Ostapenko
-
గట్టెక్కిన జ్వెరెవ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన అలెగ్జాండర్ జ్వెరెవ్ అతికష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించాడు. 21 ఏళ్ల ఈ జర్మనీ యువతార మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 7–6 (7/4), 6–3, 2–6, 6–7 (5/7), 6–3తో జాన్ మిల్మన్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. 4 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జ్వెరెవ్ వరుసగా రెండు సెట్లలో నెగ్గినా... ఆ తర్వాతి రెండు సెట్లను కోల్పోయాడు. అయితే నిర్ణాయక ఐదో సెట్లో తేరుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. గతేడాది యూఎస్ ఓపెన్‌లో రోజర్ ఫెడరర్‌ను ఓడించిన మిల్మన్ నాలుగో సెట్లో 2–4తో వెనుకబడిన దశలో పుంజుకొని స్కోరును సమం చేశాడు. టైబ్రేక్‌లో సెట్‌ను గెలిచి జ్వెరెవ్‌కు చెమటలు పట్టించాడు. అయితే నిర్ణాయక ఐదో సెట్లోని ఎనిమిదో గేమ్‌లో మిల్మన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని జ్వెరెవ్ ప్రత్యర్థి ఆట కట్టించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ డెల్ పొట్రో (అర్జెంటీనా) 3–6, 6–2, 6–1, 6–4తో నికొలస్ జారీ (చిలీ)పై, తొమ్మిదో సీడ్ ఫాగ్నిని (ఇటలీ) 6–3, 6–0, 3–6, 6–3తో ఆండ్రియా సెప్పి (ఇటలీ)పై, పదో సీడ్ ఖచనోవ్ (రష్యా) 6–1, 6–1, 6–4తో స్టెబ్ (జర్మనీ)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు.మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నయోమి ఒసాకా (జపాన్) రెండో రౌండ్ చేరేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రపంచ 90వ ర్యాంకర్ అనా కరోలినా ష్మెదిలోవా (స్లొవేకియా)తో జరిగిన తొలి రౌండ్లో ఒసాకా 0–6, 7–6 (7/4), 6–1తో నెగ్గింది. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా 38 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్‌లో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) వరుసగా రెండో ఏడాది తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) 6–4, 7–6 (7/4)తో ఒస్టాపెంకోను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఒస్టాపెంకో ఏకంగా 60 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మరో మ్యాచ్‌లో 17వ సీడ్ అనా కొంటావీట్ (ఎస్తోనియా) 6–3, 2–6, 2–6తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయింది. -
ఒస్టాపెంకో ఇంటిముఖం
మెల్బోర్న్: మహిళల సింగిల్స్ విభాగంలో మరో సంచలనం నమోదైంది. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ చాం పియన్, ఏడో సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) మూడో రౌండ్లోనే వెనుదిరిగింది. 32వ సీడ్ అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా) 6–3, 1–6, 6–3తో ఒస్టాపెంకోను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కొంటావీట్ ఆరు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఎనిమిదిసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు రెండో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో వొజ్నియాకి 6–4, 6–3తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించగా... స్వితోలినా 6–2, 6–2తో తన దేశానికే చెందిన 15 ఏళ్ల యువ సంచలనం, క్వాలిఫయర్ మార్టా కోస్ట్యుక్‌పై విజయం సాధించింది. నాదల్ హవా... పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ తన జోరు కొనసాగిస్తూ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో రౌండ్లో నాదల్ 6–1, 6–3, 6–1తో దామిర్ జుమ్హుర్ (బోస్నియా అండ్ హెర్జెగోవినా)ను చిత్తుగా ఓడించాడు. మూడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా), పదో సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. దిమిత్రోవ్ 6–3, 4–6, 6–4, 6–4తో 30వ సీడ్ రుబ్లేవ్ (రష్యా)పై, సిలిచ్ 7–6 (7/4), 6–4, 7–6 (7/4)తో హారిసన్ (అమెరికా)పై, కరెనో బుస్టా 7–6 (7/4), 4–6, 7–5, 7–5తో 23వ సీడ్ గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో 17వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7–6 (7/5), 4–6, 7–6 (8/6), 7–6 (7/5)తో 15వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్)ను బోల్తా కొట్టించాడు. 