మిల్లెట్ దోశ ,రాగి ఇడ్లీ
నగరవాసికి ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. ఆర్గానిక్ ఫుడ్‌పై ఆసక్తి ఎక్కువవుతోంది. రసాయనాలతో పండించిన ఆహార పదార్థాల కారణంగా కేన్సర్, కాళ్లు, కీళ్ల, నొప్పులు, ఊబకాయం, శ్వాసకోశ ఇబ్బందులు, మధుమేహం వంటి వ్యాధులు దాడి చేస్తుండటంతో.. సిటీజనులు రసాయన ఎరువులు లేకుండా పండించిన సేంద్రియ ఆహార పదార్థాల (ఆర్గానిక్ ఫుడ్) వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో ఆయా ఉత్పత్తులవిక్రయ దుకాణాలు పలుచోట్ల వెలుస్తున్నాయి. దీంతో పాటు మరో అడుగు ముందుకేసి వాటితో నేరుగా ఆహారాన్ని తయారు చేసి వడ్డించే హోటళ్లు కూడా దర్శనమిస్తున్నాయి. వీటికి భారీగా
ఆదరణ ఉంటున్నట్లు ఆయా హోటళ్ల నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారంటే ఆర్గానిక్ ఫుడ్‌పై నగరజీవులు ఎంతటి ఆసక్తి కనబరుస్తున్నారో అవగతమవుతోంది.
హైదరాబాద్: రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్‌లో ఇటీవల సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది వీటికి ప్రాధాన్యమిస్తుడటంతో విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. క్షణం తీరికలేని నగరవాసులు ఇంటికి తీసుకెళ్లి ఉత్పత్తులను వండుకుని తినేందుకు కుదరక ఇబ్బందులు పడుతున్నారు. వీరి కోసమే ఇప్పుడు నగరంలో కొత్తగా సేంద్రియ (ఆర్గానిక్) వంటకాలను తయారు చేసి వడ్డించే కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో బంజారాహిల్స్‌లోని ఎమరాల్డ్ వారి సేంద్రియ ఆహార కేంద్రం అహోబిలం మిల్లెట్ కేవ్, ఆర్గానిక్ మాస్తి రెస్టారెంట్, జీవతి సేంద్రియ ఆహార కేంద్రం, మంత్ర సేంద్రియ ఆహార కేంద్రం, విలేజ్ ఆహారం, శ్రీనివాస స్వగృహపూడ్స్ వంటి హోటళ్లు, రెస్టారెంట్లు పెరుగుతున్నాయి.
ఆనాటి రుచులు అందేలా...
పెరుగుతున్న పాశ్చాత్య పోకడలతో రసాయన మిళిత భోజనాలకు ప్రజలు అలవాటుపడిన నేపథ్యంలో.. కమ్మటి పల్లె రుచులను అందించేందుకు ప్రత్యేక హోటళ్లు నగరంలోని బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, పంజగుట్ట, మెహిదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. స్వచ్ఛమైన సేంద్రియ వంటకాలు, పూర్వకాలపు వడ్డన పద్ధతులు.. వెరసీ తిన్న వారి చేత ఆహా అనిపించేలా చేస్తున్నాయి. ఇక్కడ వండే ప్రతి వంటకమూ ప్రత్యేకమే. మామూలుగా మార్కెట్లలో దొరికే పదార్థాలను ఇక్కడ ఉపయోగించరు. చివరకు రుచిని కలిగించే ఉప్పుకు బదులు సైంథవ లవణాన్ని వాడుతున్నారు. ఆధునికత అంటూ అనారోగ్యం వైపు పరుగుపెడుతున్న నేటి తరానికి వందేళ్ల నాటి కమ్మని రుచులను ఉందిస్తున్నారు.
రైతులే సంఘాలుగా..
ప్రస్తుతం పండించే భూముల్లో ఒక్కరోజులోనే సేంద్రియ వ్యవసాయం చేసే అవకాశం లేదు. రసాయనాలతో నిండిపోయిన భూసారం సాధారణ స్థితికి రావాలంటే 3 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం ఇలా దీర్ఘకాలంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి కొందరు సంఘాలుగా ఏర్పడ్డారు. సేంద్రియ హోటళ్ల నిర్వాహకులు తాము వినియోగించే ఉత్పత్తుల్లో 70 శాతం వరకు స్వయంగా పండించుకుంటున్నారు. మిగతా వాటిని ఆర్గానిక్ ఉత్పత్తులను అందించే సంఘాల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో శాకాహారం, పల్లె వాతావరణంలో పెంచిన నాటుకోళ్లు, స్వచ్ఛమైన నీటిలో పెరిగిన చేపలతో మాంసాహారం తయారు చేస్తున్నారు. చిక్కని పాలతో చేసిన గడ్డ పెరుగు ఇక్కడ దొరుకుతోంది. అది కూడా మట్టిపాత్రల్లో తోడు పెడతారు. అంతే కాదు దేశీయ ఆవు పాలును ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇవి బయట దొరికే ఆహార పదార్థాల కంటే 20– 30 శాతం అధిక ధరలున్నా డిమాండ్ బాగానే ఉంది.
సేంద్రియ ఉత్పత్తులపై ఆసక్తితోనే.. నేను ఈ హోటల్ పెట్టడానికి ప్రధాన కారణంపంటలపై ఆసక్తి ఉన్న రైతులను ప్రోత్సహించేందుకు, సంప్రదాయ వంటకాలు వండి ప్రజలకు అందించటానికి మా వంతు కృషి చేస్తున్నాం. పాత కాలపు నల్లటి బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. రసాయ రహిత ఉత్పత్తులతో వంటకాలు చేస్తున్నాం. విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ క్షేత్రాల్లో పంటలు పండిస్తున్నాం. దేశీయ ఆవు పాలు, రాగి ఇడ్లీ, మిల్లెట్ దోశ, కాలాభట్ రైస్ మా ప్రత్యేకత. ప్రస్తుతంవినియోగదారుల రాక పెరిగింది. – విజయరామ్, ఎమరాల్డ్ యజమాని. బంజారాహిల్స్
Comments
Please login to add a commentAdd a comment