కష్టం వస్తే.. ఒక్క ట్వీట్‌తో ఆదుకుంటున్నాం
హనోయ్: ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులకు ఇబ్బందులు ఎదురైతే ఒక్క ట్వీట్‌తో సాయం చేస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం వియాత్నం చేరుకున్న ఆమె మాట్లాడుతూ.. ప్రవాస భారతీయులు కష్టాల్లో చిక్కుకుంటే ఒకే ఒక ట్వీట్‌తో సాయం చేస్తున్నామని స్పష్టం చేశారు.. రాయబార కార్యలయాలు ప్రాధాన్యత కాదని ప్రవాసుల క్షేమమే ముఖ్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులున్నారని తెలిపారు. ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ, విదేశాంగ శాఖపై విశ్వాసం పెరిగిందన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుష్మా స్వరాజ్ ట్విటర్ వేదికగా అనేకమంది సమస్యలను పరిష్కరించారు.
ఇటీవల ఓ ప్రవాస భారతీయుడు పాస్ పోర్టు పోగొట్టుకున్నానని ట్విటర్లో సుష్మా దృష్టికి తేగా ఆమె స్పందించారు. ‘సుష్మా స్వరాజ్ జీ.. వాషింగ్టన్లో నా పాస్‌పోర్ట్‌ను పొగొట్టుకున్నాను. నా పెళ్లి ఆగస్టు రెండో వారంలో ఉంది. ఆగస్టు 10న ఇండియాకు వద్దామని జర్నీ ప్లాన్ చేసుకున్నాను. దయచేసి నా తత్కాల్ విజ్ఞప్తిని పరిశీలించి నా పెళ్లి సమయానికి ఇంటికి చేరుకునేలా సాయం చేయండి. ఈ సమయంలో మీ మీదే నా నమ్మకం’ అని ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్‌పై ఆమె స్పందిస్తూ. ‘రవితేజ ఇలాంటి సమయంలో నువ్వు పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం దురదృష్టకరం. నువ్వు పెళ్లి సమాయానికి ఇంటికి చేరుకునేలా సాయం చేస్తాం. నవతేజ్ మానవతా దృక్పథంతో అతడికి సాయం చేయండి’ అంటూ అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారుల్ని ఆదేశించారు. ట్విటర్లో అధిక సంఖ్యలోఉన్న మహిళా పొలిటిషన్ కూడా సుష్మానే కావడం విశేషం.