3 గంటల 51 నిమిషాలపాటు జరిగిన మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆండ్రియా సెప్పి (ఇటలీ) 6–3, 7–6 (7/4), 6–7 (3/7), 6–7 (5/7), 9–7తో ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించాడు. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న, దివిజ్ జోడీలు పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్)... దివిజ్ శరణ్ (భారత్)–రాజీవ్ రామ్ (అమెరికా) జంటలు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరాయి. రెండో రౌండ్లో బోపన్న–వాసెలిన్ 6–2, 7–6 (7/3)తో మాయెర్ (అర్జెంటీనా)–సుసా (పోర్చుగల్)లపై... దివిజ్–రాజీవ్ 4–6, 7–6 (7/4), 6–2తో ఫాగ్నిని (ఇటలీ)–గ్రానోలెర్స్ (స్పెయిన్)లపై గెలుపొందారు. -
'గ్రాండ్' ఎంట్రీ
ఫ్రెంచ్ ఓపెన్ విజేత జెలెనా ఒస్టాపెంకో ♦ అన్‌సీడెడ్ హోదాలో అద్భుతం ♦ ఆడిన తొలి ‘గ్రాండ్’ ఫైనల్లోనే ట్రోఫీ కైవసం ♦ ఫైనల్లో మూడో సీడ్ హలెప్‌పై విజయం ♦ రూ. 15 కోట్ల 10 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ముఖంపై ఇంకా వీడని అమాయకత్వపు ఛాయలు... కానీ కోర్టులో దిగితే మాత్రం తన రాకెట్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టేలా ఆటతీరు... ఎలాంటి అంచనాలు లేకుండా అనామకురాలిగా అడుగు పెట్టినా... తనకంటే ఎంతో మెరుగైన వారు ప్రత్యర్థులుగా ఎదురైనా... పూర్తి విశ్వాసంతో ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ... చివరకు ఎవ్వరూ ఊహించనిరీతిలో ‘గ్రాండ్’గా ఫినిష్ చేసింది. గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల చరిత్రలోనే సంచలనాత్మక విజయం సాధించి అందర్నీ ఔరా అనిపించేలా చేసింది. ఆమే లాత్వియాకు చెందిన 20 ఏళ్ల జెలెనా ఒస్టాపెంకో. ఫ్రెంచ్ ఓపెన్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఒస్టాపెంకో ఏకంగా టైటిల్‌నే సొంతం చేసుకొని టెన్నిస్ క్రీడాలోకాన్ని నివ్వెరపరిచింది. టైటిల్ సాధించిన క్రమంలో ఒస్టాపెంకో రెండో రౌండ్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ మోనికా పుయిగ్ (ప్యూర్టోరికో)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 2011 యూఎస్ ఓపెన్ చాంపియన్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై, క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై, సెమీఫైనల్లో 30వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. పారిస్: అనుభవంపై యువతరంగం గెలిచింది. సత్తా ఉండాలేగానీ సీడింగ్స్తో, ర్యాంక్‌లతో సంబంధం లేదని జెలెనా ఒస్టాపెంకో నిరూపించింది. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 20 ఏళ్ల ఈ లాత్వియా అమ్మాయి మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. రొలాండ్ గారోస్‌లో శనివారం గంటా 59 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ ఒస్టాపెంకో 4–6, 6–4, 6–3తో మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచింది. విజేతగా నిలిచిన ఒస్టాపెంకోకు 21 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 10 లక్షలు)... రన్నరప్ హలెప్‌నకు 10 లక్షల యూరోలు (రూ. 7 కోట్ల 19 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీకి ముందు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 47వ స్థానంలో ఉన్న ఒస్టాపెంకో తాజా ప్రదర్శనతో సోమవారం విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో 12వ స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ హలెప్ గెలిచిఉంటే కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడంతోపాటు ఆమెకు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ ఖాయమయ్యేది. ఈ టోర్నీకి ముందు కెరీర్లో ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన ఒస్టాపెంకో ఏనాడూ రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. అంతేకాకుండా ఫ్రొఫెషనల్ కెరీర్లో కేవలం మూడు టోర్నీలలో ఫైనల్‌కు చేరుకొని మూడింటిలోనూ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. గ్రాండ్‌స్లామ్ రూపంలోనే ఒస్టాపెంకో తన కెరీర్లో తొలి టైటిల్‌ను సాధించడం విశేషం. వెనుకబడినా... ఒస్టాపెంకోతో పోలిస్తే కెరీర్లో 28వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న హలెప్‌ను అందరూ టైటిల్ ఫేవరెట్‌గా భావించారు. 