ఇలా అయితే.. రాజీనామా చేస్తా
ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.సురేశ్ కుమార్
♦ మేం ఆత్మహత్య చేసుకుంటాం.. ఆత్మాహుతి దాడికి పాల్పడతాం
♦ పలు విద్యార్థి సంఘాల నేతల ఆగ్రహం
♦ ఓయూలో పీహెచ్డీ ప్రవేశ కటాఫ్ మార్కులపై తీవ్ర వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: పీహెచ్డీ ప్రవేశ కటాఫ్ మార్కుల తగ్గింపు విషయంపై ఓయూ గెస్ట్‌హౌజ్ బుధవారం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు, రిజిస్ట్రార్ మధ్య మాటలు తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి.
ఓయూకి దేశంలో మొదటి స్థానం లభించిన సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఎంఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, బీఎస్ఎఫ్ వం టి సంఘాల విద్యార్థులు గెస్ట్‌హౌజ్‌లోకి దూసుకొ చ్చి ఆవేశంగా మాట్లాడారు. ‘మాకు పీహెచ్డీ ప్రవేశాల్లో అన్యాయం జరుగుతోంది. మేం ఆర్ట్స్ కళాశాల ముందు ఆత్మహత్యలకు పాల్పడుతాం. అవసరమైతే ఆత్మాహుతి దాడి చేస్తాం. భౌతిక దాడులకూ పాల్పడుతాం’ అనడంతో రిజిస్ట్రార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. విద్యార్థుల బెదిరింపులు చెల్లవని.. అవసరమైతే రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు.
ఆవేదనతో మాట్లాడుతున్నాం: ‘ఆవేదనతో మాట్లాడుతున్నాం. మా జీవితాలు నాశనం అవుతున్నాయ్. ఒక రిజిస్ట్రార్ డిప్యూటీ సీఎంను తప్పుదోవ పట్టించొచ్చా? ఒక డీన్ రిజైన్ చేస్తానన్నాడంటా? మరో ముగ్గురు లైన్లో ఉన్నారంటా? వారెవరో చెప్పాలి?’ అని విద్యార్థులు ప్రశ్నించారు.
కటాఫ్ తగ్గినందునే పలువురి అర్హత..
‘మీరు ఇచ్చిన వినతి పత్రంపై స్టాండింగ్ కమిటీలో వివిధ స్థాయిల్లో చర్చ జరిగింది. అందుకే ఎస్సీ, ఎస్టీలకు 40 నుంచి 30 మార్కులకు తగ్గించాం. ఇలా చేస్తేనే కొంత మంది అర్హత సాధించారు’ అని అన్నారు. తర్వాత విద్యార్థులు మాటలు వెనక్కి తీసుకుని రిజిస్ట్రార్‌కు క్షమాపణ చెప్పారు. ‘ డిప్యూటీ సీఎం, ఇన్‌ఛార్జి వీసీ వద్దే తేల్చుకుందాం.. రండీ’ అని విద్యార్థులను రిజిస్ట్రార్ ఆహ్వానించారు. దీంతో గొడవ అక్కడితో ముగిసింది