Overloading
-
రోడ్డున పడ్డ భద్రత!
ఓవర్ స్పీడ్‌కు కళ్లెం ఏది? - రాష్ట్రంలోని ముంబై,విజయవాడ(65), బెంగళూర్ (44), భూపాలపట్నం (163) జాతీయ రహదారులపై వాహనాలు మితి మీరిన వేగంతో దూసుకెళుతున్నాయి. కార్లు గంటకు 90–120 కి.మీ., ప్రైవేటు లారీలు, బస్సులు 120 కి.మీ. నుంచి 150 కి.మీ. వేగంతో వెళుతున్నాయి. ఈ రహదారులపై స్పీడ్‌కు ఎలాంటి కళ్లెం లేదు. స్పీడ్గన్లు లేవు. - ఆయా రహదారులపై గూడ్స్ వాహ నాలు పలువురు ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్నాయి. వీటిని పోలీసులు, ఆర్టీఏ అధికారులు అడ్డుకోవడంలేదు. తూతూ మంత్రంగా జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తేనే! మామూలు జరిమానాలను ఎవరూ పెద్దగా ఖాతరుచేయడంలేదు. ఓవర్‌స్పీడ్ విభాగం లోనే గత ఆరునెలల్లో ఏకంగా రూ.46 కోట్ల జరిమానాలు వసూలు చేశారు. ఓవర్లోడిం గ్‌కు రూ.2కోట్లకు పైగా జరిమానా విధించారు. అయినా ఇలాంటి డ్రైవర్లలో మార్పు రావడం లేదు. ఇంతకాలం ఓవర్‌స్పీడ్‌కు కేవలం రూ.400 మాత్రమే జరిమానా విధించేవారు. కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వస్తే రూ.1000తోపాటు వాహనంలో ఎంతమంది ఉంటే అన్ని రూ.2000 చెల్లించాలి. అప్పుడుగానీ కాస్త మార్పు రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనుమతులు లేని వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం. వాటిలోనే కూలీలు ప్రయాణిస్తున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగి కూలీలు మరణించినా వారి కుటుంబాలకు పరిహారం దక్కదు. అలాంటి వాహనాలు ఎక్కడమే చట్టవిరుద్ధమైనపుడు వాటి వల్ల ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలకు కోర్టులు న్యాయం చేయవు. – ఆటో అండ్ మోటార్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ - ఇటీవల మహబూబ్‌నగర్‌జిల్లా మిడ్చిల్ మండలం కొత్తపల్లి వద్ద ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో 13 మంది చనిపోయారు. - గతేడాది జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద 100 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కందకంలో పడి 60 మంది ప్రాణాలు కోల్పోయారు. - ఓవర్‌లోడ్ వాహనాలపై పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వల్లే ఈ రెండు ప్రమాదాల్లో భారీగా ప్రాణనష్టం జరిగిందని రోడ్డు భద్రతా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రోడ్డుభద్రత ‘నేతి బీరలో నెయ్యి చందం’ అయింది. భద్రతకు భరోసా లేకుండా పోయింది. ఓవర్‌లోడ్, ఓవర్‌స్పీడ్ వాహనాలకు కళ్లెం వేసేనాథుడు లేడు. ఆర్అండ్ బీ, ఆర్టీఏ శాఖలు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తు న్నాయి. ఫలితంగా రహదారులు రక్తధారలుగా మారుతున్నాయి. పెద్దసంఖ్యలో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ -
అ‘గమ్య’ గోచరం
చుంచుపల్లి : ‘4 ఇన్ ఆల్’.. ‘పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు’.. ఆటోలు, ఇతర వాహనాల రిజిస్ట్రేషన్ సందర్భంగా రవాణా శాఖ అధికారులు విధించే నిబంధనలు ఇవీ. కానీ ఇవి రాతలకు మాత్రమే. ప్రైవేటు వాహనదారులు లాభాపేక్షతో ఇష్టారాజ్యంగా ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. పరిమితికి మించి ప్రయాణికులతో పాటు మితిమీరిన వేగం.. ఇలా జిల్లాలో నిత్యం పలు ప్రమాదాలు జరుగుతున్నా.. రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఆటోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజల