పెట్రోల్ బంక్‌ను ఖాళీ చేయండి
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను ఆదేశించిన హైకోర్ట
వరంగల్ లీగల్ : చట్టబద్దమైన అగ్రిమెంట్ లేకుండా భూయజమానుల స్థలాన్ని వినియోగించుకోవడం సరికాదని, మూడు నెలల్లో పెట్రోల్‌బంక్ ఖాళీ చేసి స్థలాన్ని యజమానులకు అప్పగించాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై నెలకొల్పిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవుట్లెట్ పెట్రోల్ బంక్ 1973 నుంచి కొనసాగుతుంది. 20 ఏళ్లకు లీజు అగ్రిమెంటును స్థల యజమానురాలు వినోదరెడ్డితో కార్పొరేషన్ వారు కుదుర్చుకున్నారు. మొదటి ఐదేళ్లకు నెలకు 180 రూపాయలు అద్దె, మరో ఐదేళ్ల సమయానికి నెలకు రూ.200, చివరి 10 సంవత్సరాల కాలానికి నెలకు రూ.235 అద్దె చెల్లించేలా లీజు అగ్రిమెంట్ చేసుకున్నారు. కార్పొరేషన్ వారు ఒప్పందం మేరకు అద్దెలు చెల్లించడం లేదని, వారు స్థలాన్ని ఖాళీ చేయమని గతంలో కోర్టులో దావా వేసింది. కానీ అగ్రిమెంట్ కాలం మధ్యలో ఖాళీ చేయమని చెప్పడం సరికాదని అప్పట్లో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 20 ఏళ్ల కాలపరిమితి 1992 వరకు ముగిసినా ఆయిల్ కార్పొరేషన్ వారు ఖాళీ చేయలేదు. యజమానురాలు మృతిచెందడంతో ఆమె కుమారుడు వారసుడిగా దావాలో చేరాడు.
లీజు స్థల విస్తీర్ణం 1135 గజాలకు తక్కువగా నెలకు రూ.235 చెల్లించడం సరికాదని, అదే ఆయిల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఇతర బంకులకు నెలకు రూ.30 వేల నుంచి 40 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారని, ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా 21 సంవత్సరాలుగా అక్రమంగా స్థలాన్ని వినియోగించుకుంటున్నారని యజమానులు కోర్టును ఆశ్రయించగా, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వరంగల్ వారు ఖాళీ చేయమని గతంలో తీర్పు ఇచ్చారు. దీంతో ప్రతివాది అయిన ఆయిల్ కార్పొరేషన్ వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు జడ్జి జస్టిస్ ఆర్. కాంతారావు న్యాయపరమైన విషయాలు విచారించి ఎలాంటి అగ్రిమెంటు లేకుండా కొనసాగడం న్యాయబద్దమైనది కాదని తీర్పు ఇచ్చారు. మూడు నెలల్లో పెట్రోల్ బంకు ఖాళీ చేసి స్థలాన్ని యజమానులకు ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు.