బీఎస్ఈ ఐపీఓకు బంపర్ డిమాండ్
ముంబై : మొదటిసారి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు వచ్చిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు బంపర్ డిమాండ్ వచ్చింది. మూడు రోజుల బిడ్డింగ్ల్లో ఆఖరి రోజు బుధవారం బీఎస్ఈ 51.01 సార్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. 1,07,99,039 షేర్లను ఇది ఆఫర్ చేస్తే, పబ్లిక్ ఆఫర్ కింద దీనికి 55,08,50,616 షేర్ల బిడ్స్ దాఖలయ్యాయి.
రూ. 1,243 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో, రూ..805–806 ధరల శ్రేణిలో బీఎస్ఈ పబ్లిక్ ఆఫర్‌కు వచ్చింది. ఒక దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఐపీఓకు రావడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది వస్తున్న తొలి ఐపీఓ కూడా ఇదే. రిటైల్ సెగ్మెంట్ నుంచి దీనికి మంచి డిమాండ్ వచ్చింది. ఈ సెగ్మెంట్లో వ్యక్తిగత పెట్టుబడిదారులు 3,31,94,448 షేర్ల బిడ్స్ దాఖలు చేశారు.
ఆసియాలో పురాతనమైన ఎక్స్చేంజ్ అయిన బీఎస్ఈ 1875 జూలై 9న ఏర్పాటైంది. 2016 జూలై 30కు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్చేంజ్ల్లో ఒకటిగా నిలిచింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఇది ప్రపంచంలో 11వ అతిపెద్ద ఎక్స్చేంజ్. లిస్టెడ్ కంపెనీలతో దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.52 ట్రిలియన్ డాలర్లు.