దోమలకు వలవేస్తాయి!
టొరంటో: డెంగ్యూ, మలేరియా, జికా వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న దోమలను అరికట్టేందుకు కెనడా శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. దోమలను ఆకర్షించడం, అవి పెట్టిన గుడ్లను నాశనం చేయడం ఈ పద్ధతి ప్రత్యేకత. ఇందుకోసం ఓవిల్లాంట అనే పరికరాన్ని తయారు చేశారు. దీనికోసం పనికిరాని పాత కారు టైర్లను సుమారు 50 సెంటీమీటర్ల పొడవుతో కోసి ఒకదానిపై ఒకటి ఉంచి.. ఇలా ఓ ఫ్రేమ్‌లో బిగించారు. కిందిభాగంలో పాలతో తయారు చేసిన ఓ ద్రావణాన్ని (దీనిని కెనడాలోని లారెంటియన్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేశారు) నింపారు. ద్రావణంపైన ఓ పేపర్ స్ట్రిప్‌ను ఏర్పాటు చేశారు. ఈ ద్రావణానికి ఆడ దోమలను ఆకర్షించే గుణం ఉండడంతో అవి ఒవిల్లాంటాలోకి చేరి అందులోని పేపర్ స్ట్రిప్‌పై గుడ్లుపెట్టడం మొదలుపెట్టాయి.
వారానికోసారి ఆ పేపర్ స్ట్రిప్‌ను బయటకు తీసి దానిపైన ఉన్న గుడ్లను ఇథనాల్‌తో నాశనం చేశారు. ఇలా కేవలం ఒక నెలలోనే 18,100 దోమల గుడ్లను నాశనం చేశారు. దోమలను అంతమొందించడం కంటే వాటి గుడ్లను నాశనం చేస్తే మెరుగైన ఫలితాలుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం దోమలను అరికట్టేందుకు వినియోగిస్తున్న రకరకాల ఉత్పత్తుల్లో హానికారక రసాయనాలను వినియోగిస్తున్నందున అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని, ఓవిల్లాంటాతో అటువంటి ఇబ్బందులేమీ ఉండవని చెబుతున్నారు.