ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్ ఛార్జీలను పెంచి పేదోడిపై పెను భారాన్ని మోపారు
► పేదోడిపై విద్యుత్ భారం
► విద్యుత్ ఛార్జీల పెంపు పట్ల సర్వత్రా విమర్శలు
రాజంపేట టౌన్ : సామాన్యుడి సంక్షేమమే ధ్యేయమని పదేపదే చెప్పుకువచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్ ఛార్జీలను పెంచి పేదోడిపై పెను భారాన్ని మోపారు. గతంలో 9 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు ప్రజలపై అన్ని రకాల భారాలను మోపి, ప్రజలకు పెట్టిన బాధలు అన్నీఇన్నీ కావు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో నేను మారాను, మీకు మంచి చేస్తాననని చెప్పి నోటికి వచ్చిన హామీలన్ని ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన బాబు తన పాత మార్క్ పాలనను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు.
తాజాగా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపి ఇది బాబు మార్క్ పాలన అని నిరూపించాడు. ధనవంతులపైనే విద్యుత్ భారం పడుతుందని ప్రభుత్వం ప్రజలను నమ్మించే మాటలు చెపుతున్నా ముమ్మాటికి విద్యుత్ ఛార్జీల భారం పేద, మధ్య తరగతి ప్రజల, వ్యాపారులపై ప్రతి నెల ఆర్థిక ప్రభావాన్ని చూపనుంది. తిని, తినక టీవీ, ఫ్యాన్, మిక్సి వంటి సౌకర్యాలను కల్పించుకున్న పేద, మధ్య తరగతి ప్రజలు విద్యుత్ ఛార్జీల పెంపుతో వాటిని అటకెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలావుంటే చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక మూడుమార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడం పట్ల బాబు పాలన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వెంటనే ఉపసంహరించుకోవాలి: పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. నోట్ల రద్దుతో ఇప్పటికే పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా వెనకబడ్డారు. ఈతరుణంలో విద్యుత్ ఛార్జీలు పెంపు ప్రభావం పేద, మ«ధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలపై పడుతుంది. విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే ఆందోళనలు చేపడతాం. ---చిట్వేలి రవికుమార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
పేద, మధ్య తరగతి ప్రజలకే ఇబ్బంది: ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజల జీవనం కష్టతరంగా వుంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్య ప్రజలకు శరాఘాతంగా మారుతుంది. ---దండు గోపి, సాతపల్లె, రాజంపేట