ఎనభై కేసులు..రూ.4.53 లక్షల కోట్ల బకాయిలు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నులకు సంబంధించి కేంద్రానికి రావాల్సిన బకాయిల విలువ సుమారు రూ.4.53 లక్షల కోట్లకు చేరింది. ఇందులో వెయ్యికోట్లకు పైగా బకాయి పడ్డ సంస్థల్లో మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకుచెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, టాటా గ్రూపునకు చెందిన టాటా మెటార్స్ లాంటి దిగ్గజ కంపెనీలు న్నాయి. ఈ మేరకు శుక్రవారం పార్లమెంటు లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నాటికి రూ.1,000 కోట్లు, అంతకంటే అధిక మొత్తంలో బకాయి పడిన కేసుల సంఖ్య 80కి చేరుకుందని గంగ్వార్ తెలిపారు. మొత్తం ఎనభై కేసుల్లో వసూలు కావాల్సిన బకాయిలు రూ.4.53 లక్షల కోట్లని ఆయన వెల్లడించారు.
ముఖ్యంగా బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్‌మాల్యా చెల్లించాల్సిన పన్ను బకాయిలు జరిమానా వెయ్యికోట్లకు చేరాయి. ఇప్పటికే బ్యాంకులకు తొమ్మిదివేల కోట్లకు పైగా బకాయి పడ్డ మాల్యా పన్ను చెల్లింపుల విషయంలోనూ వేల కోట్లను మించిపోయారు. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చెల్లించాల్సిన సేవాపన్ను, జరిమానా కలిపి రూ. 1,012.96 కోట్లకు చేరిందని తెలిపారు. కింగ్‌ఫిషర్, టాటా మోటార్ సహా మొత్తం నాలుగు సంస్థలు రూ.1,000 కోట్ల కంటే అధిక మొత్తంలో పరోక్ష పన్ను బకాయి చెల్లించాల్సి ఉందని ఆయన పార్లమెంట్‌కు తెలిపారు.
టాటా గ్రూపునకు చెందిన వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ రూ.1,145.85 కోట్ల పన్ను బకాయి పడింది. అందులో రూ.629.76 కోట్లు ఎక్సైజ్ డ్యూటీ కాగా.. మిగతా రూ.516.09 కోట్లు సేవా పన్ను బకాయిగా ఉన్నాయి. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు రూ.2,590 కోట్లు, కర్ణాటక హౌసింగ్ బోర్డు రూ.1,083 కోట్ల పరోక్ష పన్నులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. అయితే ఐటీ చట్టంలో సెక్షన్ 138, 1961 ప్రకారం ఎవరెవరు ఎంతెంత బకాయి పడ్డారన్న విషయాన్ని వెల్లడించలేమని గంగ్వార్ సభకు చెప్పారు.