అవసరాల మేరకు ఆర్టీసీ బస్సులు నడపకపోవడం, ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించాల్సి వస్తోంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే కూలీలు.. ఇలా అన్ని వర్గాల వారికీ ఆటోలే దిక్కుగా మారాయి. జిల్లాలోని అనేక గ్రామాలకు రోడ్లు సరిగా లేవనే సాకుతో అధికారులు ఆర్టీసీ బస్సులు నడపటం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలు ఎక్కి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. జిల్లాలో రవాణా పరిస్థితి ఇదీ.. జిల్లాలో 205 గ్రామ పంచాయతీలు, వీటి పరిధిలో 1,321 ఆవాస గ్రామాలు ఉన్నాయి. వీటిలో జిల్లాలో 411 గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రోడ్లు సక్రమంగానే ఉన్నా.. తమ గ్రామాలకు బస్సు రావడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల పరిధిలో 289 ఆర్టీసీ బస్సులున్నాయి. వీటి ద్వారా నిత్యం 1.02 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో 30 నుంచి 40 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13, 330 ఆటోలు, 1,461 ట్రాలీ ఆటోలు, 6,704 కార్లు, 69 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఈ వాహనాల్లో ఎక్కువ శాతం పర్మిట్ నిబంధనలను అతిక్రమిస్తున్నవే కావడం గమనార్హం. ఆటోల్లో అయితే పరిస్థితి మరీ దారుణం. వివిధ కంపెనీలు తయారు చేసిన వాహనాలకు అదనంగా సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో పాటు అతి వేగంతో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. ఆటోల్లో 10 మందికి పైగానే... నిబంధనల ప్రకారం ఆటోలో డ్రైవర్‌తో కలిపి నలుగురు మాత్రమే ప్రయాణించాలి. కానీ ఏ ఆటో చూసినా 10 – 15 మంది వరకు కుక్కేస్తున్నారు. ఎక్కువ మంది కూర్చునేలా అదనపు సీట్లు ఏర్పాటుచేస్తున్నారు. సకాలంలో బస్సులు రాకపోవడంతో వేచి చూసి, విసిగి వేసారుతున్న ప్రయాణికులు త్వరగా గమ్యం చేరాలనే హడావిడిలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పలు గ్రామాలకు బస్సులే లేకపోగా, మారుమూల గ్రామాలకు ఉదయం ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు మాత్రమే నడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలే శరణ్యం అవుతున్నాయి. ప్రజల్లో మార్పు రావాలి ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. అయితే మానవతా ధృక్పథంతో పూర్తిస్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టలేకపోతున్నాం. ఈ విషయమై అనేక సార్లు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. ప్రధానంగా ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రైవేటు వాహనాల వల్ల జరిగే ప్రమాదాల విషయంలో భయం ఏర్పడాలి. ప్రాణం చాలా విలువైనది. దానిని గమనించి ప్రతి ఒక్కరు సురక్షితమైన ప్రయాణాన్ని చూసుకోవాలి. జిల్లాలోని ప్రైవేటు వాహనాల డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించేలా చర్యలు చేపడతాం. – బి.