Orient Cement Company
-
అదానీ చేతికి ఓరియంట్ సిమెంట్
న్యూఢిల్లీ: సిమెంట్ పరిశ్రమలో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా అదానీ గ్రూప్ కొనుగోళ్ల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా సీకే బిర్లా గ్రూప్‌లో భాగమైన ఓరియంట్ సిమెంట్ (ఓసీఎల్) కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. డీల్ విలువ సుమారు రూ. 8,100 కోట్లుగా ఉండనుంది. కంపెనీ ప్రకటన ప్రకారం అదానీ గ్రూప్‌లో భాగమైన అంబుజా సిమెంట్స్ సంస్థ... ఓరియంట్ సిమెంట్‌లో 46.8 శాతం వాటాలను చైర్మన్ సీకే బిర్లాతో పాటు నిర్దిష్ట పబ్లిక్ షేర్‌హోల్డర్ల నుంచి రూ.3,791 కోట్లకు కొనుగోలు చేయనుంది.దీంతో మరో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి ఉంది. ఒక్కో ఓసీఎల్ షేరుకు రూ. 395.40 రేటు చొప్పున చెల్లించనున్నట్లు, ఈ కొనుగోలుతో తమ మార్కెట్ వాటా రెండు శాతం మేర పెరగనున్నట్లు అంబుజా సిమెంట్స్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ‘ఓసీఎల్ కొనుగోలుతో అంబుజా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తుంది. కీలక మార్కెట్లలో విస్తరించడానికి, మార్కెట్ వాటాను 2% మేర పెంచుకోవడానికి ఈ డీల్ తోడ్పడుతుంది‘ అని అంబుజా సిమెంట్స్ డైరెక్టర్ కరణ్ అదానీ తెలిపారు. టెక్నాలజీ, సరీ్వస్ ఆధారిత వ్యాపారాలపై మరింత ఇన్వెస్ట్ చేసే క్రమంలో విక్రయ నిర్ణయం తీసుకున్నట్లు ఓరియంట్ సిమెంట్ చైర్మన్ సీకే బిర్లా తెలిపారు.అదనంగా మరో 8.5 మిలియన్ టన్నుల సామర్థ్యం .. ఓరియంట్ సిమెంట్‌కు పశ్చిమంలో ఒకటి, దక్షిణాదిలో ఒకటి చొప్పున మొత్తం 2 సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం 8.5 మిలియన్ టన్నులు. అలాగే, మరో 8.1 మిలియన్ టన్నుల ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో అత్యంత నాణ్యమైన సున్నపు రాయి గని ఈ సంస్థ సొంతం. ఓసీఎల్ కొనుగోలుతో అంబుజా సామర్థ్యం 97.4 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. -
ఓరియంట్ సిమెంట్‌ను కొనబోతున్న అదానీ!
సిమెంటు రంగంలో అగ్రగామి సంస్థగా ఎదిగేందుకు అదానీ గ్రూప్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల పలు కంపెనీలను సొంతం చేసుకుంది. అదే జోరులో..ఓరియంట్ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఓరియంట్ సిమెంట్ ప్రమోటరు సి.కె.బిర్లా కంపెనీలో తన వాటా అమ్మేందుకు అదానీ గ్రూపు ఛైర్మన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అంబుజా, సంఘీ, ఏసీసీ వంటి ప్రధాన సిమెంటు కంపెనీలను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఓరియంట్ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమైతే అదానీ గ్రూపునకు ప్రయోజనం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఏసీసీ కార్యకలాపాలకు ఓరియంట్ సిమెంట్ ప్లాంట్లు ఉపయోగపడతాయని అంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఓరియంట్ సిమెంట్స్ లిమిటెడ్ స్టాక్ కొన్ని రోజులుగా పాజిటివ్‌లో ట్రేడవుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకు చాలా సిమెంట్ అవసరం అవుతుంది. రోడ్లు, రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు, ఇళ్లను వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత సిమెంట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం మనదే. కానీ సిమెంట్ తలసరి వినియోగం చైనాలో 1,600 కిలోగ్రాములు, భారత్ 250 కిలోగ్రాములుగా ఉంది. -
ఎల్అండ్టీ డౌన్- ఓరియంట్ ఎలక్ట్రిక్ అప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. అయితే ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో హోమ్ అప్లయెన్సెస్ కంపెనీ ఓరియంట్ ఎలక్ట్రిక్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. గత 8 రోజులుగా బలపడుతూ రావడంతో ఎల్అండ్టీ కౌంటర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారని.. దీంతో ఈ షేరు బలహీనపడిందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. మరోపక్క ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఓరియంట్ ఎలక్ట్రిక్ కౌంటర్ లాభాలతో ట్రేడవుతోంది. వివరాలు చూద్దాం.. ఎల్అండ్టీ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎల్అండ్టీ నికర లాభం 45 శాతం క్షీణించి రూ. 1,410 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 12 శాతం నీరసించి రూ. 31,035 కోట్లను తాకింది. ఈ కాలంలో మొత్తం రూ. 28,039 కోట్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఇవి వార్షిక ప్రాతిపదికన 42 శాతం తక్కువకాగా.. క్యూ1తో పోల్చితే 19 శాతం అధికమని వివరించింది. ఈ కాలంలో ఎలక్ట్రికల్ ఆటోమేషన్ బిజినెస్‌ను ఫ్రాన్స్‌కు చెందిన ష్నీడర్ ఎలక్ట్రిక్‌కు విక్రయించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు నవంబర్ 5 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5.4 శాతం పతనమై రూ. 930 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 926కు నీరసించింది. ఓరియంట్ ఎలక్ట్రిక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఓరియంట్ ఎలక్ట్రిక్ నికర లాభం ఏడు రెట్లు ఎగసి రూ. 32 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మాత్రం యథాతథంగా రూ. 434 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 8.3 శాతం బలపడి 13.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో ఓరియంట్ ఎలక్ట్రిక్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3.6 శాతం లాభపడి రూ. 209 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం జంప్‌చేసి రూ. 221 సమీపానికి చేరింది. -
ప్రభుత్వ విధానాలతోనే భారీ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: కొత్త పరిశ్రమల కోసం పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉన్న పరిశ్రమలకు మరింత సహకరించడం, మూతపడిన వాటిని తెరిపించడం చేస్తూ.. బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. సిర్పూర్ పేపర్ మిల్లును తిరిగి తెరిపించడంలో విజయం సాధించామని.. ఇప్పుడు ఓరియంట్ సిమెంట్స్ విస్తరణకు బిర్లా గ్రూప్‌తో ఒప్పందం కుదరడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్, సీకె బిర్లా సమక్షంలో ఓరియంట్ సిమెంట్ విస్తరణపై తెలంగాణ ప్రభుత్వంతో సీకే బిర్లా గ్రూప్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా జరిగిన అవగాహన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఓరియంట్ సిమెంట్స్ విస్తరణ ద్వారా రూ.రెండు వేల కోట్ల నూతన పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయని అన్నారు. దీనిద్వారా సుమారు నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా, మరో ఎనిమిది వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పారు. కంపెనీలో స్థానిక యువకులకే ఉద్యోగావకాశాలు దక్కేలా చూడాలని కోరామని, అవసరమైతే ఇందుకోసం ఒక శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సీకే బిర్లా విస్తరణ ప్రకటన ద్వారా పారిశ్రామిక వర్గాల్లో తెలంగాణపై మరింత విశ్వాసం పెరుగుతుందని, మరిన్ని నూతన పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరామన్నారు. బిర్లాకు అభివృద్ధి కార్యక్రమాల వివరణ తెలంగాణలో గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని, వివిధ ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను సీకే బిర్లాకు మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే ప్రాథమిక సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన తాగునీటి కోసం మిషన్ భగీరథ, సాగునీటి కోసం నూతన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. కరెంటు సంక్షోభం వస్తుందనే స్థాయి నుంచి నిరంతరం సరఫరా చేసే దశకు చేరుకున్నామని చెప్పారు. ప్రభుత్వ పారదర్శక విధానాలను పరిగణనలోకి తీసుకున్న అనేక కంపెనీలు ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తోపాటు టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాశ్‌రెడ్డి, ఎండీ మల్సూర్ తదితరులు పాల్గొన్నారు. బిర్లా గ్రూప్ విస్తరణ ప్రకటన ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ తన భారీ విస్తరణ ప్రణాళికలను సోమవారం ప్రకటించింది. మంచిర్యాలలోని దేవాపూర్‌లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని సుమారు రూ.రెండు వేల కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నట్లు తెలిపింది. కంపెనీ తుది అనుమతులు పొందే ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని, త్వరలోనే అన్ని అనుమతులు కేంద్రం నుంచి లభిస్తాయని ఎంవోయూ అవగాహన సమావేశంలో గ్రూపు చైర్మన్ సీకే బిర్లా తెలిపారు. త్వరలోనే విస్తరణ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణంపై ఆయన ప్రశంసలు కురిపించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ అనేక వినూత్న విధానాలతో పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. పారిశ్రామిక వర్గాల్లో మంచిపేరు సంపాదించుకుందని పేర్కొన్నారు. -
ఓరియంట్లో లోడింగ్ కార్మికుల సమ్మె
కాసిపేట : ఏడాదిన్నరగా వారసత్వ ఉద్యోగాలను పెండింగ్‌లో ఉంచడాన్ని నిరసిస్తూ మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపనీలో లోడింగ్ కార్మికులు మంగళవారం సమ్మెకు దిగారు. కార్మిక సంఘాలతో సోమవారం తుదిచర్చలు అని చెప్పిన యాజమాన్యం ఎలాంటి కారణం లేకుండా చర్చలను నిలిపివేసింది. దీంతో ఆగ్రహించిన లోడింగ్ కార్మికులు మంగళవారం మొదటిషిప్టు నుంచి సమ్మెలోకి దిగారు. కంపనికి ప్రధానమైన డిపార్టుమెంటు లోడింగ్ కావడంతో ఎటువంటి ఉత్పత్తి బయటకు వెళ్లలేదు. ఈవిషయమై ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉన్న పర్మినెంటు కార్మికులు సైతం నేటి నుంచి సమ్మెలోకి దిగేందుకు తీర్మానించారు. నేడో, రేపో కాంట్రాక్టు కార్మికులు సైతం సమ్మెలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నడూ లేనివిధంగా అన్నివర్గాల కార్మికులు సమ్మెకు సిద్ధపడద్ధిది తొలిసారి. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే దానిని సాకుగా చూపుతూ ఓరియంట్ డ్రామాలు ఆడుతుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన గిరిజనులకు న్యాయం చేయాలని, నష్టపరిహరం అందించాలని, ఉద్యోగాలు కల్ఫించాలని, రీసర్వే చేయాలని కోర్టు తీర్పులను పట్టుకోని వచ్చిన ఆదివాసీలను గెంటివేశారు. అప్పుడు కోర్టు తీర్పు అమలు గుర్తుకు రాలేదా అని, వారసత్వాలను హరిస్తే ఊరుకునేది లేదని కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. -
ఓరియంట్ సిమెంట్ చేతికి రెండు జేపీ యూనిట్లు
♦ బీజేసీఎల్లో 74 శాతం వాటా ♦ నైగ్రి గ్రైండింగ్ యూనిట్ కొనుగోలు ♦ డీల్స్ విలువ రూ.1,950 కోట్లు న్యూఢిల్లీ: సీకే బిర్లా గ్రూప్‌కు చెందిన ఓరియంట్ సిమెంట్ కంపెనీ జేపీ గ్రూప్‌కు చెందిన రెండు సిమెంట్ యూనిట్లను రూ.1,950 కోట్లకు కొనుగోలు చేయనున్నది. భిలాయ్ జేపీ సిమెంట్ లిమిటెడ్(బీజేసీఎల్)లో 74 శాతం వాటాను, మధ్యప్రదేశ్‌లోని నైగ్రి సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను కొనుగోలు చేయడానికి తమ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఓరియంట్ సిమెంట్ కంపెనీ పేర్కొంది. బీజేసీఎల్ వాటాను జైప్రకాశ్ అసోసియేట్స్ నుంచి రూ.1,450 కోట్లకు, నైగ్రి సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను జైప్రకాశ్ పవర్ వెంచర్స్ నుంచి రూ.500 కోట్లకు కొనుగోలు చేయనున్నామని కంపెనీ చైర్మన్ సి. కె. బిర్లా చెప్పారు. అంతా నగదు రూపంలోనే ఈ కొనుగోళ్లు జరపనున్నామని వివరించారు. 2020 కల్లా 15 మి. టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఈ యూనిట్ల కొనుగోళ్లతో తమ కంపెనీ సిమెంట్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 8 మిలియన్ టన్నుల నుంచి 10.2 మిలియన్ టన్నులకు పెరుగుతుందని, అత్యధిక వృద్ధి ఉన్న మధ్య, తూర్పు భారత ప్రాంతాల్లో ప్రవేశిస్తామని బిర్లా చెప్పారు. 2020 కల్లా 15 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సాధించే లక్ష్యంలో భాగంగా ఈ కొనుగోళ్లు చేస్తున్నామని పేర్కొన్నారు. బీజేసీఎల్కు ఉన్న సున్నపురాయి నిల్వలను, ముడి పదార్ధాలను వినియోగించుకోగలిగే ప్రయోజనం కూడా తమకు లభిస్తుందని చెప్పారు. ఓరియంట్ పేపర్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి విడివడి ఓరియంట్ సిమెంట్ కంపెనీ పూర్తి స్థాయి సిమెంట్ కంపెనీగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని, గత ఏడాది గుల్బర్గాలో కొత్త సిమెంట్ ప్లాంట్‌ను ప్రారంభించామని వివరించారు. ఈ డీల్స్‌కు మొయిలిస్ అండ్ కంపెనీ ఆర్థిక సలహాదారుగా, సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీకి తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకల్లో మూడు ప్లాంట్లున్నాయి. కాగా ఈ డీల్స్ నేపథ్యంలో బీఎస్ఈలో ఓరియంట్ సిమెంట్ షేర్ ధర ట్రేడింగ్ ప్రారంభంలోనే ఏడాది గరిష్ట స్థాయి, రూ.241ను తాకింది. చివరకు 0.6 శాతం నష్టంతో రూ.222 వద్ద ముగిసింది.