ఓరియంట్ సిమెంట్ చేతికి రెండు జేపీ యూనిట్లు
♦ బీజేసీఎల్‌లో 74 శాతం వాటా
♦ నైగ్రి గ్రైండింగ్ యూనిట్ కొనుగోలు
♦ డీల్స్ విలువ రూ.1,950 కోట్లు
న్యూఢిల్లీ: సీకే బిర్లా గ్రూప్‌కు చెందిన ఓరియంట్ సిమెంట్ కంపెనీ జేపీ గ్రూప్‌కు చెందిన రెండు సిమెంట్ యూనిట్లను రూ.1,950 కోట్లకు కొనుగోలు చేయనున్నది. భిలాయ్ జేపీ సిమెంట్ లిమిటెడ్(బీజేసీఎల్)లో 74 శాతం వాటాను, మధ్యప్రదేశ్‌లోని నైగ్రి సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను కొనుగోలు చేయడానికి తమ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఓరియంట్ సిమెంట్ కంపెనీ పేర్కొంది. బీజేసీఎల్ వాటాను జైప్రకాశ్ అసోసియేట్స్ నుంచి రూ.1,450 కోట్లకు, నైగ్రి సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను జైప్రకాశ్ పవర్ వెంచర్స్ నుంచి రూ.500 కోట్లకు కొనుగోలు చేయనున్నామని కంపెనీ చైర్మన్ సి. కె. బిర్లా చెప్పారు. అంతా నగదు రూపంలోనే ఈ కొనుగోళ్లు జరపనున్నామని వివరించారు.
2020 కల్లా 15 మి. టన్నుల ఉత్పత్తి లక్ష్యం
ఈ యూనిట్ల కొనుగోళ్లతో తమ కంపెనీ సిమెంట్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 8 మిలియన్ టన్నుల నుంచి 10.2 మిలియన్ టన్నులకు పెరుగుతుందని, అత్యధిక వృద్ధి ఉన్న మధ్య, తూర్పు భారత ప్రాంతాల్లో ప్రవేశిస్తామని బిర్లా చెప్పారు. 2020 కల్లా 15 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సాధించే లక్ష్యంలో భాగంగా ఈ కొనుగోళ్లు చేస్తున్నామని పేర్కొన్నారు. బీజేసీఎల్‌కు ఉన్న సున్నపురాయి నిల్వలను, ముడి పదార్ధాలను వినియోగించుకోగలిగే ప్రయోజనం కూడా తమకు లభిస్తుందని చెప్పారు. ఓరియంట్ పేపర్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి విడివడి ఓరియంట్ సిమెంట్ కంపెనీ పూర్తి స్థాయి సిమెంట్ కంపెనీగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని, గత ఏడాది గుల్బర్గాలో కొత్త సిమెంట్ ప్లాంట్‌ను ప్రారంభించామని వివరించారు.
ఈ డీల్స్‌కు మొయిలిస్ అండ్ కంపెనీ ఆర్థిక సలహాదారుగా, సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీకి తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకల్లో మూడు ప్లాంట్లున్నాయి. కాగా ఈ డీల్స్ నేపథ్యంలో బీఎస్‌ఈలో ఓరియంట్ సిమెంట్ షేర్ ధర ట్రేడింగ్ ప్రారంభంలోనే ఏడాది గరిష్ట స్థాయి, రూ.241ను తాకింది. చివరకు 0.6 శాతం నష్టంతో రూ.222 వద్ద ముగిసింది.