కృష్ణారెడ్డి, రవాణా శాఖాధికారి చీకటే మిగిలింది.. బూర్గంపాడు మండల కేంద్రానికి చెందిన రావులపల్లి నర్సింహారావు(38) జనవరి 14న నాగినేనిప్రోలు రెడ్డిపాలెం బస్టాప్ మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మోటార్‌సైకిల్‌పై వస్తున్న నర్సింహారావు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబం దిక్కులేనిదైంది. తాపీపనులు చేస్తూ భార్యాపిల్లలతో సంతోషంగా గడిపై నర్సింహారావు మరణంతో ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆయన భార్య స్వప్న కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇద్దరు కుమార్తెలు సంధ్య, నందినిని చదివిస్తోంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని ఆమె కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తన భర్త ఉన్నప్పుడు పిల్లలు ఏదడిగినా తెచ్చిపెట్టేవారని, ఇప్పుడు చాలా కష్టమవుతోందని స్వప్న రోదిస్తోంది. ప్రమాదం జరిగి రెండున్నర నెలలు కావస్తున్నా తనకు ఎలాంటి పరిహారమందలేదని చెపుతోంది. -
ఇసుక రేట్లు షాక్ కొడుతున్నాయి
ఎక్కడ చూసినా మాఫియా దోపిడీ చేస్తోంది చంద్రబాబు పాలనలో ఇసుక ధరలు షాక్ కొడుతున్నాయని, రేట్లు మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా పెరిగాయని, పది నెలల క్రితం ఒక లారీ లోడు ఇసుక వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఉంటే.. ఇపుడు రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకూ ఉందని జగన్ విమర్శించారు. (అక్రమ రవాణాకు సంబంధించి ఈనాడులో ప్రచురితమైన వార్తలను జగన్ చూపిస్తూ) ‘‘ఒక రోజు ‘32 ఇసుక లారీల పట్టివేత, అన్నింటా నిబంధనల అతిక్రమణ, పశ్చిమ గోదావరిలో ఇసుక అక్రమ రవాణా’ - ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. ఇసుక మాఫియా చేస్తున్న అక్రమాలు ప్రధానంగా మూడు రకాలుగా ఉన్నాయన్నారు. మీ సేవ ద్వారా తీసుకున్న ఒకే డీడీని మళ్లీ మళ్లీ ఉపయోగించి లాగ్‌బుక్స్‌లో ఎంట్రీలు వేస్తూ దారుణంగా మోసం చేస్తున్నారు. ఇక లారీల్లో ఓవర్లోడింగ్ చేస్తున్నారు. ఇసుక రేట్లకు సంబంధించి ఒక ఉదాహరణ చెబుతా. నేను విశాఖపట్నంలో ఒక లారీ లోడు ఇసుక ధరెంత? అని అడిగితే రూ. 39,000 అని చెప్పారు. ఒక ట్రాక్టర్లో రెండున్నర క్యూబిక్ మీటర్ల ఇసుక పడుతుంది. ఒక క్యూబిక్ మీటరు అంటే దాని బరువు 1.69 టన్నులు. ఆ ప్రకారం ఒక ట్రాక్టర్లో 4.22 టన్నుల నుంచి 5 టన్నుల ఇసుక పడుతుంది. ఇక ఒక లారీ అంటే కనీసం మూడు ట్రాక్టర్లకు సమానం. ఒక లారీలో మూడింతలు ట్రాక్లర్ల ఇసుక పడుతుందంటే దాని పరిమాణం సుమారు 13 టన్నులుగా ఉంటుంది. అంటే దాని రేటు రూ. 39,000 అవుతుంది. దానర్థం ఒక కేజీ ఇసుక ధర మూడు రూపాయలన్నమాట. సబ్సిడీ బియ్యం కేజీ ఒక రూపాయి ధరకు లభిస్తుంటే.. విశాఖలో ఇసుక ధర మాత్రం కేజీ మూడు రూపాయలు!’’ అని వివరించారు. -
జంతుహింస.. నేరం
మంచిర్యాల రూరల్ : మానవ ప్రయోజనం కోసం పశువులు, జంతువులకు అనవసరమైన నొప్పి, బాధను కలిగించడాన్ని నిరోధించేందుకు జంతువులపై క్రూరత్వ నివారణ/నిరోధక చట్టం రూపొందింది. దీనిపై అవగాహన లేకుం డా కొందరు రైతులు, జంతు వ్యాపారులు ఇష్టారీతిన పశువులు, జంతువులను హింసకు గురిచేస్తుంటారు. పశువులు, జంతువులపై క్రూరంగా ప్రవర్తిస్తే వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పశువులను ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంచిర్యాల ఏడీఏ కుమారస్వామి వివరించారు. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేసేందుకు గత నెలలో కలెక్టర్ సమక్షంలో సమావేశం నిర్వహించారు. ప్రతీ రెవెన్యూ డివిజన్లో చట్టం అమలుకు కమిటీలు ఉన్నాయి. మండల స్థాయిలోనూ కమిటీలు పనిచేస్తున్నాయి. వీటిలో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, అటవీశాఖ, మున్సిపల్ ఇలా 12 నుంచి 20 శాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారు. కమిటీల పనితీరు పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. చట్టంలోని ముఖ్యాంశాలు.. జంతువులపై క్రూరత్వ నివారణ/నిరోధక చట్టం 1960 అనుసరించి ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ఓవర్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, అధికంగా కొట్టడం, చిత్రహింస లు వంటి అనవసరమైన నొప్పిని కలిగించే ప్రతీ చర్యను క్రూరత్వంగా పరిగణిస్తారు. చిన్న వయస్సులో ఉన్న వాటిని గానీ, వ్యాధి బారిన పడిన పశువులు, జంతువులను గానీ పనులకు ఉపయోగించరాదు. అవసరం కోసం లేదా కావాలని శరీరానికి హాని కలిగించే మందులు, పదార్థాలను జంతువులకు ఇవ్వకూడదు. పశువులను ఒకచోట నుంచి మరో చోటకు తరలిస్తున్నప్పుడు వాటికి నొప్పి కలిగించకూడదు. ఇరుకుగా ఉన్న వాహనంలో, స్థాయికంటే ఎక్కువగా ఉన్న వాహనంలో ఎక్కువ పశువులను తరలించడం నేరం. జంతువులను దాని శరీర ఆకారానికి తగ్గట్లు పంజరం, భాండాగారంలో ఉంచడం సరైన పద్ధతి. అలా కాకుండా ఇరుకుగా ఉండి, దాని కదలికలు కూడా చేయలేని వాటిలో ఉంచడం నేరం. పశువులు, జంతువులను అనవసరంగా భారీ గొలుసులతో ఎక్కువ సమయంపాటు కట్టేసి ఉంచడం నేరం. చిత్రహింసలకు గురిచేయడం, చంపడం, పోరాటానికి ఎరగా వాడడం నిషేధం. అడవుల్లో వన్యప్రాణులను వేటాడం, ఆటవిడుపుగా వన్యప్రాణులను చంపడం నేరం. నేరం, శిక్షలు.. జంతువులను చంపడం, చిత్రహింసలకు గురిచేయడం, ఆటవిడుపుగా హేళన చేయడం వంటి నేరాలకు పాల్పడితే సెక్షన్1(ఏ) ప్రకారం జరిమానా విధిస్తారు. ఒకవేళ జరిమానా విధించిన తర్వాత మూడేళ్లలో మరోసారి ఇలాంటి తప్పు చేస్తే జరిమానాతోపాటు మూడు నెలల శిక్ష విధిస్తారు. ఈ నేరాలకు గల కారణాలను నాన్ కాగ్నిజేబుల్గా పరిగణిస్తారు. పట్టుబడ్డ వారిని పోలీసులు వారెంటుతో అరెస్టు చేస్తారు. ఒకరికి సంబందించిన పెంపుడు కుక్కను వేరొకరు చంపినప్పుడు అది కాగ్నిజేబుల్ నేరం కింద పరిగణిస్తారు. ఆ వ్యక్తికి ఐపీఎస్ సెక్షన్ 428 కింద జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష, కొన్నిసార్లు రెండూ విధించే అవకాశం ఉంది. పశువుల యజమానులు పాల దిగుబడిని పెంచేందుకు అనవసరంగా మందులను పలు పద్ధతుల ద్వారా ఎక్కించి బాధ కలిగిస్తారు. వారికి సెక్షన్ 12 ప్రకారం రూ. 1000 జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష లేదా రెండు శిక్షలు విధిస్తారు. డెయిరీ ఫార్మర్స్ తమ పశువుల పాలదిగుబడిని పెంచేందుకు ఆక్సీటస్ వాడితే సెక్షన్ 12 కింద రెండేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు, డెయిరీ ఫాం యజమానితోపాటు ఆ మందులు అమ్మిన దుకాణం లెసైన్స్ రద్దు చేసి, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. పశువుల సంతలో పశువులను కొనే వ్యక్తి వాటిని ఎందుకు కొంటున్నారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. సంతలో పశువులకు నీటి సౌకర్యంతోపాటు పశువైద్యాధికారి అందుబాటులో ఉండేలా చూడాలి. జంతువుల రవాణా నిబంధనలు 1998 పశువులు, జంతువులను రవాణా చేసేప్పుడు స్థానిక పశువైద్యాధికారి వాటిని పరిశీలించి అవి ఆరోగ్యంగా ఉన్నాయని నిర్దారించిన తర్వాతే తరలించాలి. అప్పుడే ఈనిన పశువు లేదా అనారోగ్యంతో ఉన్న పశువును తరలించడం నేరం. చూడితో ఉన్న పుశువు, లేగదూడలను వేరే పశువులతో కలిపి రవాణా చేయడం నేరం. అనారోగ్యంతో బాధపడే పశువులను చికిత్స కోసం తరలించేప్పుడు వేరే పశువులతో కలపరాదు. జంతువులను వధించాలంటే.. సెక్షన్ 2(సీ) ఆఫ్ పీసీఏ 1960 వధశాలలకు నిబంధనలు ఉన్నాయి. వధశాలలు తప్పనిసరిగా లెసైన్స్ పొంది ఉండాలి. చూడితో ఉన్న, మూడు నెలల కంటె తక్కువ వయస్సు ఉన్న జంతువులను వధించడం నిషేధం. వధించే ప్రతీ జంతువును పశువైద్యాధికారితో సర్టిఫై చేయించాలి. లేదంటే నేరంగా పరిగణిస్తారు. -
