అల్ట్రాటెక్‌–జేపీ డీల్‌ పూర్తి | India sees highest asset sales since liberalization | Sakshi
Sakshi News home page

అల్ట్రాటెక్‌–జేపీ డీల్‌ పూర్తి

Published Fri, Jun 30 2017 12:46 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

అల్ట్రాటెక్‌–జేపీ డీల్‌ పూర్తి

అల్ట్రాటెక్‌–జేపీ డీల్‌ పూర్తి

ఇది అతిపెద్ద ఎన్‌పీఏ పరిష్కారం
ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ చందా కొచర్‌


ముంబై: జేపీ సిమెంట్స్‌ను అల్ట్రాటెక్‌ సిమెంటు టేకోవర్‌ చేయడంతో అతిపెద్ద మొండి బకాయి సమస్య పరిష్కారమయ్యిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది. జైప్రకాష్‌ అసోసియేట్స్‌ గ్రూప్‌నకు (జేపీ గ్రూప్‌) ఐసీఐసీఐ బ్యాంక్‌ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం భారీగా రుణాలివ్వడం, ఆ రుణాల్లో అధికభాగం ఎన్‌పీఏలుగా మారడం తెలిసిందే. తాజా డీల్‌ చరిత్రాత్మకమైనదని, భవిష్యత్తులో ఇటువంటి పరిష్కారాలకు ఇది బాట వేస్తుందని, దేశంలో ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద రుణ పరిష్కారమని ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ చందా కొచర్‌ వ్యాఖ్యానించారు. జేపీ అసోసియేట్స్‌కు, జేపీ సిమెంట్స్‌కు చెందిన సిమెంటు వ్యాపారాన్ని బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌కు విక్రయించే ప్రక్రియ పూర్తయినట్లు బ్యాంక్‌ తెలిపింది.

అయితే ఈ డీల్‌ కారణంగా రుణదాతలైన బ్యాంకులకు ఎంత ఒనగూడుతుందో బ్యాంకు వెల్లడించలేదు. మార్కెట్‌ అంచనాల ప్రకారం రూ. 4,000 కోట్లు బ్యాంకులకు రావొచ్చు. ఈ విక్రయ ప్రక్రియలో కన్సార్షియం లీడ్‌ బ్యాంక్‌ అయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ కీలకపాత్ర వహించి, విజయవంతంగా పూర్తిచేసినట్లు కొచర్‌ వివరించారు. 9.1 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యంగల జేపీ సిమెంటు వ్యాపారాన్ని బిర్లా గ్రూప్‌ రూ. 16,189 కోట్లకు టేకోవర్‌ చేసింది. తాజా విక్రయం తర్వాత కూడా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో 1.06 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యంగల సిమెంటు వ్యాపారం ఇంకా జేపీ గ్రూప్‌వద్ద వుంటుంది. అల్ట్రాటెక్‌–జేపీ డీల్‌ పూర్తికాకపోవడంతో 2017 జనవరి–మార్చి క్వార్టర్లో ఆ రుణాలకు పలు బ్యాంకులు కేటాయింపులు చేయాల్సివచ్చింది. తాజాగా విక్రయ ప్రక్రియ పూర్తికావడంతో ఆ బ్యాంకులు ఖాతాల్లోంచి ఆ కేటాయింపుల్ని తొలగించుకునే వెసులుబాటు ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement