నేడు కర్నూలుకు ముఖ్యమంత్రి రాక
c అగ్రికల్చర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శుక్రవారం కర్నూలుకు రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పకడ్బందీగా పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడు మిషన్లలో రెండవదైన సోషల్ ఎంపవర్మెంట్ మిషన్‌ను ముఖ్యమంత్రి కర్నూలులోని ఔట్‌డోర్ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా పొదుపు మహిళలు తదితరులతో అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉదయం 10.45 గంటలకు కర్నూలు ఎస్ఏపీ క్యాంపులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 12.45 గంటల వరకు ఔట్‌డోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
1.10 గంటలకు కర్నూలు నుంచి హెలిక్యాప్టర్ ద్వారా వైఎస్సార్ జిల్లా గండికోట ప్రాజెక్టుకు వెళతారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తదితరులు పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ, జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్ గౌడ్ తదితరులు పర్యవేక్షించారు. బహిరంగ సభకు 8 వేల మంది పొదుపు మహిళలను తరలిస్తున్నారు.