2014లో ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలువడం కూడా హలెప్‌పై అంచనాలు పెంచాయి. తొలి సెట్‌ను హలెప్ గెలుపొందడం... రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలో ఉండటంతో హలెప్‌కు టైటిల్ లభించడం లాంఛనమే అనిపించింది. కానీ ఒస్టాపెంకో మాత్రం అలా భావించలేదు. పోరాడితే పోయేదేముందీ అనుకుంటూ జూలు విదిల్చింది. ఒకవైపు అనవసర తప్పిదాలు చేస్తున్నా... వాటికి ఏమాత్రం తగ్గకుండా విన్నర్స్ కూడా కొడుతుండటంతో ఒస్టాపెంకో విజయావకాశాలకు ఊపిరి వచ్చింది. తొలి సెట్లో ఓడి, రెండో సెట్లో 0–3తో వెనుకబడిన దశలో ఒస్టాపెంకో విజృంభించింది. హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు తన సర్వీస్‌లను కాపాడుకొని స్కోరును 3–3తో సమం చేసింది. పదో గేమ్‌లో హలెప్ సర్వీస్‌ను మరోసారి ఒస్టాపెంకో బ్రేక్ చేసి రెండో సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో ఒస్టాపెంకో 1–3తో వెనుకబడింది. కానీ మళ్లీ పోరాడిన ఒస్టాపెంకో వరుసగా ఐదు గేమ్‌లను గెలిచి హలెప్ ఆశలను ఆవిరిచేసింది. తన కెరీర్లోనే చిరస్మరణీయ ఘట్టాన్ని ఆవిష్కరించుకుంది. నా కల నెరవేరింది. ఈ విజయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. దానికి మరికొంత సమయం పడుతుందేమో. బంతిని బలంగా బాదగల నైపుణ్యం నాకు మొదటి నుంచి ఉంది. టోర్నీలో నా షాట్లన్నీ బాగా పనిచేశాయి. మ్యాచ్‌కు పది నిమిషాల ముందు మినహా ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. ఫైనల్‌కు ముందు రాత్రి కూడా ప్రశాంతంగా పడుకున్నాను. రెండో సెట్లో వెనుకబడిన దశలో ఇక పోయేదేమీ లేదు, ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాను. ఫైనల్ చేరిన సంతృప్తి ఉంది కాబట్టి చివరి వరకు పోరాడాలని మాత్రం భావించాను. దూకుడుగా ఆడటంతో మ్యాచ్ నా వైపు తిరిగింది. కుయెర్టన్ గెలిచిన రోజే నేను పుట్టడం అదృష్టం కావచ్చేమో. నాకు గ్రాస్‌కోర్టు అంటే ఇష్టం. ఇక వింబుల్డన్ సాధించడంపైనే దృష్టి. –ఒస్టాపెంకో ఆమె బంతిని చాలా బలంగా కొట్టసాగింది. ఒక దశలో నేను ప్రేక్షకురాలిగా మారిపోయాను. గెలిచేందుకు ఒస్టాపెంకో అన్ని విధాలా అర్హురాలు. నాకు సంబంధించి ఇది వేదనాభరిత క్షణం. అయితే కాలం సాగిన కొద్దీ ఆ బాధ తగ్గుతుందని ఆశిస్తున్నా. భవిష్యత్‌లో నాకు ఏం రాసిపెట్టి ఉందో చూద్దాం. –హలెప్ ఒస్టాపెంకో విజయం విశేషాలు ⇔ 1933లో మార్గరెట్ స్క్రివెన్ వివియన్ (బ్రిటన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు. ⇔ 2001లో జెన్నిఫర్ కాప్రియాటి (అమెరికా) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తొలి సెట్లో ఓడిపోయాక కూడా టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా ఘనత. ⇔ 1997లో ఇవా మయోలీ (క్రొయేషియా–19 ఏళ్ల 300 రోజులు) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్... 2006లో మరియా షరపోవా (యూఎస్ ఓపెన్–19 ఏళ్ల 77 రోజులు) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో పిన్న వయస్కురాలిగా గుర్తింపు. ⇔ కెరీర్లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీని గెలుచుకున్న మూడో ప్లేయర్. మహిళల విభాగంలో బార్బరా జోర్డాన్ (1979 ఆస్ట్రేలియన్ ఓపెన్) ముందుగా ఈ రికార్డు నెలకొల్పగా... 1997 జూన్ 8న గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్) కూడా దానిని సాధించాడు. అదే రోజు పుట్టిన ఒస్టాపెంకో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకోవడం విశేషం. ⇔ కేవలం 20 లక్షల జనాభా ఉన్న యూరోపియన్ దేశం లాత్వియా నుంచి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు. నాదల్ @ వావ్రింకా నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ సా. గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం