Dalmia Bharat
-
దాల్మియా డీల్: సిమెంట్ బిజినెస్ నుంచి ‘జేపీ’ ఔట్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ జైప్రకాష్ అసోసియేట్స్(జేఏఎల్), సహచర సంస్థ నుంచి సిమెంట్, సంబంధ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు దాల్మియా భారత్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 5,666 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువ ప్రకారం తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. పూర్తి అనుబంధ సంస్థ దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్(డీసీబీఎల్) ద్వారా క్లింకర్, సిమెంట్, పవర్ ప్లాంట్ల కొనుగోలుకి జేపీ గ్రూప్ సంస్థలతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా 9.4 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల(ఎంటీపీఏ) సిమెంట్ ప్లాంట్లతోపాటు.. 6.7 ఎంటీపీఏ క్లింకర్, 280 మెగావాట్ల థర్మల్ విద్యుత్ యూనిట్లను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. ఈ ఆస్తులు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో విస్తరించి ఉన్నట్లు దాల్మియా పేర్కొంది. ఈ కొనుగోలుతో మధ్యభారతంలోనూ కార్యకలాపాలు విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇదే సమయంలో తమ వద్ద మిగిలిన సిమెంట్ ఆస్తులను విక్రయించడం ద్వారా సిమెంట్ బిజినెస్ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు జేపీ గ్రూప్ వెల్లడించింది. ఇందుకు దాల్మియా భారత్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. రుణ భారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది. విస్తరణ లక్ష్యంతో..: 2027కల్లా దేశవ్యాప్త సిమెంట్ కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంలో భాగంగా జేపీ ఆస్తుల కొనుగోలుతో దాల్మియా భారత్ ముందడుగు వేసింది. 2027కల్లా 75 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని అందుకోవాలని ఆశిస్తోంది. ఈ బాటలో 2031కల్లా 110-130 ఎంఎన్టీకి చేరాలని ప్రణాళికలు వేసింది. జేపీ ఆస్తుల కొనుగోలు ద్వారా దాల్మియా భారత్ సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 45.3 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్రస్తుత సామర్థ్యం 35.9 ఎంటీపీఏగా ఉంది. సిమెంట్ తయారీకి దాల్మియా ప్రస్తుతం దేశంలో నాలుగో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. అల్ట్రాటెక్, అదానీ సిమెంట్(ఇటీవలే ఏసీసీ, అంబుజాలను సొంతం చేసుకుంది), శ్రీ సిమెంట్ తొలి మూడు ర్యాంకులను ఆక్రమిస్తున్నాయి. -
దాల్మియా భారత్ రిఫ్రాక్టరీస్ విక్రయం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ దాల్మియా భారత్‌కు చెందిన దేశీ రిఫ్రాక్టరీ బిజినెస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు వియన్నా కంపెనీ ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా తాజాగా పేర్కొంది. దాల్మియా భారత్ రిఫ్రాక్టరీస్ లిమిటెడ్(డీబీఆర్ఎల్)కు చెందిన రిఫ్రాక్టరీ బిజినెస్ కొనుగోలుకి రూ. 1,708 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా సీఈవో స్టీఫెన్ బోర్గాస్ వెల్లడించారు. ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా ఇండియాకు చెందిన షేర్ల మార్పిడి ద్వారా డీల్‌ను పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు. డీబీఆర్ఎల్.. తమ బిజినెస్‌ను దాల్మియా ఓసీఎల్కు బదిలీ చేయనుంది. తదుపరి డీవోసీఎల్ పూర్తి ఈక్విటీని 27 మిలియన్ ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా ఇండియా షేర్ల జారీ ద్వారా వియన్నా కంపెనీ సొంతం చేసుకోనుంది. ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా ఇండియా షేరు జారీ ధర రూ. 632.50తో చూస్తే డీల్ విలువను 20.8 కోట్ల యూరోలు(సుమారు రూ. 1,708 కోట్లు)గా స్టీఫెన్ తెలియజేశారు. -
ఐటీసీకి చార్మినార్, జీఎమ్ఆర్కు గోల్కొండ!
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ఎర్రకోటను దాల్మియా భారత్ కంపెనీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోకి ఇప్పుడు జీఎమ్ఆర్, ఐటీసీ హోటల్స్ కూడా చేరాయి. ఈ క్రమంలో ఐటీసీ కంపెనీ 400 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం, హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న చార్మినార్‌ను దత్తత తీసుకోవడం కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)ను దాఖలు చేసింది. చార్మినార్ దత్తత కోసం ఐటీసీకి పోటీగా మరే ఇతర కంపెనీ పోటీ పడకపోవడంతో ఐటీసీ దరఖాస్తును విజన్ కమిటీ, ఒవర్‌నైట్ కమిటీ ఆమోదించాయి. అలానే జీఎమ్ఆర్ స్పోర్ట్స్ ఈ ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఏడు చారిత్రక కట్టడాల దత్తత కోసం దరఖాస్తు చేసింది. వాటిలో ఢిల్లీలోని ఎర్రకోట, గోల్కొండ కోట కూడా ఉన్నాయి. దీని గురించి జీఎమ్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ అధికారులు ‘ మేము గోల్కొండ కోట కోసం వేసిన బిడ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకవేళ మా బిడ్ కమిటీకి నచ్చి, మాకు గోల్కొండ కోటను కేటాయిస్తే అప్పుడు మేము ప్రభుత్వంతో ఒక ఎమ్వోయూను కుదుర్చుకుంటాము’ అని తెలిపారు. జీఎమ్ఆర్ స్పోర్ట్స్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ :... చారిత్రక కట్టడాల సంరక్షణతో పాటు పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం 2017, సెప్టెంబరులో ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమం ప్రారంభింది. ఈ దత్తత కార్యక్రమంలో భాగంగా దాదాపు 100 చారిత్రక కట్టడాల పేర్లను ప్రకటించింది. తాజ్‌మహల్, ఎర్రకోట, సూర్య దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశం పర్యటక రంగంలో కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేసి ఆయా చారిత్రక కట్టడాలను సంరక్షించడం. చారిత్రక కట్టడాల దత్తత కార్యక్రమంలో భాగంగ కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తుంది. అత్యధిక బిడ్ వేసిన కంపెనీలకు ఈ చారిత్రక కట్టడాలను కేటాయిస్తారు. ఇక రానున్న ఐదేళ్లపాటు ఆయా చారిత్రక కట్టడాల సంరక్షణ బాధ్యత ఆ కంపెనీలదే. ఈ కార్యక్రమం అమలులో భాగంగా ఎర్రకోటను దత్తత చేసుకోవాడానికి దాల్మియా భారత్ గ్రూపు, ఇండిగో ఎయిర్‌లైన్స్ కంపెనీలు పోటీ పడగా... చివరకు ఈ రేసులో దాల్మియా భారత్ కంపెనీ 25 కోట్ల రూపాయల టెండర్ వేసి ఎర్రకోటను దక్కించుకుంది. ఇకమీదట ఎర్రకోట సంరక్షణ బాధ్యతలతో పాటు ఎర్రకోటకు వచ్చే పర్యాటకుల బాధ్యత కూడా ఇక దాల్మియానే చూసుకోనుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) : ఏదైనా వ్యాపారంలో భాగస్వామి అయ్యేందుకు లేదా ఉద్యోగం చేసే ఉద్ధేశంతో ఒక కంపెనీ లేదా పెట్టుబడిదారు పోటీ పడటం. -
దాల్మియాకు ఎర్రకోట
న్యూఢిల్లీ: ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట నిర్వహణ బాధ్యతలను దాల్మియా భారత్ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడాప్ట్ ఎ హెరిటేజ్ (ఓ చారిత్రక కట్టడాన్ని దత్తత తీసుకోండి) పథకంలో భాగంగా ఎర్రకోట, వైఎస్సార్ కడప జిల్లా ‘గండికోట’ కోట నిర్వహణ బాధ్యతలను నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖలతో దాల్మియా భారత్ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద కాలం ఐదేళ్లు. ఎర్రకోట కోసం తీవ్రమైన పోటీ నెలకొనగా.. ఇండిగో, జీఎంఆర్ గ్రూపులను వెనక్కు నెట్టి రూ. 25కోట్లకు (ఈ మొత్తాన్ని ఎర్రకోట నిర్వహణకు వెచ్చించాలి) దాల్మియా ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. ‘ ఎర్రకోట నిర్వహణ బాధ్యతలు పొందటం ఆనందంగా ఉంది. 