డొక్కు డబ్బాలు
కడప అర్బన్:
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిల్లో మొత్తం 577 ఆర్టీసీ బస్సులు, 296 అద్దె బస్సులను నడుపుతున్నారు. ఈ సర్వీస్‌ల ద్వారా ప్రతి రోజూ 3.60 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. ఈ బస్సుల్లో లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళుతున్నారు. తద్వారా రోజుకు గతంలో దాదాపు కోటి రూపాయలు సీజన్లోనూ, ప్రస్తుతం రూ. 86 లక్షల మేరకు ఆదాయం వస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా తాము ఒకచోటి నుంచి మరోచోటికి ప్రయాణాలు కొనసాగించేందుకు ఆర్టీసీ బస్సులనే తమ ప్రయాణ సాధనాలుగా ఉపయోగించుకుంటున్నారు.
ప్రయాణికుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆర్టీసీ సంస్థ నిర్లక్ష్యం చూపిస్తోంది. డొక్కు బస్సులనే రోడ్డెక్కిస్తూ ప్రయాణికులతో చెలగాటమాడుతున్నారు. చిన్న, చిన్న పరికరాలు సైతం కొనలేని పరిస్థితుల్లో అధికారుల డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువగా మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు డిపోలు డొక్కు బస్సులకు పెట్టిందిపేరుగా మారాయి. ఆ డిపోల పరిధిలో ఎక్కువగా కాలంచెల్లిన బస్సులు నడుస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో డిపోలు : 8
మొత్తం బస్సులు : 873
ఆర్టీసీ బస్సులు: 577
కాలం చెల్లినవి : 160 వరకు
అద్దె బస్సులు: 296
కాలం చెల్లినా కొనసాగిస్తూ..
– కాలం చెల్లిన బస్సులు ఆర్టీసీ నిబంధనల మేరకు 10.5 లక్షల కిలోమీటర్లు తిరిగితే పరిగణిస్తారు.
– సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ లాంటి ప్రత్యేక కేటగిరీ బస్సులు 6లక్షల కిలోమీటర్లు తిరిగితే వాటిని ఆర్డినరీలుగా మార్పు చేస్తారు.
– ఈ రకం బస్సులను తయారు చేసేందుకు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా జోనల్ వర్క్ షాపులను ఏర్పాటు చేశారు.
– నిబంధనలను డిపో మేనేజర్స్ బేఖాతరు చేస్తూ తమ పరిధిలో 6– 10.6 లక్షల కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ సర్వీస్‌లను అలాగే నడుపుతున్నారు. ప్రస్తుతం కడప రీజనల్ పరిధిలో దాదాపు 12–13 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను కూడా అలాగే నడుపుతున్నారు.
– దాదాపు 30 శాతం ఆర్టీసీ బస్సుల్లో 160బస్సులకు పైగా కాలం చెల్లిన బస్సులు ఇప్పటికీ తిరుగుతున్నాయి.
మొన్నటికి మొన్న..
– గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో రెండు నెలల క్రితం బెంగళూరు నుంచి కడపకు వచ్చిన ఆర్టీసీ బస్సు మూడవ మలుపు వద్దకు రాగానే బ్రేక్ సరిగా పడకపోవడంతో అదుపుతప్పి లోయలోకి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో కండక్టర్ జివి రత్నం, పోలీసు కానిస్టేబుల్ గోపినాథ్ రెడ్డి అలియాస్ గోపి మృతిచెందారు. వీరు ప్రాణాలు కోల్పోవడమేగాక వారి కుటుంబాలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయి.
బస్సుల సర్వీస్‌లు బాగుపడాలంటే ఎంవీ చట్టం ప్రకారం మూడు గంటల పాటు నిర్వహణ సమయంను కేటాయించాల్సి వుంటుంది.
– పై నిబంధన ప్రకారం నిర్వహణ చేయకుండానే దూర ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులను డిపోలోకి రాగానే వెంటనే డీజిల్ పట్టించి మరలా సర్వీస్‌లకు పంపుతున్న వైఖరి మారాలి.
– చాలా బస్సులకు నిర్వహణ చేసే సమయం లేకపోవడం వలన, డ్యూటీల సమయం ఎక్కువ కావడం వలన కార్మికులకు అలాగే బస్సులను ఇవ్వడం వలన కూడా రోజురోజుకు బస్సుల పరిస్థితి అధ్వానంగా తయారైంది.
– అన్నింటిలో పోటీపడుతున్న ఆర్టీసీ ప్రైవేట్ బస్సులకు దీటుగా నిర్వహణ చేస్తే ఆదరణ పెరుగుతుంది లేకపోతే ప్రత్యామ్నాయ వ్యవస్థ బలపడుతుంది.
– ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో సగానికి పైగా అద్దె బస్సులే ఎక్కువ కావడం ఆర్టీసీ సంస్థ మనుగడకే ప్రమాదం పొంచి ఉందనీ తెలుస్తోంది.
అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే అభివృద్ధి సాధ్యం కాదు
కడప రీజనల్ పరిధిలో బస్సుల నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎన్నో సార్లు దూర ప్రాంతాల నుంచి వస్తున్న బస్సుల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ప్రాణ నష్టాలు తప్పడం లేదు. ప్రైవేట్ బస్సుల్లో నిర్వహణ కంటే ఆర్టీసీ బస్సుల్లో మెరుగైతే ప్రయాణికుల ఆదరణ పెరుగుతుంది. కార్మికునికి పనిభారం పెంచడం వలన విశ్రాంతి లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నారు.
– కేకే కుమార్, కండక్టర్, ఎంప్లాయీస్ యూనియన్ కడప జోనల్ అ«ధ్యక్షుడు
గ్యారేజీలో పరికరాల కొరత ఉంది
బస్సుల నిర్వహణలో ప్రధానంగా కనిపిస్తోంది. చిన్నపాటి వస్తువు లేకపోయినా ఆ వస్తువు కొనేందుకు అధికారులు రోజుల తరబడి కాలం వృధా చేస్తున్నారు. పరికరాలు అంతంత మాత్రమే వున్నాయి. మెకానిక్‌లకు పనిభారం పెంచుతున్నారు.
– పురుషోత్తం, గ్యారేజీ మెకానిక్, కార్మిక పరిషత్ రీజనల్ సెక్రటరీ
నిర్వహణకు సమయాన్ని కేటాయించాలి
ఆర్టీసీ బస్సుల నిర్వహణ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే బస్సుల సామర్థ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. అధికారులు ఎప్పటికపుడు బస్సులను పర్యవేక్షించి అవసరమైన మేరకు కాలం చెల్లిన వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి.
– ప్రకాశం, రిటైర్డ్ డ్రైవర్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రీజనల్ అధ్యక్షుడు, కడప.