Organic Foods
-
తూములూరు రుచులు ఊరు
మొదట అక్కడ సేంద్రియ వ్యవసాయం మొదలైంది. తర్వాత స్త్రీలు సేంద్రియ తినుబండారాలు మొదలుపెట్టారు. రేకుల షెడ్డే వారి వంటశాల. అరవై పైబడిన బసవ పూర్ణమ్మ వారి మేస్త్రి. రాగి లడ్డు, జొన్నలడ్డు, నల్ల అరిసెలు, నువ్వుండలు... ఆ కారం... ఈ పచ్చడి... ఎక్కడా రసాయనాల ప్రస్తావన ఉండదు. ఆముదం, కాటుక, కుంకుమ కూడా తయారు చేస్తున్నారు. వీరికి ఆర్డర్లు భారీగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న ఊరు స్త్రీల వల్ల కరకరలాడుతోంది. కళకళలాడుతోంది. 2018లో మొదలైంది ఈ కథ. ‘అమ్మా... మేము పండిస్తున్న సేంద్రియ పంటలకు మంచి డిమాండ్ వస్తోంది. కాని ఇవే సేంద్రియ పదార్థాలతో చిరుతిండ్లు చేయించి అమ్మమని అందరూ అడుగుతున్నారు. నువ్వు తయారు చేస్తావా?’ అని అడిగాడు అవుతు వెంకటేశ్వర రెడ్డి తన తల్లి బసవ పూర్ణమ్మతో. ఆమెకు పల్లెటూరి పిండి వంటలు చేయడం వచ్చు. పండగలకు పబ్బాలకు పల్లెల్లో ఎవరు మాత్రం చేయరు? ‘అదెంత పనిరా చేస్తాను’ అంది. అలా గుంటూరు జిల్లాలోని కొల్లిపరకు ఆనుకుని ఉండే తూములూరు అనే ఊళ్లో సేంద్రియ చిరుతిళ్ల తయారీ మొదలైంది. బసవ పూర్ణమ్మ ఇంటిలో వేపచెట్టు కింద ఉండే పశువుల కొట్టాం కాస్తా వంటల షెడ్డుగా మారింది. ఊళ్లో వంటలు చేయడం ఆసక్తి ఉన్న స్త్రీలకు ఇదొక ఉపాధిగా ఉంటుందని వారిని తోడుకమ్మని ఆహ్వానించింది బసవ పూర్ణమ్మ. అలా ‘విలేజ్ మాల్’ అనే బ్రాండ్‌తో ‘కొల్లిపర మండల వ్యవసాయదారుల సంఘం’ అనే లేబుల్ కింద తూములూరు చిరుతిండ్ల తయారీ మొదలైంది. రసాయనాలు లేని తిండి ‘మా అబ్బాయీ, ఇంకొంత మంది రైతులు 2015 నుంచి కొల్లిపర చుట్టుపక్కల ఊళ్లలో సేంద్రియ పద్ధతిలో వరి, పసుపు,అరటి, నిమ్మ పండించడం మొదలుపెట్టారు. వీళ్లకు ‘గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం’ అనే సంఘం ఉంది. రైతులంతా కలిసి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ పంటను మంచి రేటుకు అమ్ముతున్నారు. ఆ సమయంలోనే మార్కెట్లో కల్తీ నూనెలతో, పిండ్లతో తయారై వస్తున్న పిండి వంటలు తినలేక సేంద్రియ పిండివంటల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మా అబ్బాయి ప్రోత్సాహంతో రంగంలోకి దిగాను. మొదట వేరుశనగ ఉండలు చేశాం. నిడదవోలు, మాండ్య లాంటి చోట్ల నుంచి సేంద్రియ బెల్లం తెప్పించి చేశాం. రుచి భలే ఉండటంతో డిమాండ్ వచ్చింది. అలా ఒక్కోటి పెంచుకుంటూ వెళ్లాం. ఇవాళ 30 రకాల చిరుతిళ్లు తయారు చేస్తున్నాం’ అని చెప్పింది బసవపూర్ణమ్మ. రాగిలడ్డు, జొన్న లడ్డు, నల్లబియ్యం అరిసెలు, నువ్వుండలు, పప్పుండలు, జంతికలు, కొబ్బరి లడ్డు, చెక్కలు ఇవి కాకుండా కరివేపాకు కారం, మునగాకు కారం వీరు తయారు చేస్తున్నారు. ఇక మామిడి, గోంగూర పచ్చడి గుంటూరు జిల్లా ప్రత్యేకం. అవీ చేస్తున్నారు. ‘సేంద్రియ నూనె పేరుతో అమ్ముతున్న