ఏవి తల్లీ నిన్న వెలిగిన జ్ఞాన దీపికలు?
సమకాలీనం
దేశ, విదేశాల నుంచి గొప్ప మహామహుల్ని బోధకులుగా ఏరికోరి తెప్పించుకున్న చరిత్ర ఓయూది. ఇప్పుడు, తగిన ప్రొఫెసర్లు లేకుండానే ఒకటి, రెండు బ్యాచ్లు వెళ్లిపోయే పరిస్థితి. దాదాపు ఇటువంటి, ఇంతకన్నా దయనీయ పరిస్థితే తెలుగునాట ఉన్న ఇతర యువ విశ్వవిద్యాలయాలది కూడా. ‘ఉన్నత విద్య పేదల ముంగిట్లోకి రావాలన్నది ఆకాంక్ష’తో ఓయూపై విద్యావంతులు, సామాన్యులు పెట్టుకున్న ఆశలన్నీ నేడు గల్లంతయ్యాయి. ఉన్నత స్థాయి చదువు‘కొనలేని’ వాళ్లకు అరకొర విద్యే అందుతోంది.
నూరేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘శతవసంతోత్సవం’ మూడొద్దుల పండుగలో ఉన్నాం. ఇది ఎవరికి పండుగ? భారత రాష్ట్రపతి ప్రణబ్ దాదా, ఆకాంక్షకు, వాస్తవ పరిస్థితులకు మధ్య అంతరాన్ని చూస్తే మనసు చివుక్కుమంటుంది! ‘‘సమాజంలోని సంక్లిష్ట సమస్యలకు విశ్వవిద్యా లయాలు తేలికైన పరిష్కారాలు చూపాలి... అందుకు ఇక్కడ నిరంతర పరి శోధనలు, నూతన ఆవిష్కరణలు జరగాలి’’ అన్నారాయన. కానీ, మన విశ్వవిద్యాలయాల్ని తరచి చూస్తే ‘బుద్ది భూములేలాలని ఉంటే, వంతు వాకిలి ఊడ్వమంద’న్న సామెత గుర్తుకొస్తుంది! పరిస్థితులు ఇంతలా దిగజా రిపోయిన వాస్తవం ఎవరికీ బోధపడటం లేదా? నిజం తెలిసినా ఎవరికి వారు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యాన్ని నటిస్తున్నారా? నిర్దిష్టంగా ఉస్మానియా యూని వర్సిటీ అయినా, మరే ఇతర విశ్వవిద్యాలయమైనా.... గతం ఘనమే! భవిష్యత్తేంటి?.
వర్తమాన నిజపరిస్థితిని సమీక్షించుకోవడానికి ఇంతకన్నా గొప్ప సందర్భం వేరే ఉంటుందని నేననుకోను. అయినా మాట్లాడుకోవాల్సిన సంద ర్భమే ఇది! దేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ విశ్వ విద్యాలయాలది దీన పరిస్థితే. అవి దినదిన పతనావస్థలోకి జారిపోతు న్నాయి. విద్యను ఫక్తు వ్యాపారం చేసిన ప్రైవేటు కార్పొరేట్ల కుట్రకు బలవు తున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వాల నిర్లక్ష్యానికి సమిధలవుతు న్నాయి. కులాల కుమ్ములాటలతో కునారిల్లుతున్నాయి. తగిన బోధకులు లేక ప్రమాణాల్లో వెలవెలపోతున్నాయి. విద్యార్థుల క్రమ శిక్షణా రాహిత్య ప్రదర్శ నకు వేదికలవుతున్నాయి. ప్రపంచంలోని 100 మేటి విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి భారత్కు స్థానం దక్కడం లేదు. ఎందుకీ పరిస్థితులు దాపురిం చాయి? ఎవరు కారకులు? ఎవరు బాధితులు?
కుదుపు వెనుక కుట్ర మూలాలు
దేశంలో ఉన్నత విద్యాభ్యాసం ఇప్పుడు బలహీన స్థితిలో ఉండటానికి పలు కారణాలున్నాయి. ప్రభుత్వ రంగంలోని విశ్వవిద్యాలయాలు తమపూర్వ వైభ వాన్ని క్రమంగా కోల్పోతున్నాయి. ప్రైవేటు రంగంలోని కార్పొరేట్ విద్యా సంస్థలు, డీమ్డ్ యూనివర్సిటీలు, నేరుగా నెలకొంటున్న వర్సిటీలు, విదేశీ విశ్వవిద్యాలయాల ప్రాబల్యం కోసం పైరవీకారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాల్ని ప్రభావితం చేస్తూ ప్రభుత్వ రంగ యూనివర్సిటీలను దెబ్బ తీస్తున్నారు. ఉపకుల పతు(వీసీ)ల నియామకం నుంచి నిధుల విడుదల వరకు, పాలక మండళ్ల ఏర్పాటు నుంచి నిత్యనిర్వహణ వరకు అన్నిచోట్లా ప్రభుత్వ ప్రమేయాలే, అనుచిత జోక్యాలే! రాజకీయ పార్టీల సంకుచిత ఆలోచనలూ నష్టం కలిగిస్తున్నాయి. అంతా కలిసి ఇతరేతర ప్రయోజనాల కోసం దేశంలో ఉన్నత విద్యను, ప్రమాణాలను దారుణంగా దిగజారుస్తు న్నారు. ప్రభుత్వాలు నడుం కట్టి ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయాల్ని చంపేస్తున్నాయి.
