మాతృభాషలో డబ్బింగ్ భలే మజా: అమలాపాల్
షాపింగ్ మాల్ నుంచి ఇద్దరమ్మాయిలతో వరకు వరుస విజయాలతో తెలుగునాట దూసుకెళ్తున్న మళయాళ తార అమలా పాల్. ఇప్పుడు ఆమె తన మాతృభాషలో 'ఒరు ఇండియన్ ప్రణయకథ' అనే రొమాంటిక్ డ్రామా చిత్రంలో నటిస్తోంది. అంతే కాదు.. సొంత భాషలో తొలిసారి సొంత గొంతుతో డబ్బింగ్ కూడా చెప్పుకుంటోంది. గత నెల రోజులుగా తన పాత్రకు మాతృభాషలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం చాలా మజాగా అనిపిస్తోందని అమలా పాల్ చెబుతోంది.
ఈ విషయాన్ని ఆమె తన ఫేస్బుక్ పేజీలో రాసింది. తాను తన 'ఒరు ఇండియన్ ప్రణయకథ' చిత్రం గురించే చెబుతున్నట్లు కూడా ఆమె స్పష్టం చేసింది. ఈ సినిమాలో ఆమె ఫహద్ ఫాసిల్ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల తమిళంలో 'తలైవా' చిత్రానికి కూడా అమలాపాల్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంది. ఇంతకుముందు మళయాళంలో 'రన్ బేబీ రన్', 'నీలతమార' లాంటి చిత్రాల్లో నటించినా, ఆ భాషలో మాత్రం ఇప్పటివరకు డబ్బింగ్ చెప్పలేదు. ఇదే మొదటిసారి.