శశికళ ప్రమాణంపై సందిగ్ధత
ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లిన గవర్నర్ విద్యాసాగరరావు
► న్యాయ సలహా తీసుకోవడానికేనన్న మహారాష్ట్ర రాజ్‌భవన్ వర్గాలు
► శశికళ ప్రమాణాన్ని అడ్డుకోవాలని సుప్రీంను ఆశ్రయించిన ఎన్ జీఓ
► ప్రమాణ స్వీకారానికి ముస్తాబైన మద్రాస్ యూనివర్సిటీ
సాక్షి ప్రతినిధి, చెన్నై/ముంబై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు గంట గంటకు మారుతున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణం స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. మంగళవారం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన మహారాష్ట్ర, తమిళనాడు ఉమ్మడి గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు సోమవారం ఢిల్లీ వెళ్లి.. అక్కడి నుంచి చెన్నై రాకుండా ముంబై వెళ్లిపోవడంతో శశికళ ప్రమాణం స్వీకారం వాయిదా పడుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. శశికళతో ప్రమాణం చేయించే విషయంలో న్యాయ సలహా తీసుకోవడానికి గవర్నర్ ఢిల్లీ వెళ్లినట్లు మహారాష్ట్ర రాజ్‌భవన్ వర్గాలు చెప్పాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ కూడా నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో వారంలోగా తీర్పునిస్తామని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో గవర్నర్ ఏమి చేయబోతున్నారు అనే విషయంపై అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. ఒక వేళ శశికళతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత.. ఆ కేసులో ఆమె దోషిగా సుప్రీం తీర్పు ఇస్తే ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం పరిణామాల్లో బీజేపీ హస్తం ఉందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల్లో భాగం గా వ్యూహాత్మకంగానే శశికళ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తున్నారనే వారు విశ్లేషిస్తున్నారు.
మరోపక్క సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని చెన్నైకు చెందిన ఓ ఎన్జీఓ సంస్థ సుప్రీంకోర్టును పిల్ ద్వారా ఆశ్రయించింది. ఈ పిల్‌ను మంగళవారం సుప్రీం కోర్టు విచారించనుంది. ఇంకోపక్క శశికళ ప్రమాణ స్వీకారం చేయడానికి నిర్ణయించిన మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియాన్ని వేగంగా ముస్తాబు చేస్తున్నారు. ఇక్కడే జయలలిత కూడా ప్రమా ణ స్వీకారం చేశారు. ఇక సీఎం పన్నీర్ సెల్వం ఇచ్చిన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.
(చదవండి: సీఎంగా శశికళ ప్రమాణాన్ని అడ్డుకోండి)
ఏ పదవీ వద్దు: పన్నీర్ సెల్వం
సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కొనసాగాల్సిందిగా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. శశికళపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పన్నీర్‌సెల్వం నియోజకవర్గం ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇదిలా ఉండగా సీఎం పదవిని కోల్పోయిన పన్నీర్‌సెల్వం తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు సన్నిహితులతో తెలిపారని సమాచారం. శశికళ నేతృత్వంలోని ప్రభుత్వంలో తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకునేది లేదని పన్నీర్‌సెల్వం కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. కాగా, ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు శశికళ సిద్ధమవుతున్నారని సమాచారం. గవర్నర్ రాగానే కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత పోటీ చేయడానికి నియోజకవర్గాలను ఆమె అన్వేషిస్తున్నా రు. జయ ప్రాతినిధ్యం వహించిన చెన్నై ఆర్కేనగర్లో శశికళపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
(జయలలిత మృతిపై అపోలో సంచలన ప్రకటన)