న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ జైప్రకాష్ అసోసియేట్స్(జేఏఎల్), సహచర సంస్థ నుంచి సిమెంట్, సంబంధ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు దాల్మియా భారత్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 5,666 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువ ప్రకారం తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. పూర్తి అనుబంధ సంస్థ దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్(డీసీబీఎల్) ద్వారా క్లింకర్, సిమెంట్, పవర్ ప్లాంట్ల కొనుగోలుకి జేపీ గ్రూప్ సంస్థలతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలియజేసింది.
ఒప్పందంలో భాగంగా 9.4 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల(ఎంటీపీఏ) సిమెంట్ ప్లాంట్లతోపాటు.. 6.7 ఎంటీపీఏ క్లింకర్, 280 మెగావాట్ల థర్మల్ విద్యుత్ యూనిట్లను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. ఈ ఆస్తులు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో విస్తరించి ఉన్నట్లు దాల్మియా పేర్కొంది. ఈ కొనుగోలుతో మధ్యభారతంలోనూ కార్యకలాపాలు విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇదే సమయంలో తమ వద్ద మిగిలిన సిమెంట్ ఆస్తులను విక్రయించడం ద్వారా సిమెంట్ బిజినెస్ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు జేపీ గ్రూప్ వెల్లడించింది. ఇందుకు దాల్మియా భారత్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. రుణ భారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది.
విస్తరణ లక్ష్యంతో..: 2027కల్లా దేశవ్యాప్త సిమెంట్ కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంలో భాగంగా జేపీ ఆస్తుల కొనుగోలుతో దాల్మియా భారత్ ముందడుగు వేసింది. 2027కల్లా 75 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని అందుకోవాలని ఆశిస్తోంది. ఈ బాటలో 2031కల్లా 110-130 ఎంఎన్‌టీకి చేరాలని ప్రణాళికలు వేసింది. జేపీ ఆస్తుల కొనుగోలు ద్వారా దాల్మియా భారత్ సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 45.3 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్రస్తుత సామర్థ్యం 35.9 ఎంటీపీఏగా ఉంది. సిమెంట్ తయారీకి దాల్మియా ప్రస్తుతం దేశంలో నాలుగో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. అల్ట్రాటెక్, అదానీ సిమెంట్(ఇటీవలే ఏసీసీ, అంబుజాలను సొంతం చేసుకుంది), శ్రీ సిమెంట్ తొలి మూడు ర్యాంకులను ఆక్రమిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment