గ్రేటర్ పరిధిలో ఆడ మగ కాని ఓటర్లు 651
హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘కొత్తతరం ఓటర్లతో పాటు కొత్తరకం’ ఓటర్లు కూడా పాల్గొనబోతున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడంలో భాగంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటుహక్కు కల్పించాలని ఎన్నికల కమిషన్ భావించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా కొత్తతరం యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ఎన్నికల కమిషన్ స్పెషల్ డ్రైవ్‌లతో పాటు ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. విస్తృత ప్రచారం నిర్వహించింది. గతానికి భిన్నంగా ఈసారి ‘ఇతరులు’ కేటగిరి కింద కొత్తరకం వ్యక్తులకు కూడా ఓటర్ల జాబితాలో చోటు లభించింది. స్త్రీలు, పురుషులే కాకుండా ఇతరులు కేటగిరీలో ‘గే’లు కూడా పలువురు తమ ఓట్లు నమోదు చేసుకున్నారు.
గ్రేటర్ పరిధిలో ఆడ, మగ కాని ఈ తరహా ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 651 ఉంది. ఓట్ల నమోదుకు ఇంకా సమయం ఉన్నందున ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లోనైనా గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే అవకాశం ఈ ‘ఇతరుల’కు లేకపోలేదు. హైదరాబాద్ జిల్లాలో కంటే గ్రేటర్ శివారు నియోజకవర్గాల్లోనే ఈ ఇతరుల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. గ్రేటర్ పరిధిలో వీరు అత్యధికంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో (88 మంది) ఉండగా.. ఎల్బీనగర్లో 67, శేరిలింగంపల్లిలో 65 మంది ఉన్నారు. యాకుత్‌పురలో అతితక్కువగా (ఎనిమిది మంది) ఉన్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. మరి వీరి ఓటు ఎటువైపు అన్నది అతి త్వరలో తేలనుంది.