జీఎస్టీ పోర్టల్‌ను ఎవరు రెడీ చేస్తున్నారో తెలుసా..?
న్యూఢిల్లీ : ఎట్టకేలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన బిల్లు జీఎస్టీని రాజ్యసభ బుధవారం ఆమోదించేసింది. అయితే ప్రస్తుతం ఈ బిల్లు అమలుకు ప్రభుత్వం సిద్ధమవడమే. దీనికి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించేసిందట. జీఎస్టీ బిల్లు పోర్టల్ తయారీని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అప్పజెప్పేసిందట. 2017 ఏప్రిల్ 1 నుంచి ఈ బిల్లును అమలులోకి తేవాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వానికి ఈ కంపెనీ జీఎస్టీకి అవసరమైన పూర్తి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఫ్రాక్ట్చర్ను అందించనుంది. వినియోగదారులకు తేలికగా పన్ను చెల్లింపు సర్వీసులను అందుబాటులోకి తేవడానికి ఈ పోర్టల్‌ను ఇన్ఫోసిస్ రూపొందించనుంది. టెస్టింగ్ సాప్ట్‌వేర్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించనున్నారు. అనంతరం 2017 ఫిబ్రవరిలో ఈ పోర్టల్ ఆవిష్కరణ ఉండనుందని గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నెట్వర్క్(జీఎస్టీఎన్) సీఈవో ప్రకాశ్ కుమార్ తెలిపారు. పోర్టల్ రెడీ అయ్యాక దీన్ని పన్ను నిపుణులు, ఆఫీసర్లు, వ్యాపారవేత్తలు టెస్ట్ చేయనున్నారని కుమార్ చెప్పారు.
దేశీయంగా రెండో అతిపెద్ద సాప్ట్వేర్ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్, రూ.1,380 కోట్లకు ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ప్రత్యేక డిజైన్ యూనిట్‌ను ఈ పోర్టల్ డిజైన్‌కు ఇన్ఫోసిస్ కేటాయించింది. పన్ను చెల్లింపుదారులకు అత్యంత అనువుగా దీన్ని వారు రూపొందించనున్నారు. కాగిత రహితంగా ఈ ప్రక్రియ ఉండేలా, చిన్న రిటైలర్లు సైతం ఆన్లైన్లోనే పన్నులు చెల్లించేవిధంగా పోర్టల్‌ను డిజైన్ చేస్తున్నామని కుమార్ తెలిపారు. దేశంలో ఉన్న మొత్తం 65 నుంచి 70 లక్షల పన్ను చెల్లింపుదారులకు ఈ పోర్టలే కీలకం కానుంది. కొంత ఐటీ సర్వీసులు మందగించి నిరాశలో ఉన్న ఇన్ఫోసిస్‌కు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు దక్కడం విశేషం.
జీఎస్టీఎన్ ప్రస్తుతం ఎస్ఏపీ, టాలీ సొల్యూషన్స్ వంటి అకౌంటింగ్ సాప్ట్వేర్ సంస్థలు, క్లియర్ టాక్స్ వంటి ఆన్లైన్ పోర్టల్స్‌తో సంప్రదింపులు జరుపుతోంది. వ్యాపారవేత్తలు ఈ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యే అవసరం లేకుండా వారు తమ సొంత సిస్టమ్స్ ద్వారా కూడా టాక్స్ ఫైల్ చేయడానికి ఈ సాప్ట్ వేర్ అప్లికేషన్ ప్రొగ్రామింగ్స్ ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతమున్న సిస్టమ్ మాదిరిగా డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ లోనే కాక ప్రైవేట్ టాక్స్ పోర్టల్లోనూ ఇన్ కమ్ టాక్స్ ఫైల్ ప్ర్రక్రియ జరిపేలా జీఎస్టీ పోర్టల్‌ను పన్ను చెల్లింపుదారుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రజలు పోర్టల్ ద్వారా పన్నులను చెల్లించవచ్చు లేదా అకౌంటెంట్ల సాయంతో సొంత సాప్ట్ వేర్లోనైనా ఈ సర్వీసులను వాడుకోవచ్చు. వ్యాట్, ఎక్సైజ్, సర్వీసు టాక్స్‌ల సహకారంతో పన్ను చెల్లింపుదారులను గుర్తించడంతో జీఎస్టీ కోసం రూపొందిన ఈ ఐటీ బ్యాక్ బోన్ పనులు ప్రారంభమవుతాయి. ఆ సమాచారాన్నంతటినీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఫార్మాట్లోకి మార్చుతారు.