కదంతొక్కిన ఒడిశా కార్మికులు
* ఇటుకబట్టీల యజమానులు దాడిచేశారని ఆరోపణ
* 42 కిలోమీటర్లు కాలినడకన కరీంనగర్‌కు
సుల్తానాబాద్: ఇటుకబట్టీల యజమానులు తమపై దాడి చేశారని, అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం రాఘవాపూర్ నుంచి ఒడిశా కార్మికులు కదం తొక్కారు. తమకు కలెక్టర్, లేబర్ ఆఫీసరే న్యాయం చేయాలని కరీంనగర్ జిల్లాకేం ద్రంలోని అధికారి కార్యాలయానికి గురువారం రాత్రి కాలి నడకన బయలుదేరారు. వారిని నిలువరించేందుకు బట్టీల యజమానులు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. దారి మధ్యలో సుల్తానాబాద్‌లో పోలీసులు ఆపేందుకు విఫలయత్నం చేశారు.
చేసేదేమీ లేక పోలీసులు వారి వెంటే తరలివెళ్లారు. బట్టీల నుంచి జిల్లా కేంద్రానికి సుమారు 42 కిలోమీటర్ల దూరం ఉండగా.. దారి వెంట ఉండే పోలీస్స్టేషన్ల నుంచి రహదారిపై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులకు మద్దతుగా ప్రజాసంఘాల నాయకులు సైతం తరలివెళ్లారు. కార్మికులకు రక్షణగా పెద్దపల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాసరావు, మహేశ్, పెద్దపల్లి, సుల్తానాబాద్ ఎస్సైలు రాజ్‌కుమార్, విజేందర్, ఇంద్రసేనారెడ్డి, పోలీసులు ఉన్నారు.
రెండు నెలల క్రితం ఓ ఇటుక బట్టీలో ఒడిశాకు చెందిన గర్భిణీపై సూపర్వైజర్ దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన మరిచిపోకముందే గురువారం కార్మికులు ర్యాలీగా పయనమవడం తో ఇటుకబట్టీల యజమానుల్లో వణుకు మొదలైంది.