30 రోజుల్లో మేం పనిని ప్రారంభించాలి. భారత్‌తో దాల్మియా బ్రాండ్‌ను పెంచుకునేందుకు ఈ అవకాశం దోహదపడుతుంది. ఎర్రకోట వైశాల్యంతో పోలిస్తే చాలా చిన్నగా ఉండే యూరప్‌లోని కొన్ని కట్టడాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఆ పద్ధతిలోనే మేం ఎర్రకోటను ప్రపంచ ఉత్తమ కట్టడాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం’ అని దాల్మియా భారత్ సిమెంట్స్ గ్రూప్ సీఈవో మహేంద్ర సింఘీ తెలిపారు. చారిత్రక కట్టడాల నిర్వహణలో ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యాన్ని తీసుకువచ్చేందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ ఎ హెరిటేజ్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 70 ఏళ్లు ఏం చేశారు?: కేంద్రం ఈ పథకంలో భాగస్వాములైన కంపెనీలు కేవలం డబ్బులు ఖర్చుపెట్టి సదుపాయాలను మెరుగుపరుస్తాయే తప్ప.. పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయబోవని కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ స్పష్టం చేశారు. కట్టడాలను ప్రైవేటీకరించే ఆలోచన అర్థరహితమని పర్యాటక మంత్రి కేజే అల్ఫోన్స్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ 70 ఏళ్లుగా ఏం చేసింది? అన్ని కట్టడాలు, వాటిలోని వసతులు చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు వసతులే లేవు. అలాంటిది ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. కట్టడాల నిర్వహణ కాంట్రాక్టుల జాబితాలో కుతుబ్ మినార్ (ఢిల్లీ), హంపి (కర్ణాటక), సూర్య దేవాలయం (ఒడిశా), అజంతా గుహలు (మహారాష్ట్ర), చార్మినార్ (తెలంగాణ), కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం) వంటి 95 ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్నాయి. కాంగ్రెస్ మండిపాటు ప్రముఖ కట్టడం నిర్వహణను ఓ ప్రైవేటు కంపెనీకి ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్, తృణమూల్, వామపక్ష పార్టీలు ప్రశ్నించాయి. భారత స్వాతంత్య్ర ప్రతీకైన ఎర్రకోట బాధ్యతలను ఇతరులకు ఎలా అప్పగిస్తారని మండిపడ్డాయి. ‘ప్రైవేటు సంస్థకు చారిత్రక కట్టడాన్ని నిర్వహించే బాధ్యతను ఎలా అప్పజెబుతారు? ఇది మీరు (ప్రభుత్వం) చేయలేరా? భారత చరిత్ర పరిరక్షణపై ప్రభుత్వ విధానమేంటి? నిధుల కొరత ఉందా? భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్ఐ)కి కేటాయించిన నిధులు మురిగిపోతున్నాయి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. -
దాల్మియా భారత్‌లో 8.5% వాటా కొన్న కేకేఆర్
న్యూఢిల్లీ: దాల్మియా భారత్ కంపెనీలో 8.5 శాతం వాటాను కేకేఆర్ మారిషస్ సిమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కొనుగోలు చేసింది. ఇంతకు ముందు దాల్మియా భారత్ కంపెనీ తన అనుబంధ సంస్థ దాల్మియా సిమెంట్ భారత్(డీసీబీఎల్)లో 15 శాతం వాటాను రూ.1,218 కోట్లకు కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం పొందింది. ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్ నుంచి ఈ వాటాను దాల్మియా భారత్(డీబీఎల్)కొనుగోలు చేసింది. ఈ వాటా విక్రయం వల్ల కేకేఆర్ సంస్థకు 2.4 రెట్లు రాబడి వచ్చింది. 2010 సెప్టెంబర్‌లో ఈ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈ వాటాను రూ.500 కోట్లకు కొనుగోలు చేసింది. డీసీబీఎల్లో కేకేఆర్‌కు ఉన్న 15 శాతం వాటాను కొనుగోలు చేయడానికి, అలాగే డీబీఎల్‌లో 8.5% వాటా కేకేఆర్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని దాల్మియా భారత గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా చెప్పారు.