోన్ ద్వారా తన వ్యాపారాన్ని జాతీయ స్థాయికి, యూరోపియన్ దేశాల వరకు తీసుకువెళ్లింది జిమ్మి రాజు. ‘గ్రాండ్మా’ ఇప్పుడు ఎంతోమందికి ఉపాధిని ఇస్తోంది.నష్టాల నుంచి లాభాలకుపంజాబ్లోని మన్సాకు చెందిన కుల్విందర్ కౌర్ కుటుంబం డెయిరీ ఫామ్‌ను నిర్వహించేది. ఈ డైరీ వల్ల లాభాల మాటేమిటోగానీ నష్టాలే నష్టాలు! ‘ఇలా అయితే కుదరదు’ అని గట్టిగా అనుకున్న కుల్విందర్ ‘ఇప్పుడు ఏం చేయాలి?’ అని లోతుగా ఆలోచించింది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ‘మనీబాక్స్’ను సంప్రదించింది. ఈ కంపెనీ నుంచి అందిన రుణంతో డెయిరీని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దింది. నష్టాల నుంచి బయటపడడానికి, లాభాల బాట పట్టి పెద్ద డెయిరీ ఫామ్ స్థాయికి చేరడానికి ఎంతో కాలం పట్టలేదు.అమ్మ నేర్పిన విద్యలక్ష్మి పది సంవత్సరాల వయసులో ఉన్నప్పడు తల్లి వినయ కేరళ, కొంకణి వంటకాలకు సంబంధించి చిన్నపాటి వ్యాపారాన్ని నిర్వహించేది. స్కూలు నుంచి రాగానే తల్లి చేసిన రకరకాల వంటకాలను రుచి చూసేది చిన్నారి లక్ష్మి. ప్యాకింగ్, డెలివరీకి సంబంధించిన పనుల్లో తల్లికి సహాయపడుతుండేది. ఏళ్ల తరువాత... వినయ కోవిడ్ బారిన పడింది. అప్పుడు కూడా వైద్యులతో తన వ్యాపారం గురించి మాట్లాడేది. తల్లి చనిపోయి తరవాత విషాదంలో కూరుకుపోయింది లక్ష్మి. ఆ సమయంలోనే తన భవిష్యత్‌ని మార్చే నిర్ణయం తీసుకుంది.‘అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటే వ్యాపారం ఆగకూడదు’ అనుకుంది. అలా ‘లక్ష్మి’ ఫుడ్ స్టార్టప్ మొదలైంది. రకరకాల వంటకాలకు సంబంధించి తల్లి రాసిన నోట్స్ తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మొదట్లో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్లకు సంబంధించిన సమస్యలు ఎదురైనా ఆ తరువాత మాత్రం కంపెనీని పెద్ద ఎత్తున విస్తరించింది.‘అమ్మ మా వ్యాపారాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని కలలు కనేది. ఆమె కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాం. స్థానిక అమ్మకాలు, ఆన్లైన్ అమ్మకాలు, సోషల్ మీడియా మార్కెటింగ్‌తో అమ్మ కలను సాకారం చేశాం’ అంటుంది కేరళలోని త్రిసూర్‌కు చెందిన లక్ష్మి.మష్రూమ్ లేడీ ఆఫ్ హరియాణాకోవిడ్ కల్లోల కాలంలో దొరికిన విరామంలో ‘కొత్తగా ఏదైనా చేయాలి’ అని ఆలోచించింది అసిస్టెంట్ ప్రొఫెసర్ సోనియ దాహియ. ఆ ఆలోచనలే ఫలితమే... పుట్టగొడుగుల పెంపకం. ఆమె నిర్ణయం చాలా మందిని షాక్‌కు గురి చేసింది. ‘భద్రతను ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పుట్టగొడుగుల పెంపకం ఏమిటి!’ అని ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సోనియా. నలభై లక్షల రూపాయలతో ‘డాక్టర్ దాహియ మష్రూమ్ ఫామ్’ ప్రారంభించింది.రోజు రోజుకూ వ్యాపారాన్ని విస్తరిస్తూ పోయింది. ఊహించని లాభాల స్థాయికి తీసుకువచ్చింది. అయితే మొదట్లో ఆమె ప్రయాణం సజావుగా ఏమీ జరగలేదు. తరచు విద్యుత్ కోతలుండేవి. ఆ ప్రభావం పుట్టగొడుగులపై పడేది. ఇదొక్కటే కాదు...ఎన్నో సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను కనుక్కుంటూ వెళ్లిన సోనియ ‘మష్రూమ్ లేడీ ఆఫ్ హరియాణా’గా పేరు తెచ్చుకుంది. పుట్టగొడుగుల పెంపకంలో సోనియాకు బయోటెక్నాలజీ నేపథ్యం ఎంతగానో ఉపయోగపడింది.ఆ బడిలో ఎన్నో విలువైన పాఠాలు→ ఎన్ని సవాళ్లు, సమస్యలు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోకూడదు. నేను చెప్పే గెలుపు మంత్రం...‘అపజయం అనేది తాత్కాలికం’ → ‘లింగ వివక్షత’ కనిపించకుండా చేసే శక్తి మన విజయానికి ఉంటుంది → ఎంటర్ప్రెన్యూర్ చేసే ప్రయాణం అనేది విరామమెరుగని నిరంతర ప్రయాణం → మీరు ఒక పని ఎంచుకుంటే, మీ జీవితం మొత్తం ఆ పని మీదే ఆధారపడినంతగా కష్టపడాలి → వ్యాపారవేత్తగా ప్రయాణం ప్రారంభించడం అంటే బడిలో విద్యార్థిగా చేరడమే. ఆ బడిలో ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంటాం.– కిరణ్ మజుందార్–షా, బయోకాన్ వ్యవస్థాకురాలు -
Asha Suman: ఆత్మవిశ్వాసమే అసలైన గురుదక్షిణ
రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో దివ్యాంగురాలైన ఒక స్టూడెంట్ అత్యాచారానికి గురైన సంఘటన ఆశా సుమన్‌ను షాక్‌కు గురి చేసింది. స్కూలు, కాలేజిల్లో చదివే అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పాలని ఆ సమయంలో సంకల్పించుకుంది ఆశ. దివ్యాంగులు, సాధారణ యువతులు 30 వేల మందికి పైగా ఆత్మరక్షణ విద్యలు నేర్పించిన ఉపాధ్యాయురాలు ఆశా సుమన్ గురించి... తొమ్మిది సంవత్సరాల క్రితం రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని ఖార్కర గ్రామంలో... ఆరోజు స్కూల్‌కు వెళ్లింది ఆశా సుమన్. బడిలో మగపిల్లలు తప్ప ఆడపిల్లలు ఎవరూ కనిపించలేదు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఈ లోపే ఎవరో ఊళ్లో జరిగిన దుర్ఘటన గురించి చెప్పారు. దివ్యాంగురాలైన ఒక అమ్మాయి సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ సంఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. విషయం తెలిసిన ఆశ హుటాహుటిన బాధితురాలి ఇంటికి వెళ్లింది. ఆ సంఘటనకు సంబంధించిన విషయాలు చెవిన పడుతున్నప్పుడు ఆమె మనసు దుఃఖసముద్రం అయింది. ఈ సంఘటన ప్రభావంతో కొద్దిమంది తల్లిదండ్రులు అమ్మాయిలను స్కూల్‌కు పంపడం మాన్పించారు. నిజానికి ఆ ప్రాంతంలో ఆడపిల్లల చదువుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. ఇచ్చే వాళ్లు కూడా తమ ఇంటి ఆడపిల్లలను బడికి పంపడానికి భయపడుతున్నారు. స్కూల్‌కు వెళ్లినా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా ఆ పాశవిక సంఘటన, తల్లిదండ్రులపై దాని ప్రభావం పడి ఆడపిల్లలు స్కూల్‌కు దూరం కావడం... ఇవి పదేపదే గుర్తుకు వచ్చి ఆశను విపరీతంగా బాధపెట్టాయి. ‘ఆ అమ్మాయికి తనను తాను రక్షించుకోవడం తెలిస్తే ఇలా జరిగేది కాదేమో. ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్య నేర్పాలి’ అనుకుంది. మొదటి అడుగుగా... పిల్లల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడింది. పిల్లలను తిరిగి స్కూల్‌కు పంపించడానికి వారు మొదట్లో ససేమిరా అన్నారు. చదువు అనేది ఎంత అవసరమో వివరించి, అమ్మాయిలు తమను తాము కాపాడుకునే ఆత్మరక్షణ విద్యల గురించి చెప్పి వారిలో మార్పు తీసుకువచ్చింది. కొన్ని రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి అమ్మాయిలను తన స్కూటర్‌పై స్కూల్‌కు తీసుకువచ్చేది. రెండు నెలల తరువాత పరిస్థితి మామూలుగా మారింది. స్కూల్లోని అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించడంతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పేది. ఆశ గురించి విన్న చుట్టుపక్కల ఊళ్లలోని స్కూల్, కాలేజీ వాళ్లు ‘మా స్టూడెంట్స్‌కు కూడా నేర్పించండి’ అంటూ ఆహ్వానిం చారు. కాదనకుండా వారి ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో స్కూళ్లు, కాలేజీలలో ఎంతోమంది అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించింది. వైకల్యం ఉన్న బాలికలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పే విధానం వేరుగా ఉంటుంది, వారు సులభంగా అర్థం చేసుకునేలా, అర్థం చేసుకున్నది ఆచరణలో చేసేలా రోజువారి సంఘటనలను ఉదాహరిస్తూ, డమ్మీని ఉపయోగిస్తూ నేర్పిస్తుంటుంది. దృష్టిలోపం ఉన్న మౌనిక అనే స్టూడెంట్ ఆశ టీచర్ దగ్గర సెల్ఫ్–డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకుంది. ‘నేను బయటికి ఎక్కడికి వెళ్లినా తోడుగా అన్నయ్య వచ్చేవాడు. అన్నయ్య లేకుంటే బయటకు వెళ్లడానికి సాహసించేదాన్ని కాదు. అయితే ఇప్పుడు నా గురించే నేనే కాదు, తల్లిదండ్రులు కూడా భయపడడం లేదు. ఎవరైనా నాకు చెడు చేయడానికి ముందుకు వస్తే నిమిషాల్లో మట్టి కరిపించగలననే నమ్మకం వచ్చింది’ అంటుంది మౌనిక. స్టూడెంట్స్లోనే కాదు వారి తల్లిదండ్రులలోనూ ఇప్పుడు ఎంతో ధైర్యం వచ్చింది. ‘చాలామందిలాగే నేను కూడా మా అమ్మాయిని స్కూల్‌కు పంపడానికి భయపడ్డాను. ఇప్పుడు అలాంటి భయాలేవీ లేవు. స్కూల్ అయిపోగానే అమ్మాయిల కోసం ఆశా టీచర్ నిర్వహిస్తున్న సెల్ఫ్–డిఫెన్స్ క్లాసులను దగ్గర నుంచి చూశాను. అమ్మాయిల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది. ప్రతి స్కూల్లో ఆశలాంటి టీచర్ ఒకరు ఉండాలి’ అంటున్నాడు ఆ ఊరికి చెందిన జస్వంత్. అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఆశ టీచర్ చేస్తున్న కృషికి ఎన్నో పురస్కారాలు లభించాయి. ఆత్మరక్షణ విద్యల వల్ల అమ్మాయిల్లో కనిపించే ఆత్మవిశ్వాసమే తనకు అసలు సిసలు గురుదక్షిణ అంటుంది ఆశా సుమన్. -
సంబురం ఆవిరి
సాక్షి, హైదరాబాద్: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి పండుగ సంబరాన్ని ఆవిరి చేస్తున్నాయి. కరోనా మహమ్మారి భయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు పెరుగుతున్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు అనూహ్యంగా పెరగడం.. ఇటీవలి వరదలు, పంట నష్టంతో ఆదాయం తగ్గడంతో పండుగ సంతోషం కాస్తా పటాపంచలవుతోంది. చేతిలో చిల్లిగవ్వ కరువు కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే పట్టణ, గ్రామీణ ప్రాంత పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలపై పెను ప్రభావాన్ని చూపింది. వ్యాపార లావాదేవీలు తగ్గడం, జీతభత్యాలు, ఉద్యోగాల్లో కోతలు సామాన్యుడి నడ్డి విరిచాయి. మార్చి – ఆగస్టు మధ్య కాలంలో 84 శాతం కుటుంబాలు ఆదాయాన్ని కోల్పోవడం లేదా తగ్గుదలను ఎదుర్కొంటున్నాయని జాతీయ సర్వేలు అంచనా వేశాయి. దేశవ్యాప్తంగా పట్టణ జనాభాలో కనీసం 13.9 కోట్ల మంది కరోనా విపత్తు నేపథ్యంలో పొదుపు (సేవింగ్స్)ను పూర్తిగా మరిచిపోయాయని ఈ సర్వేలు పేర్కొన్నాయి. దీన్నుంచి కోలుకుంటున్న సమయంలోనే భారీ వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికితోడు వరి, మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో కొనుగోళ్లు జరగక చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి ఎదురైంది. ఇక హైదరాబాద్, వరంగల్ వంటి పట్టణాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. వీటి నుంచి తేరుకుంటున్న సమయంలోనే పెరుగుతున్న ధరలు మరింత కలవరపెడుతున్నాయి. పప్పులుడకట్లే.. సామాన్యులకు పప్పన్నమూ కరువవుతోంది. లాక్డౌన్ అనంతరం ఒక్కసారిగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. ప్రస్తుత సాధారణ పరిస్థితుల్లోనూ కిలో రూ.100కి తగ్గకుండా పలుకుతున్నాయి. దిగిరానంటున్న ధరలతో వంటింట్లో పప్పులుడకట్లేదు. విదేశీ దిగుమతులు తగ్గడం, దేశీయంగా పప్పుల దిగుబడులు తగ్గడంతో ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవు. లాక్డౌన్ ముందువరకు కంది, పెసర, మినపపప్పుల ధరలు కిలో రూ.100కి తక్కువగా ఉన్నా.. ఆ తరువాత ధర రూ.100కి ఎగబాకింది. ప్రస్తుతం మార్కెట్లో మేలు రకం కందిపప్పు కిలో రూ.110– 115 మధ్య ఉంది. గతేడాది ఇదే సమయంలో ఉన్న ధరలతో పోలిస్తే కనిష్టంగా రూ.20 మేర ఎక్కువ. గ్రేడ్–2 రకం కిలో రూ.90–100 పలుకుతోంది. పెసర, మినపపప్పు ధరలూ రూ.105–110 వరకు ఉన్నాయి. వీటి ధరలు గతేడాదితో పోల్చినా రూ.25 మేర పెరిగాయి. కాగుతున్న నూనెలు.. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరగడం, అందుకు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో నూనెల ధరలు అమాంతం పెరిగాయి. లాక్‌డౌన్‌కు ముందు సన్‌ఫ్లవర్ లీటర్ ధర హోల్‌సేల్‌లో రూ.100 ఉండగా, ప్రస్తుతం హోల్‌సేల్‌లోనే రూ.115 పలుకుతోంది. ఇది వినియోగదారుడికి రిటైల్‌లో రూ.120కి చేరుతోంది. ఇది గతేడాది ధరలతో పోలిస్తే ఏకంగా రూ.30 మేర ఎక్కువ. సామాన్యులు అధికంగా వినియోగించే పామాయిల్.. గతేడాది సెప్టెంబర్‌లో రిటైల్‌లో రూ.85 ఉండగా, ప్రస్తుతం రూ.100కి చేరింది. ఇక వేరుశనగ నూనె ధర సైతం గతేడాది రూ.120 ఉండగా, రూ.150కి చేరింది. ఉల్లి కిలో రూ.100 కిలో రూ.50గా ఉన్న ఉల్లి ధర వారం వ్యవధిలో ప్రస్తుతం రూ.100కి చేరింది. ఉల్లి ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతిని, దిగుబడి తగ్గిపోవడం, డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేక ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలకు కళ్లెంవేసే చర్యలేవీ లేకపోవడంతో ఇప్పట్లో దిగివచ్చేలా లేవు. ఇక టమాటాదీ అదే పరిస్థితి. దీని సాగు రాష్ట్రంలో తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలతో పంట దెబ్బతినడంతో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో రూ.50–60 పలుకుతోంది. వీటితో పాటే వంకాయ, ఆలుగడ్డ, బీరకాయ ధరలు రూ.60–70 పలుకుతుండటంతో సామాన్యులు ఏం కొనే పరిస్థితి కనిపించట్లేదు. -
ఇది బాబు మార్క్ సర్కార్
► పేదోడిపై విద్యుత్ భారం ► విద్యుత్ ఛార్జీల పెంపు పట్ల సర్వత్రా విమర్శలు రాజంపేట టౌన్ : సామాన్యుడి సంక్షేమమే ధ్యేయమని పదేపదే చెప్పుకువచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్ ఛార్జీలను పెంచి పేదోడిపై పెను భారాన్ని మోపారు. గతంలో 9 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు ప్రజలపై అన్ని రకాల భారాలను మోపి, ప్రజలకు పెట్టిన బాధలు అన్నీఇన్నీ కావు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో నేను మారాను, మీకు మంచి చేస్తాననని చెప్పి నోటికి వచ్చిన హామీలన్ని ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన బాబు తన పాత మార్క్ పాలనను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపి ఇది బాబు మార్క్ పాలన అని నిరూపించాడు. ధనవంతులపైనే విద్యుత్ భారం పడుతుందని ప్రభుత్వం ప్రజలను నమ్మించే మాటలు చెపుతున్నా ముమ్మాటికి విద్యుత్ ఛార్జీల భారం పేద, మధ్య తరగతి ప్రజల, వ్యాపారులపై ప్రతి నెల ఆర్థిక ప్రభావాన్ని చూపనుంది. తిని, తినక టీవీ, ఫ్యాన్, మిక్సి వంటి సౌకర్యాలను కల్పించుకున్న పేద, మధ్య తరగతి ప్రజలు విద్యుత్ ఛార్జీల పెంపుతో వాటిని అటకెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలావుంటే చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక మూడుమార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడం పట్ల బాబు పాలన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే ఉపసంహరించుకోవాలి: పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. నోట్ల రద్దుతో ఇప్పటికే పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా వెనకబడ్డారు. ఈతరుణంలో విద్యుత్ ఛార్జీలు పెంపు ప్రభావం పేద, మ«ధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలపై పడుతుంది. విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే ఆందోళనలు చేపడతాం. ---చిట్వేలి రవికుమార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పేద, మధ్య తరగతి ప్రజలకే ఇబ్బంది: ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజల జీవనం కష్టతరంగా వుంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్య ప్రజలకు శరాఘాతంగా మారుతుంది. ---దండు గోపి, సాతపల్లె, రాజంపేట