నూనెలు కూడా కరెక్ట్‌గా లేవు. చాలా నూనెలు ట్రై చేసి రాజస్థాన్‌లో ఒక చోట నుంచి మంచి సేంద్రియ నూనె తెప్పించి ఈ పిండివంటలకు వాడుతున్నాం’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ. ఆమె అజమాయిషీలో సాగే వంటశాలకు వెళితే చెట్టు కింద కట్టెలపొయ్యి మీద ఆముదం గింజలు కుతకుత ఉడికిస్తుంటారు కొందరు. వరండాలో జీడిపాకం ఆరబెట్టి, ఉండలు చుడుతుంటారు కొందరు. చిరుధాన్యాలతో లడ్డూలు, నల్లబియ్యంతో అరిసెలు చేస్తారు మరికొందరు. అంతా కళకళగా ఉంటుంది. ఆముదం, కుంకుమ ‘మార్కెట్లో సిసలైన ఆముదం దొరకడం లేదు. మా చిన్నప్పుడు ఎవరి ఆముదం వారే తయారు చేసుకునేవాళ్లం. అందుకనే ఆముదం కూడా తయారు చేస్తున్నా. లీటరు 800 పెట్టినా ఎగరేసుకుని పోతున్నారు. పసుపు నుంచి కుంకుమ తయారు చేసే పద్ధతి ఉంది. అలా స్వచ్ఛమైన కుంకుమ తయారు చేస్తున్నా. ఆముదం గింజల నుంచే కాటుక తయారు చేయవచ్చు. అదీ చేస్తున్నా. మా చిరుతిండ్ల కంటే వీటిని ఎక్కువమంది మెచ్చుకుని కొనుక్కుంటున్నారు’ అని తెలిపింది బసవపూర్ణమ్మ. ఈ మొత్తం పనిలో పదిహేను మంది ప్రత్యక్షంగా మరో పదిహేనుమంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కోటి టర్నోవర్‌కు... వచ్చే మార్చికంతా కోటి టర్నోవర్‌కు ఈ పిండి వంటల పరిశ్రమ చేరుకోవచ్చని అంచనా. తూములూరు పిండి వంటలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా కేంద్రాల్లో అమ్ముడుపోతున్నాయి. కొందరు సరుకు తీసుకుని తమ బ్రాండ్ వేసుకుని అమ్ముకుంటున్నారు. సరుకు రవాణ మొత్తం ఆర్.టి.సి. కార్గొ మీద ఆధారపడటం విశేషం. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సంఘం నగరాల్లో నిర్వహించే ప్రదర్శనల్లో తూములూరు పిండివంటల స్టాల్ కచ్చితంగా ఉంటోంది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నిర్వహించే సమావేశాలకూ ఈ పిండివంటలనే ఆర్డరు చేస్తున్నారు. ‘ఈ రోజుల్లో ఆడవాళ్లకు పిండివంటలు చేసుకోవటం కష్టమవుతోంది. దీనికితోడు రసాయన అవశేషాలు లేని ఆహారపదార్థాలు దొరకటం దుర్లభంగా తయారైంది. అందుకే మాకు డిమాండ్ వస్తోంది. మరింతమంది రైతులను కలుపుకుని సేంద్రియ పంటలతో పిండివంటలను పరిశ్రమ స్థాయికి చేర్చాలనే ఆలోచన సంఘ సభ్యుల్లో ఉంది. అప్పుడు మా వంటశాలను విస్తరించాల్సి వస్తుంది’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
రాగి ఇడ్లీ.. మిల్లెట్ దోశ
నగరవాసికి ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. ఆర్గానిక్ ఫుడ్‌పై ఆసక్తి ఎక్కువవుతోంది. రసాయనాలతో పండించిన ఆహార పదార్థాల కారణంగా కేన్సర్, కాళ్లు, కీళ్ల, నొప్పులు, ఊబకాయం, శ్వాసకోశ ఇబ్బందులు, మధుమేహం వంటి వ్యాధులు దాడి చేస్తుండటంతో.. సిటీజనులు రసాయన ఎరువులు లేకుండా పండించిన సేంద్రియ ఆహార పదార్థాల (ఆర్గానిక్ ఫుడ్) వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో ఆయా ఉత్పత్తులవిక్రయ దుకాణాలు పలుచోట్ల వెలుస్తున్నాయి. దీంతో పాటు మరో అడుగు ముందుకేసి వాటితో నేరుగా ఆహారాన్ని తయారు చేసి వడ్డించే హోటళ్లు కూడా దర్శనమిస్తున్నాయి. వీటికి భారీగా ఆదరణ ఉంటున్నట్లు ఆయా హోటళ్ల నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారంటే ఆర్గానిక్ ఫుడ్‌పై నగరజీవులు ఎంతటి ఆసక్తి కనబరుస్తున్నారో అవగతమవుతోంది. హైదరాబాద్: రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్‌లో ఇటీవల సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది వీటికి ప్రాధాన్యమిస్తుడటంతో విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. క్షణం తీరికలేని నగరవాసులు ఇంటికి తీసుకెళ్లి ఉత్పత్తులను వండుకుని తినేందుకు కుదరక ఇబ్బందులు పడుతున్నారు. వీరి కోసమే ఇప్పుడు నగరంలో కొత్తగా సేంద్రియ (ఆర్గానిక్) వంటకాలను తయారు చేసి వడ్డించే కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో బంజారాహిల్స్‌లోని ఎమరాల్డ్ వారి సేంద్రియ ఆహార కేంద్రం అహోబిలం మిల్లెట్ కేవ్, ఆర్గానిక్ మాస్తి రెస్టారెంట్, జీవతి సేంద్రియ ఆహార కేంద్రం, మంత్ర సేంద్రియ ఆహార కేంద్రం, విలేజ్ ఆహారం, శ్రీనివాస స్వగృహపూడ్స్ వంటి హోటళ్లు, రెస్టారెంట్లు పెరుగుతున్నాయి. ఆనాటి రుచులు అందేలా... పెరుగుతున్న పాశ్చాత్య పోకడలతో రసాయన మిళిత భోజనాలకు ప్రజలు అలవాటుపడిన నేపథ్యంలో.. కమ్మటి పల్లె రుచులను అందించేందుకు ప్రత్యేక హోటళ్లు నగరంలోని బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, అమీర్‌పేట్, పంజగుట్ట, మెహిదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. స్వచ్ఛమైన సేంద్రియ వంటకాలు, పూర్వకాలపు వడ్డన పద్ధతులు.. వెరసీ తిన్న వారి చేత ఆహా అనిపించేలా చేస్తున్నాయి. ఇక్కడ వండే ప్రతి వంటకమూ ప్రత్యేకమే. మామూలుగా మార్కెట్లలో దొరికే పదార్థాలను ఇక్కడ ఉపయోగించరు. చివరకు రుచిని కలిగించే ఉప్పుకు బదులు సైంథవ లవణాన్ని వాడుతున్నారు. ఆధునికత అంటూ అనారోగ్యం వైపు పరుగుపెడుతున్న నేటి తరానికి వందేళ్ల నాటి కమ్మని రుచులను ఉందిస్తున్నారు. రైతులే సంఘాలుగా.. ప్రస్తుతం పండించే భూముల్లో ఒక్కరోజులోనే సేంద్రియ వ్యవసాయం చేసే అవకాశం లేదు. రసాయనాలతో నిండిపోయిన భూసారం సాధారణ స్థితికి రావాలంటే 3 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం ఇలా దీర్ఘకాలంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి కొందరు సంఘాలుగా ఏర్పడ్డారు. సేంద్రియ హోటళ్ల నిర్వాహకులు తాము వినియోగించే ఉత్పత్తుల్లో 70 శాతం వరకు స్వయంగా పండించుకుంటున్నారు. మిగతా వాటిని ఆర్గానిక్ ఉత్పత్తులను అందించే సంఘాల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో శాకాహారం, పల్లె వాతావరణంలో పెంచిన నాటుకోళ్లు, స్వచ్ఛమైన నీటిలో పెరిగిన చేపలతో మాంసాహారం తయారు చేస్తున్నారు. చిక్కని పాలతో చేసిన గడ్డ పెరుగు ఇక్కడ దొరుకుతోంది. అది కూడా మట్టిపాత్రల్లో తోడు పెడతారు. అంతే కాదు దేశీయ ఆవు పాలును ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇవి బయట దొరికే ఆహార పదార్థాల కంటే 20– 30 శాతం అధిక ధరలున్నా డిమాండ్ బాగానే ఉంది. సేంద్రియ ఉత్పత్తులపై ఆసక్తితోనే.. నేను ఈ హోటల్ పెట్టడానికి ప్రధాన కారణంపంటలపై ఆసక్తి ఉన్న రైతులను ప్రోత్సహించేందుకు, సంప్రదాయ వంటకాలు వండి ప్రజలకు అందించటానికి మా వంతు కృషి చేస్తున్నాం. పాత కాలపు నల్లటి బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. రసాయ రహిత ఉత్పత్తులతో వంటకాలు చేస్తున్నాం. విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ క్షేత్రాల్లో పంటలు పండిస్తున్నాం. దేశీయ ఆవు పాలు, రాగి ఇడ్లీ, మిల్లెట్ దోశ, కాలాభట్ రైస్ మా ప్రత్యేకత. ప్రస్తుతంవినియోగదారుల రాక పెరిగింది. – విజయరామ్, ఎమరాల్డ్ యజమాని. బంజారాహిల్స్ -
పచ్చని పంటలే ఆ ఇంటి చిరునామా!
కాంక్రీట్ జంగిల్లా మారిపోతున్న నగరంలోని ఆ ఇంటికి వెళ్తే మాత్రం.. పచ్చదనం పలకరిస్తుంది. పూల పరిమళాలు రారమ్మని పిలుస్తుంటాయి. రెండంతస్తులు ఎక్కితే చాలు.. విభిన్న రకాల పూలు, పళ్లు, ఆకు కూరలు, కూరగాయలతో ఏదైనా పొలంలోకి వచ్చామా అని సంభ్రమాశ్చర్యాలకు లోనైపోతారు. ఇంటికి కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు, పూలు ఏవీ బయట కొనుగోలు చేసే అవసరమేలేకుండా మిద్దెపైనే పండిస్తున్నారు. పర్యావరణంపై ఉన్న ప్రేమతో మేడపై సేంద్రీయ వనాన్ని పెంచుతున్న విశాఖ నగరానికి చెందిన పద్మావతి. టెర్రస్ల పైన సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఔషధ, పూల మొక్కలను మక్కువతో పెంచుతూ.. కాంక్రీటు జంగిల్లో కూడా నిండు పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్న ఇంటిపంటల సాగుదారుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం నగరంలోనే ఎక్కువగా ఉన్నారు. ఈ జాబితాలో ఒకరు రాంభక్త పద్మావతి. విశాఖ నగరంలోని రామ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న పద్మావతి, ఆర్ కె ప్రసాద్ దంపతుల ఇల్లు పచ్చని చెట్లతో నిండి కళకళలాడుతూ ఉంటుంది. ఎమ్మే బీఈడీ, ఎంసీఏ చదివిన పద్మావతికి ఉద్యోగం, సంపాదనపై కన్నా పర్యావరణంపైన, సేంద్రియ ఆహారంపైనే మక్కువ. రచయిత్రిగా సాహితీ రంగంలోనూ రాణిస్తున్న ఆమెకు బాల్యం నుంచే మొక్కల పెంపకంపై అమితాసక్తి. ఆమె అభిరుచికి అనుగుణంగా భర్త ప్రసాద్ కాంట్రాక్టర్ కావడంతో మూడో అంతస్థుపైన టెర్రస్‌ను మొక్కల పెంపకానికి అనువుగా సిమెంటు తొట్లు నిర్మించారు. సిమెంట్, ప్లాస్టిక్, మట్టి కుండీల్లోనూ మొక్కలు పెంచుతూ మేడనే ఓ వనంగా మార్చేశారు. కాలుష్య రహితమైన సౌర విద్యుత్తును ఒడిసిపట్టుకోవడానికి కొన్ని సౌర ఫలకాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్లుగా ఎప్పుడో మరీ అవసరమైనప్పుడు తప్ప కూరగాయలను బయట కొనలేదని పద్మావతి తెలిపారు. మునగ, వంగ తదితర కూరగాయలతో పాటు అరటి, నిమ్మ తదితర పండ్ల మొక్కలనూ సాగు చేస్తున్నారు. వంట గదిలో రెండు కుండీల్లో పుదీనా, కొత్తిమీర పెంచుతున్నారు. టెర్రస్‌పైన, పెంట్ హౌస్ ముందు తోటకూర, గోంగూర, బచ్చలి, పాలకూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడలు, మెంతికూర, మొదలైన ఆకుకూరలను సాగు చేస్తున్నారు. వంకాయ, టమాటా, చిక్కుడు, బీర, దోస, సొర, మిరపకాయలు, అల్లం మొదలైన కూరగాయలు పండిస్తున్నారు. ఇంటికి సమీపంలో పశువులు పెంచుతున్న వారి వద్ద నుంచి గోమూత్రం, ఆవు పేడను కొనుగోలు చేసి ఎరువుగా వినియోగిస్తున్నారు. చీడపీడల నివారణకు వేపనూనె, గోమూత్రం, వేపాకు పొడి తదితరాలను నీటిలో కలిపి పద్మావతి పిచికారీ చేస్తున్నారు. ఏపుగా పెరిగిన అరటి గెలలు, మునగ చెట్లు వారి ఇంటిపై పచ్చదనానికి కొండగుర్తుగా దూరం నుంచి కూడా కనిపిస్తుంటాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే..! ‘నగరంలో పచ్చదనం పూర్తిగా తగ్గిపోయింది. నాకు బాధేసింది. అందుకే.. మా ఇంటి వరకూ పర్యావరణం కోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచనతోనే మొక్కల పెంపకం ప్రారంభించాను. కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించడంతో ఆకుకూరలు, కూరగాయలతోపాటు ఇలా ప్రతి మొక్కను పెంచసాగాను. మేడపై విస్తారంగా పచ్చదనం పరచుకోవడంతో వేసవిలోనూ ఇల్లు చల్లగా ఉంటోంది. మొక్కలు చూసి మా ఇంటి అడ్రస్ కూడా సులభంగా గుర్తుపడుతున్నారు. – రాంభక్త పద్మావతి, రామ్‌నగర్, విశాఖపట్నం – కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి, విశాఖ సిటీ -
ఆర్గానిక్ పండ్లేనా?
ప్రస్తుతం మనం తింటున్న పండ్లు, కూరగాయలు చాలావరకు రసాయనిక ఎరువులు వేసి పండించినవే. అయితే ఇటీవలి కాలంలో ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతో... ఎక్కువ ధరతో పండ్లు, కూరగాయలు మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ అవి 100 శాతం ఆర్గానిక్ ఫుడ్స్ అని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, చూడగానే అవి ఆర్గానిక్ ఫుడ్స్ కావని గుర్తుపట్టలేం. అంతెందుకు రుచి చూసినా చెప్పలేం. మరేంటి దారి అనుకుంటున్నారా? ఇదిగో ఫొటోలో కనిపిస్తున్న ‘ఆర్గానిక్ సెన్సర్’. ఇది మీ పండ్లు, కూరగాయలు ఆర్గానిక్వో, కావో సులువుగా చెప్పేస్తుంది. ఉదాహరణకు ఒక యాపిల్ పండుపై ఈ పరికరాన్ని పెడితే.. అందులో నైట్రేట్స్ (ఫర్టిలైజర్స్‌లో వాడేవి) ఉన్నాయో లేవో మీ ఫోన్లో చూపిస్తుంది. చాలా సింపుల్‌గా ఉంది కదూ.. మరి ఇంకేం ఆర్గానిక్ పండ్లు, కూరగాయలనే తిని ఆరోగ్యంగా ఉండండి.