ఐదో వన్డే రద్దు!
కటక్: చెరువును తలపిస్తున్న మైదానం... పిచ్‌పై ఏకంగా మూడు కవర్లు... మధ్య మధ్యలో కాస్త తెరపినిస్తున్నా, వదలని వాన... ఓవర్‌టైమ్ పని చేస్తున్న మైదానం సిబ్బంది... ఇదీ బారాబతి స్టేడియంలో పరిస్థితి. మరో రెండు రోజులు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక. ఈ నేపథ్యంలో శనివారం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగాల్సిన ఐదో వన్డే రద్దయ్యే అవకాశం ఉంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహణ అసాధ్యం. అయితే రద్దయినట్లు అధికారికంగా ప్రకటించే హక్కు మాకు లేదు. శనివారం అంపైర్లు మైదానాన్ని పరిశీలించి ఈ ప్రకటన చేస్తారు.
అయితే మేం టిక్కెట్ల డబ్బు ఏ తేదీల్లో (నవంబరు 8-15) వాపస్ చేసేదీ ఇప్పటికే ప్రకటించాం’ అని ఒరిస్సా క్రికెట్ సంఘం కార్యదర్శి బెహరా చెప్పారు. శనివారం ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియానికి కూడా రాకపోవచ్చు. కేవలం అంపైర్లు, అధికారులు వచ్చి మ్యాచ్ రద్దు ప్రకటన చేస్తారు. 17 సంవత్సరాల క్రితం భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఇదే వేదికలో జరగాల్సిన వన్డే కూడా వర్షం కారణంగా రద్దయింది. ఏడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఆరో వన్డే 30న నాగ్‌పూర్‌లో జరుగుతుంది. ఇక సిరీస్ గెలవాలంటే భారత్ కచ్చితంగా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి తీరాలి.
అక్టోబరు 31 నుంచి ఉత్తరప్రదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మూడు రోజుల మ్యాచ్‌ను కూడా కటక్ నుంచి ముంబైకి తరలించాలని ఒరిస్సా సంఘం ఇప్పటికే బీసీసీఐని కోరింది. వన్డే మ్యాచ్ రద్దు కావడం ద్వారా ఒరిస్సా సంఘానికి రూ. 3 కోట్ల నష్టం వస్తుంది. అయితే ఈ మ్యాచ్‌ను ఇప్పటికే ఇన్సూరెన్స్ చేశారు. కాబట్టి ఈ నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం ఉంది.
‘ఏడు వన్డేల సిరీస్ కాస్తా ఐదు వన్డేల సిరీస్‌గా మారింది. ఇందులో 2-1 ఆధిక్యంలో ఉండటం కచ్చితంగా మాకు కలిసొచ్చే అంశం. భారత్‌లో సిరీస్ గెలవడం మా కోరిక. ఇప్పుడు అది సాధ్యమయ్యే అవకాశం ఉంది’
- వాట్సన్
‘ఇక మాకు చివరి రెండు వన్డేలు చావోరేవో. వాతావరణం మన చేతుల్లో ఉండదు. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి’
- జడేజా