ఆ చావులపై ప్రయివేటు విద్యా సంస్థలు ఎదిగే ఒరవడి బలపడింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓ మాట చెప్పారు. గత ఐదేళ్లలో తాను వంద విశ్వ విద్యాలయాల్ని సందర్శించానని, అంతటా ప్రమాణాలు మెరుగుపడాలని, వైఖరి మార్చుకోవాలని, పరిశోధనలు పెంచాలనీ చెబుతున్నానని అన్నారు. ఐదేళ్లుగా ఆయన ఒకే మాట చెప్పాల్సి వస్తోందంటే, మన విశ్వవిద్యాల యాల్లో ప్రమాణాలు దిగజారుడు క్రమం ఎలా ఉందో తెలిసిపోతోంది. నగ రంలోనే జరిగిన మరో సభలో మాట్లాడుతూ రాష్ట్రపతి ఉన్నత విద్య, ముఖ్యంగా ప్రభుత్వరంగంలో పెనుసవాళ్లను ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. అందుకు నాలుగు ప్రధాన కారణాలని విశ్లేషించారు. 1) బోధన వ్యయం పెరగటం 2) నేర్చుకోవడంలో సంకుచితత్వం 3) మార్కెట్ దృష్టితో కమ్యూనికేషన్ వ్యవస్థలదే పైచేయి కావడం 4) విశ్వాసాలు తగ్గిపోవడం. వీటి వెనుక ప్రైవేటు కార్పొరేట్ శక్తుల కుట్ర, ప్రభుత్వాల లొంగుబాటు, విశ్వ విద్యాలయాల దీనావస్థ ఉంది. దీంతో పేద, బడుగు బలహీనవర్గాలు ఉన్నత విద్య విషయంలో మోసపోతున్నారు, నాణ్యమైన విద్యకు దూరమౌతున్నారు.
వరుసగా ఇది మూడో దెబ్బ
ప్రభుత్వరంగంలోని ఉన్నతవిద్యకు వరుస దెబ్బలు తప్పటం లేదు. మండల్ అనుకూల–ప్రతికూల వివాదాల తర్వాత ఒక్కసారిగా ప్రైవేటు రంగం తెర పైకి వచ్చింది. ప్రభుత్వ రంగంలోని విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యా సంస్థల్లో ప్రమాణాల పతనానికది నాంది అయింది. ఆర్థిక సరళీకరణ, ప్రపం చీకరణ ప్రభావం కూడా ఈ ∙సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపింది. విద్య ను పూర్తిస్థాయి వ్యాపారం చేసిన ప్రైవేటు కార్పొరేట్ రంగం విజృంభణతో వ్యవస్థీకృత కుట్రలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయాలు, కాలేజీలు వంటి ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో, వాటి నిర్వహణలో ప్రభుత్వాల, నిర్ణాయక స్థానాల్లోని ముఖ్యుల పాత్ర, ప్రమేయాలు పెరిగాయి. సర్కారు విద్యపై మూడో దెబ్బ బలంగా పడింది. ప్రాధాన్యతతో పాటు అక్కడ సదుపాయాలు సన్నగిల్లి విద్యా ప్రమాణాలు పూర్తిగా దిగజారాయి.
