ఇసుక రేట్లు షాక్ కొడుతున్నాయి
- ఎక్కడ చూసినా మాఫియా దోపిడీ చేస్తోంది
చంద్రబాబు పాలనలో ఇసుక ధరలు షాక్ కొడుతున్నాయని, రేట్లు మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా పెరిగాయని, పది నెలల క్రితం ఒక లారీ లోడు ఇసుక వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఉంటే.. ఇపుడు రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకూ ఉందని జగన్ విమర్శించారు. (అక్రమ రవాణాకు సంబంధించి ఈనాడులో ప్రచురితమైన వార్తలను జగన్ చూపిస్తూ) ‘‘ఒక రోజు ‘32 ఇసుక లారీల పట్టివేత, అన్నింటా నిబంధనల అతిక్రమణ, పశ్చిమ గోదావరిలో ఇసుక అక్రమ రవాణా’ - ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది.
ఇసుక మాఫియా చేస్తున్న అక్రమాలు ప్రధానంగా మూడు రకాలుగా ఉన్నాయన్నారు. మీ సేవ ద్వారా తీసుకున్న ఒకే డీడీని మళ్లీ మళ్లీ ఉపయోగించి లాగ్‌బుక్స్‌లో ఎంట్రీలు వేస్తూ దారుణంగా మోసం చేస్తున్నారు. ఇక లారీల్లో ఓవర్‌లోడింగ్ చేస్తున్నారు. ఇసుక రేట్లకు సంబంధించి ఒక ఉదాహరణ చెబుతా. నేను విశాఖపట్నంలో ఒక లారీ లోడు ఇసుక ధరెంత? అని అడిగితే రూ. 39,000 అని చెప్పారు. ఒక ట్రాక్టర్‌లో రెండున్నర క్యూబిక్ మీటర్ల ఇసుక పడుతుంది.
ఒక క్యూబిక్ మీటరు అంటే దాని బరువు 1.69 టన్నులు. ఆ ప్రకారం ఒక ట్రాక్టర్‌లో 4.22 టన్నుల నుంచి 5 టన్నుల ఇసుక పడుతుంది. ఇక ఒక లారీ అంటే కనీసం మూడు ట్రాక్టర్లకు సమానం. ఒక లారీలో మూడింతలు ట్రాక్లర్ల ఇసుక పడుతుందంటే దాని పరిమాణం సుమారు 13 టన్నులుగా ఉంటుంది. అంటే దాని రేటు రూ. 39,000 అవుతుంది. దానర్థం ఒక కేజీ ఇసుక ధర మూడు రూపాయలన్నమాట. సబ్సిడీ బియ్యం కేజీ ఒక రూపాయి ధరకు లభిస్తుంటే.. విశాఖలో ఇసుక ధర మాత్రం కేజీ మూడు రూపాయలు!’’ అని వివరించారు.