రవాణా శాఖపై ‘ఓవర్ లోడింగ్’
సాక్షి, విశాఖపట్నం : సిబ్బంది సమస్యతో సతమతమవుతున్న రవాణా శాఖపై అదనపు భారం పడింది. ఇకపై ‘ఓవర్ లోడింగ్’ కేసుల నమోదు శాఖాపరంగానే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎంవీఐ చట్టం మేరకు పోలీసు, రవాణా శాఖ సంయుక్తంగా కేసులు నమోదు చేసేవారు. పోలీసుల ప్రమేయంతో ఆదాయం వస్తున్నా కొంతమొత్తం పక్కదారి పడుతోందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుందని సిబ్బంది చెబుతున్నారు. జిల్లా రవాణా శాఖకు ఈ ఏడాది ప్రభుత్వం రూ.234 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో 20 శాతం ఓవర్ లోడింగ్ కేసుల ద్వారానే రాబట్టాల్సి ఉంది. అధికారులు ఉదయం వేళల తనిఖీలు, మధ్యాహ్నం వేళ కార్యాలయ పనులూ చూస్తున్నారు. పైగా నిన్నమొన్నటి వరకు ఓవర్ లోడింగ్ కేసులు స్పాట్లోనే రాసేవారు. కేసులు పెరుగుదల దృష్ట్యా వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని, తప్పనిసరిగా కోర్టు ముందుంచాలన్న నిబంధన విధించారు. అయితే సామర్థ్యానికి మించిన లోడుతో వాహనం వెళ్తుండగా తనిఖీల్లో చిక్కితే నిత్యావసర సరుకులైతే రూ.1000 జరిమానా వేస్తారు. ఇతర వస్తువులైతే రికార్డులు స్వాధీనం, సీఫీజు వసూలు, కోర్టు కేసు, పర్మిట్ రద్దు వంటి అంశాలు చేపడతారు. కొన్నిసార్లు సామగ్రిని ఇతర వాహనాల్లోకి అన్లోడ్ చేయించి వాహనాన్ని రోడ్డుమీదకు అనుమతిస్తారు. అప్పుడప్పుడు చెక్రిపోర్టు రాసి మరుసటి రోజు ఫైన్ కట్టించుకుంటారు. భారీ స్థాయిలో సిబ్బంది ఉంటేనే ఈ తతంగం సాధ్యమవుతుంది. పైగా జిల్లాకు సరిపడే సీజ్ చేసిన వాహనాలుంచే స్థలం (వాహన డిటెన్షన్) కూడా లేదు. పోలీస్ స్టేషన్లు, ఆర్టీసీ డిపోలు, ఫైర్ కార్యాలయాల్లో వాహనాలు ఉంచుతున్నారు. కోర్టుకెళ్లి, జరిమానా కట్టి రికార్డులు తెచ్చుకునే సరికి వారం పైనే పడుతుండడంతో తమ వాహనాలు, సరుకు భద్రతపై యజమానులు, పలు సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇవీ ఇబ్బందులు పోలీసులను కాదని ఓవర్ లోడింగ్ కేసులు రవాణా శాఖ అధికారులే నమోదు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా అది సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శాఖాపరంగా సిబ్బంది కొరత పీడిస్తోంది. మరోవైపు కొత్త రిక్రూటీల పరిస్థితి సందిగ్ధంలో పడింది. కొత్తవారొస్తే వారితో ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని రూపొందించాలన్న ఉద్దేశంలో అధికారులున్నా ఎప్పటికి సాధ్యమన్నదే సందేహం. తాజాగా సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రవాణా శాఖ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఒకవేళ ఉద్యమం ఓ కొలిక్కి వచ్చినా పెండింగ్ పనులు పూర్తయ్యేంత వరకు ఓవర్లోడింగ్ కేసుల నమోదు కష్టమే. ఈలోగా ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. ఈ పరిస్థితుల్లో కొన్నాళ్లయినా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను సవరించాల్సి ఉంటుందన్న అభిప్రాయం శాఖాపరంగా వినిపిస్తోంది.