వైద్య, ఇంజనీరింగ్, న్యాయ తదితర వృత్తి విద్యాకోర్సులు, ఐటీ వంటి ఇతర సాంకేతిక కోర్సులకు డిమాండ్ పెరిగిన క్రమంలోనే విశ్వవిద్యాలయాల ప్రాభవం తగ్గుతూ వచ్చింది. వాటిలో చేరే వాళ్ల ఆర్థిక–సామాజిక నేపథ్యాల సమీకరణాలూ మారాయి. రాజకీయ నేతల, ఉన్నతోద్యోగుల, న్యాయాధికారులు, బడా వ్యాపారవేత్తల పిల్లలెవరూ వర్సిటీల వైపు కన్నెత్తి చూడని పరిస్థితులు బలపడ్డాయి. పెద్దగా ఆర్థిక స్తోమత, పలుకుబడి లేని అల్పాదాయ, బడుగు, బలహీన వర్గాల వారి పిల్లలే ఎక్కువగా ఈ విశ్వవిద్యాలయాలకు వస్తున్నారు. వారికే అన్యాయం జరుగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రారంభోత్స వంలో తొలి వీసీ నవాబ్ సర్దార్ యార్ జంగ్ బహదూర్ ‘‘ఉన్నత విద్య పేదల ముంగిట్లోకి రావాలన్నది ఆకాంక్ష’’ అనే గొప్ప మాట చెప్పారు. ఆ ఆశలన్నీ గల్లంతయ్యాయి. నేడు ఉన్నత విద్య ఖరీదైపోయింది. ఉన్నత చదువులను ‘కొనలేని’ వాళ్లకు అరకొర విద్యే అందుతోంది.
స్వయం ప్రతిపత్తికి మంగళం
విశ్వవ్యాప్తంగా పేరున్న ఉస్మానియాతో పాటు పలు విశ్వవిద్యాలయాలకు చట్టబద్ధ స్వయంప్రతిపత్తి ఉందే కానీ, ఆచరణ రీత్యా లేదు. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా జోక్యం చేసుకుంటాయి. ఇప్పుడు జరుగుతున్న నూరేళ్ల పండుగే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. రెండున్నరేళ్లకు పైగా ఇంటిపెద్ద లేని వర్సిటీకి ఇటీవలే వీసీని నియమించారు. కార్యనిర్వాహక మండలి (ఈసీ) లేనే లేదు. వర్సిటీ వారి అభీష్టాన్ని పక్కన పెట్టి, ప్రభుత్వమే అన్నీ తానై ఈ ఉత్సవాలు జరుపుతోంది. రాష్ట్రపతి పాల్గొన్న నూరేళ్ల పండుగ వేదికపై గవ ర్నర్, ముఖ్యమంత్రి నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితులు ఎందుకు తలె త్తాయో సర్కారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీసీ, ఐఏఎస్లు, ప్రజా ప్రతి నిధులతో కూడి ఉండే ఈసీ ఉంటేనే తగు నిర్ణయాలతో విశ్వవిద్యాలయాలు పరిపుష్టంగా ఉంటాయి.
ప్రభుత్వాలే ఐఏఎస్ అధికారులతో దొడ్డిదారి పాలన సాగించాలనుకున్నప్పుడే ఈ అరిష్టాలు, ప్రమాణాల పతనం. ఈ కుయత్నం ఇప్పటిది కాదు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తమ మనిషిని నియమించుకునే క్రమంలో నాటి వీసీ డా. డీసీ రెడ్డిని ఏకపక్షంగా తప్పిస్తే తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లి, కేసు గెలిచారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, ‘కమిషనరేట్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్’ ఏర్పాటు చేస్తుంటే తలెత్తిన ప్రతిఘటన మళ్లీ సుప్రీం తలుపులు తట్టింది. హితైషులు తమ వాదన గెలిపించుకొని, స్వయంప్రతి పత్తిని నిలు పుకున్నారు. చంద్రబాబు సీఎంగా చేపట్టిన ‘స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్’ ఏర్పాటుకూ బలమైన వ్యతిరేకతే వచ్చింది. ఇలా, అడుగడుగునా సర్కారు అనుచిత జోక్యాలపై పోరాటాలు సాగుతూనే ఉన్నాయి.
వర్సిటీలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రభుత్వాలు ఇంకో మార్గాన్ని ఎంచు కున్నాయి. నిధుల్వికుండా బలహీనపర్చడం, సదుపాయాల్ని నిరాకరించడం, తమకు ‘జీ హుజూర్’ అనే వాళ్లనే వీసీలుగా నియమించుకోవడం, ఇదీ వరుస! అత్యధిక సందర్భాల్లో వెన్నెముకలేని వాళ్లే వీసీలుగా నియమితు లవుతున్నారు. తెలుగునాట ఓ విద్యార్థిని, ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోడా నికి ఒక సామాజిక వర్గానికి చెందిన వీసీ, కాలేజీ ప్రిన్సిపల్ వైఫల్యాలే కారణమని దేశమంతా గగ్గోలెత్తినా.. ఏపీ ప్రభుత్వం ఒకే ఉత్తర్వుతో అదే సామాజిక వర్గానికి చెందిన ముగ్గుర్ని వీసీలుగా నియమించింది! మరో వీసీ, ‘పెదబాబు’ జన్మదిన వేడుకకు ఇంట్లోను, ‘చినబాబు’ పుట్టిన రోజు వేడుకకు వీధిలోనూ బొకేలతో హాజరై మెప్పు పొందుతాడు! నీలం సంజీవరెడ్డి ముఖ్య మంత్రిగా విశాఖ పర్యటనకు వెళ్లినపుడు, స్వాగతం చెప్పడానికి వచ్చిన స్థానిక వీసీని చూసి.. ఆయన్ని కాస్త పక్కకు పిలిచి, ‘ఏంటి వీసీ గారు, మీరొ చ్చారు. ఇదేం బాగుంది! మీరిలా రావొద్దు!’ అని ఆయన పదవి ప్రాధాన్య తను సున్నితంగా తెలియజెప్పారుట. ఎంత తేడా!
