Jaypee Group
-
జేపీ అసోసియేట్స్ రూ. 4,258 కోట్ల డిఫాల్ట్
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న జేపీ గ్రూప్‌లో ప్రధాన కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ (జేఏఎల్) రూ. 4,258 కోట్ల రుణాల (అసలు, వడ్డీ) చెల్లింపులో డిఫాల్ట్ అయ్యింది. అసలు కింద రూ. 1,733 కోట్లు, వడ్డీ కింద రూ. 2,525 కోట్ల మొత్తాన్ని అక్టోబర్ 31న చెల్లించాల్సి ఉండగా, చెల్లించలేకపోయినట్లు నియంత్రణ సంస్థకు తెలియజేసింది. నిర్వహణ మూలధనం, టర్మ్ లోన్లు, విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ రూపంలో ఈ మొత్తాన్ని కంపెనీ సేకరించింది. 2037 కల్లా రూ. 29,272 కోట్ల రుణాలు (వడ్డీ సహా) చెల్లించాల్సి ఉండగా, 2023 అక్టోబర్ 31 నాటికి రూ. 4,258 కోట్లను గడువులోగా చెల్లించలేకపోవడంతో బాకీ పడినట్లు సంస్థ వివరించింది. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా రూ. 18,682 కోట్ల మొత్తాన్ని ప్రతిపాదిత స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)కి బదలాయించనుండటంతో ఆ మేరకు భారం తగ్గనుంది. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జేఏఎల్ పేర్కొంది. -
జేపీ అసోసియేట్స్ రూ. 4 వేల కోట్లు డిఫాల్ట్
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న జేపీ గ్రూప్ సంస్థ జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్) తాజాగా రూ. 3,956 కోట్ల రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయ్యింది. ఇందులో అసలు రూ. 1,642 కోట్లు ఉండగా, వడ్డీ రూ. 2,314 కోట్లు ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వివిధ రూపాల్లో తీసుకున్న ఈ మొత్తాన్ని ఏప్రిల్ 30న చెల్లించాల్సి ఉన్నప్పటికీ విఫలమైనట్లు ఎక్సే్చంజీలకు తెలిపింది. తాము 2037 నాటికి రూ.29,277 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇందులో రూ. 3,956 కోట్లు మాత్రమే ఈ ఏడాది ఏప్రిల్ 30 కల్లా కట్టాల్సి ఉందని జేఏఎల్ వివరించింది. -
మళ్లీ డిఫాల్ట్.. రూ.4,161 కోట్ల చెల్లింపుల్లో విఫలమైన జేపీ అసోసియేట్స్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జేపీ గ్రూప్ కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్(జేఏఎల్) తాజాగా రూ. 4,161 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైంది. దీనిలో అసలు, వడ్డీ కలసి ఉన్నాయి. మార్చి31న రూ. 1,653 కోట్ల అసలు, రూ. 2,508 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కంపెనీ నియంత్రణ సంస్థలకు వెల్లడించింది. ఈ రుణాలు వివిధ బ్యాంకులకు చెందినవని తెలియజేసింది. వడ్డీసహా కంపెనీకున్న మొత్తం రుణ భారం రూ. 29,396 కోట్లుకాగా.. 2037కల్లా తిరిగి చెల్లించవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. వీటిలో రూ. 4,161 కోట్లు 2023 మార్చి31కల్లా చెల్లించవలసి ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రతిపాదిత ఎస్పీవీ పథకాన్ని వాటాదారులంతా ఆమోదించారని, ఎన్సీఎల్టీ అనుమతించవలసి ఉన్నదని తెలియజేసింది. ఇదీ చదవండి: బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు దీంతో ఎస్పీవీకి బదిలీ తదుపరి రూ. 18,051 కోట్లమేర రుణాలు తగ్గనున్నట్లు వివరించింది. కాగా.. జేఏఎల్‌కు వ్యతిరేకంగా 2018 సెప్టెంబర్‌లో ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. 2022 సెప్టెంబర్‌లో రూ. 6,893 కోట్ల చెల్లింపుల్లో వైఫల్యంపై పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ సైతం జేఏఎల్‌పై ఎన్సీఎల్టీ వద్ద ఫిర్యాదు చేసింది. కాగా.. ఇటీవల జేఏఎల్, గ్రూప్ సంస్థలు దాల్మియా భారత్‌కు మిగిలిన సిమెంట్ ఆస్తుల విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. డీల్ విలువ రూ. 5,666 కోట్లుకాగా.. రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా అంతక్రితం కంపెనీ 20 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ సామర్థ్యాలను ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్నకు 2014–2017 మధ్య విక్రయించింది. ఇదీ చదవండి: లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి -
దాల్మియా డీల్: సిమెంట్ బిజినెస్ నుంచి ‘జేపీ’ ఔట్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ జైప్రకాష్ అసోసియేట్స్(జేఏఎల్), సహచర సంస్థ నుంచి సిమెంట్, సంబంధ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు దాల్మియా భారత్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 5,666 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువ ప్రకారం తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. పూర్తి అనుబంధ సంస్థ దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్(డీసీబీఎల్) ద్వారా క్లింకర్, సిమెంట్, పవర్ ప్లాంట్ల కొనుగోలుకి జేపీ గ్రూప్ సంస్థలతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా 9.4 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల(ఎంటీపీఏ) సిమెంట్ ప్లాంట్లతోపాటు.. 6.7 ఎంటీపీఏ క్లింకర్, 280 మెగావాట్ల థర్మల్ విద్యుత్ యూనిట్లను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. ఈ ఆస్తులు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో విస్తరించి ఉన్నట్లు దాల్మియా పేర్కొంది. ఈ కొనుగోలుతో మధ్యభారతంలోనూ కార్యకలాపాలు విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇదే సమయంలో తమ వద్ద మిగిలిన సిమెంట్ ఆస్తులను విక్రయించడం ద్వారా సిమెంట్ బిజినెస్ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు జేపీ గ్రూప్ వెల్లడించింది. ఇందుకు దాల్మియా భారత్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. రుణ భారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది. విస్తరణ లక్ష్యంతో..: 2027కల్లా దేశవ్యాప్త సిమెంట్ కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంలో భాగంగా జేపీ ఆస్తుల కొనుగోలుతో దాల్మియా భారత్ ముందడుగు వేసింది. 2027కల్లా 75 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని అందుకోవాలని ఆశిస్తోంది. ఈ బాటలో 2031కల్లా 110-130 ఎంఎన్టీకి చేరాలని ప్రణాళికలు వేసింది. జేపీ ఆస్తుల కొనుగోలు ద్వారా దాల్మియా భారత్ సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 45.3 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్రస్తుత సామర్థ్యం 35.9 ఎంటీపీఏగా ఉంది. సిమెంట్ తయారీకి దాల్మియా ప్రస్తుతం దేశంలో నాలుగో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. అల్ట్రాటెక్, అదానీ సిమెంట్(ఇటీవలే ఏసీసీ, అంబుజాలను సొంతం చేసుకుంది), శ్రీ సిమెంట్ తొలి మూడు ర్యాంకులను ఆక్రమిస్తున్నాయి. -
అల్ట్రాటెక్–జేపీ డీల్ పూర్తి
♦ ఇది అతిపెద్ద ఎన్పీఏ పరిష్కారం ♦ ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ ముంబై: జేపీ సిమెంట్స్‌ను అల్ట్రాటెక్ సిమెంటు టేకోవర్ చేయడంతో అతిపెద్ద మొండి బకాయి సమస్య పరిష్కారమయ్యిందని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. జైప్రకాష్ అసోసియేట్స్ గ్రూప్‌నకు (జేపీ గ్రూప్) ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం భారీగా రుణాలివ్వడం, ఆ రుణాల్లో అధికభాగం ఎన్పీఏలుగా మారడం తెలిసిందే. తాజా డీల్ చరిత్రాత్మకమైనదని, భవిష్యత్తులో ఇటువంటి పరిష్కారాలకు ఇది బాట వేస్తుందని, దేశంలో ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద రుణ పరిష్కారమని ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ వ్యాఖ్యానించారు. జేపీ అసోసియేట్స్‌కు, జేపీ సిమెంట్స్‌కు చెందిన సిమెంటు వ్యాపారాన్ని బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్‌కు విక్రయించే ప్రక్రియ పూర్తయినట్లు బ్యాంక్ తెలిపింది. అయితే ఈ డీల్ కారణంగా రుణదాతలైన బ్యాంకులకు ఎంత ఒనగూడుతుందో బ్యాంకు వెల్లడించలేదు. మార్కెట్ అంచనాల ప్రకారం రూ. 4,000 కోట్లు బ్యాంకులకు రావొచ్చు. ఈ విక్రయ ప్రక్రియలో కన్సార్షియం లీడ్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ కీలకపాత్ర వహించి, విజయవంతంగా పూర్తిచేసినట్లు కొచర్ వివరించారు. 9.1 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యంగల జేపీ సిమెంటు వ్యాపారాన్ని బిర్లా గ్రూప్ రూ. 16,189 కోట్లకు టేకోవర్ చేసింది. తాజా విక్రయం తర్వాత కూడా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో 1.06 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యంగల సిమెంటు వ్యాపారం ఇంకా జేపీ గ్రూప్‌వద్ద వుంటుంది. అల్ట్రాటెక్–జేపీ డీల్ పూర్తికాకపోవడంతో 2017 జనవరి–మార్చి క్వార్టర్లో ఆ రుణాలకు పలు బ్యాంకులు కేటాయింపులు చేయాల్సివచ్చింది. తాజాగా విక్రయ ప్రక్రియ పూర్తికావడంతో ఆ బ్యాంకులు ఖాతాల్లోంచి ఆ కేటాయింపుల్ని తొలగించుకునే వెసులుబాటు ఏర్పడింది. -
ఓరియంట్ సిమెంట్ చేతికి రెండు జేపీ యూనిట్లు
♦ బీజేసీఎల్లో 74 శాతం వాటా ♦ నైగ్రి గ్రైండింగ్ యూనిట్ కొనుగోలు ♦ డీల్స్ విలువ రూ.1,950 కోట్లు న్యూఢిల్లీ: సీకే బిర్లా గ్రూప్‌కు చెందిన ఓరియంట్ సిమెంట్ కంపెనీ జేపీ గ్రూప్‌కు చెందిన రెండు సిమెంట్ యూనిట్లను రూ.1,950 కోట్లకు కొనుగోలు చేయనున్నది. భిలాయ్ జేపీ సిమెంట్ లిమిటెడ్(బీజేసీఎల్)లో 74 శాతం వాటాను, మధ్యప్రదేశ్‌లోని నైగ్రి సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను కొనుగోలు చేయడానికి తమ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఓరియంట్ సిమెంట్ కంపెనీ పేర్కొంది. బీజేసీఎల్ వాటాను జైప్రకాశ్ అసోసియేట్స్ నుంచి రూ.1,450 కోట్లకు, నైగ్రి సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను జైప్రకాశ్ పవర్ వెంచర్స్ నుంచి రూ.500 కోట్లకు కొనుగోలు చేయనున్నామని కంపెనీ చైర్మన్ సి. కె. బిర్లా చెప్పారు. అంతా నగదు రూపంలోనే ఈ కొనుగోళ్లు జరపనున్నామని వివరించారు. 2020 కల్లా 15 మి. టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఈ యూనిట్ల కొనుగోళ్లతో తమ కంపెనీ సిమెంట్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 8 మిలియన్ టన్నుల నుంచి 10.2 మిలియన్ టన్నులకు పెరుగుతుందని, అత్యధిక వృద్ధి ఉన్న మధ్య, తూర్పు భారత ప్రాంతాల్లో ప్రవేశిస్తామని బిర్లా చెప్పారు. 2020 కల్లా 15 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సాధించే లక్ష్యంలో భాగంగా ఈ కొనుగోళ్లు చేస్తున్నామని పేర్కొన్నారు. బీజేసీఎల్కు ఉన్న సున్నపురాయి నిల్వలను, ముడి పదార్ధాలను వినియోగించుకోగలిగే ప్రయోజనం కూడా తమకు లభిస్తుందని చెప్పారు. ఓరియంట్ పేపర్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి విడివడి ఓరియంట్ సిమెంట్ కంపెనీ పూర్తి స్థాయి సిమెంట్ కంపెనీగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని, గత ఏడాది గుల్బర్గాలో కొత్త సిమెంట్ ప్లాంట్‌ను ప్రారంభించామని వివరించారు. ఈ డీల్స్‌కు మొయిలిస్ అండ్ కంపెనీ ఆర్థిక సలహాదారుగా, సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీకి తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకల్లో మూడు ప్లాంట్లున్నాయి. కాగా ఈ డీల్స్ నేపథ్యంలో బీఎస్ఈలో ఓరియంట్ సిమెంట్ షేర్ ధర ట్రేడింగ్ ప్రారంభంలోనే ఏడాది గరిష్ట స్థాయి, రూ.241ను తాకింది. చివరకు 0.6 శాతం నష్టంతో రూ.222 వద్ద ముగిసింది. -
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి జేపీ బీనా పవర్ ప్లాంటు
- ఒప్పందం విలువ రూ. 3,500 కోట్లు న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తాజాగా జేపీ గ్రూప్‌నకు చెందిన బీనా థర్మల్ పవర్ ప్లాంటును కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. దీనికి ఎంత వెచ్చిస్తున్నదీ కంపెనీ నిర్దిష్టంగా వెల్లడించనప్పటికీ.. సుమారు రూ. 3,500 కోట్లు చెల్లించేందుకు సంస్థ సిద్ధమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్‌కు సంబంధించి జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 500 మెగావాట్ల సామర్థ్యం గల బీనా థర్మల్ పవర్ ప్లాంటు మధ్యప్రదేశ్‌లో ఉంది. మరోవైపు, రూ. 9,700 కోట్లతో జేపీ గ్రూప్‌కే చెందిన హిమాచల్ బాస్పా పవర్ కంపెనీ (హెచ్‌బీపీసీఎల్) కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది. హెచ్‌బీపీసీఎల్‌కి హిమాచల్ ప్రదేశ్‌లో రెండు పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ డీల్‌ను గతేడాది నవంబర్‌లో కంపెనీ ప్రకటించింది. దేశీ విద్యుత్ రంగంలో ఇది భారీ ఒప్పందం అని జేపీ గ్రూప్ చైర్మన్ మనోజ్ గౌర్ పేర్కొన్నారు. మంగళవారం బీఎస్ఈలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేరు దాదాపు 10 శాతం లాభంతో రూ. 74.25 వద్ద, జేపీవీఎల్ షేర్లు 5 శాతం పెరిగి రూ. 5.85 వద్ద ముగిశాయి.