అంతరిక్షంలో చైనా పాగా: చరిత్రాత్మక ప్రయోగం
బీజింగ్: సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది. గోబీ ఎడారిలోని జిక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం మానవ సహిత షెంజో-1 స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షనౌకను విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా జింగ్ హైపింగ్(50), చెండ్ డాంగ్(37) అనే ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. లాంగ్ మార్చ్-2ఎఫ్ వాహక రాకెట్ ద్వారా కక్షలోకి ప్రవేశించే ఈ ఇద్దరు వ్యోమగాములు..24 గంటల తర్వాత చైనా సొంత అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్-2కు చేరుకుంటారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ అంతరిక్ష కేంద్రంలో 30 రోజులు ఉండనున్న జింగ్, డాంగ్ లు రకరకాల ప్రయోగాలు చేయనున్నారు. ఈ చరిత్రాత్మక ప్రయోగం ద్వారా చైనా.. మానవసహిత అంతరిక్ష పరిశోధన చేపట్టిన మూడో దేశంగా నిలిచింది. ఇంతకు ముందు ఆ జాబితాలో అమెరికా, రష్యాలు మాత్రమే ఉన్నాయి.
ప్రస్తుతం మనుగడ ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) మరో ఏడేళ్లలో.. అంటే 2024 నాటికి రిటైర్ కానుంది. అమెరికా, రష్యా, కెనడా, జపాన్, 11 దేశాల యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్మించిన ఐఎస్ఎస్ కు దీటుగా కొత్త కేంద్రాన్ని నిర్మించాలనుకున్న చైనా.. 2011లో తియాంగాగ్-1 అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గత నెలలో(సెప్టెంబర్ 15న) తియాంగాగ్- 2 కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేసుకుంది. సోమవారం నాటి ప్రయోగంలో అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు తియాంగ్-2కు చేరుకుంటారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో పరిభ్రమించే ఈ ప్రయోగశాలలో సాగు,ప్రాథమిక చికిత్స, ఇతర ప్రయోగాలు చేపట్టనున్నారు. 2022 నాటికి (కనీసం 10 ఏళ్లు పనిచేయగల) పూర్తిస్థాయిలో పనిచేసే అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నారు. అక్కడి నుంచి మార్స్, మూన్ లకు సంబంధించి అనేక పరిశోధనలు చేస్తారు.
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రస్తుతం భారత్ కు వచ్చిన చైనై అధ్యక్షుడు జిన్ పింగ్ స్పేస్ మిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. తమ దేశం చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో దీనికొక మైలురాయిగా అభివర్ణించారు. ఈ మేరకు చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎం సీ) ముఖ్య అధికారి చాంగ్ లాంగ్ అధ్యక్షుడి సందేశాన్ని చదివి వినిపించారు. ఇద్దరు వ్యోమగాముల్లో జింగ్ హైపింగ్ కు ఇప్పటికే పలుమార్లు అంతరిక్షయానం చేసిన అనుభవం ఉండగా, చెండ్ గాండ్ కు మాత్రం ఇదే మొదటి ప్రయాణం. ప్రమాదకరమే అయినా అంతరిక్షంలో ప్రయోగాలు నిర్వహించడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పారాయన. ఇక ఐఎస్ఎస్ స్థానంలో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, యురోపియన్ దేశాలు నిర్మించతలపెట్టిన ఐఎస్ఎస్2.0పై ఇంకా స్పష్టతరావాల్సిఉంది.