క్రియాశీల పాత్ర పోషించాలి
ప్రాంతీయ సర్వతోముఖ వృద్ధికి విశ్వవిద్యాలయాలు కృషి చేయాలి. విజ్ఞానం కోసం ప్రపంచ దేశాలు అలమటిస్తున్నపుడు నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలతో విద్యను విశ్వవ్యాప్తం చేసిన నేల మనది. విలు వలు, సంస్కృతి పెంపులోనే కాకుండా రాజకీయ, ఆర్థిక సామాజిక దార్శ నికతతో దేశ నిర్మాణంలో, పునర్నిర్మాణంలో అవి ముఖ్య భూమికను పోషించాయి. ఆ స్పూర్తి ఇప్పుడు కొరవడింది. మనం గొప్పగా చెప్పుకునే మన ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర వర్సిటీలు కూడా ఇప్పుడు దేశాభివృద్ధికి నిర్ది ష్టంగా చేస్తున్న కృషి గుండు సున్నా! దేశం లోపల, బయట గొప్ప పేరున్న మహామహుల్ని బోధకులుగా ఏరికోరి తెప్పించుకున్న చరిత్ర ఓయూది.
ఇప్పుడు, తగిన ప్రొఫెసర్లు లేకుండానే ఒకటి, రెండు బ్యాచ్లు వెళ్లిపోయే పరిస్థితి.
ఒక్క ఉస్మానియాలోనే 1,264 బోధకుల పోస్టులుంటే, 732కి పైగా ఖాళీలున్నాయి. దాదాపు ఇటువంటి, ఇంతకన్నా దయనీయ పరిస్థితే తెలు గునాట ఇతర యువ విశ్వవిద్యాలయాలది. అవన్నీ భర్తీ చేసుకోవాలి, సమ ర్థుల్ని తెచ్చుకోవాలి. ప్రభుత్వాలపై ఆధారపడకుండా ఆర్థిక స్వయం ప్రతిపత్తి పొందాలి. అందుకు, ఎప్పటికప్పుడు పారిశ్రామిక రంగానికి, తాను నిర్వ హించే కోర్సులకు మధ్య సమన్వయ సాధనతో వాటిని ఆధునికీకరించాలి. ఇప్పుడు పూర్తిగా అట్టడుగుకు చేరిన విద్యార్థి క్రమశిక్షణను మెరుగుపరచు కోవాలి. విప్లవాత్మక సంస్కరణలతోనే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్య ఈ దేశంలో ఆశించిన ఫలితాల్ని సాధించగలగుతాయి. హైదరాబాద్లో ఒక విశ్వ విద్యాలయాన్ని స్థాపిస్తామని ఏడో నిజామ్ తెలపడంతోనే, ఉర్దూ ప్రాంతీయ భాషా మాధ్యమంగా రావడాన్ని స్వాగతిస్తూ ఆనందంతో పులకించి ఉత్తరం రాశారు విశ్వకవి రవీంద్రుడు.
ఆ ప్రార్థనా గీతాన్ని వీసీ చాంబర్ ముందు పలకంపై చెక్కి, ఈ వర్సిటీ శాశ్వత నివాళి అర్పించిందాయనకు. ఈ సందర్భానికి ఆ ప్రార్థన సరిపోతుంది. ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో/ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగు తారో/ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో/సంకుచిత భావాలతో ముక్క లుగా చీలిపోదో/ ఎక్కడ సత్యవాక్కులు వెలువడుతాయో/ఎక్కడ నిర్విరామ కృషి పరిపూర్ణత కోసం చేతులు చాపుతుందో/ ఎక్కడ స్వచ్ఛమైన వివేకధార ఇంకిపోకుండా ఉంటుందో/ఎక్కడ నిరంతర ఆలోచన–ఆచరణవైపు నీవు బుద్దిని నడిపిస్తావో నా తండ్రీ/ ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా దేశాన్ని మేల్కొలుపు’’
ఈమెయిల్: dileepreddy@sakshi.com
దిలీప్ రెడ్డి