దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది!
ముంబై: మార్కులు పేరు చెప్పి మాయచేసిన ప్రైవేటు కోచింగ్ సెంటర్ కు ముంబై విద్యార్థిని దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ర్యాంకుల పేరు చెప్పి వేలకు వేలు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లకు వార్నింగ్ ఇచ్చేలా న్యాయపోరాటం చేసి విజయం సాధించింది. చెప్పిన మాట నిలబెట్టుకోనందుకు విద్యార్థిని రూ.3.64 లక్షలు పరిహారం చెల్లించాలని కోచింగ్ సెంటర్ నిర్వాహకులను వినియోగదారుల ఫోరం ఆదేశించింది.
అభివ్యక్తి వర్మ అనే విద్యార్థిని హెచ్ ఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేరవుతూ మ్యాథ్స్, కెమిస్ట్రీ ట్యూషన్ కోసం 2013లో ఆందేరిలోని ఆక్స్ ఫర్డ్ ట్యూటర్స్ అకాడమి కోచింగ్ సెంటర్ కు వెళ్లింది. తమ దగ్గర అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పడంతో ఆమె హోమ్ ట్యూషన్ పెట్టించుకుంది. ఫీజు చెల్లించి నెల గడిచినా కెమిస్టీ టీచర్ ను పంపలేదు. మ్యాథ్స్ టీచర్ కు హిందీ తప్పా ఇంగ్లీషులో చెప్పడం రాదు. విద్యార్థిని తల్లి నీనా పలుమార్లు అడగ్గా కెమిస్ట్రీ టూటర్ ను పంపారు. అయితే టీచర్ సరిగా పాఠాలు చెప్పలేదు.
దీంతో ఒత్తిడి, గందరగోళానికి గురైన విద్యార్థిని టెన్త్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించలేపోయిందని నీనా తెలిపారు. తన కుమార్తెకు కాలేజీ సీటు రావడం కష్టమైందని వాపోయారు. దీంతో ఆమె గతేడాది ఆక్స్ ఫర్డ్ ట్యూటర్స్ అకాడమిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఫోరం గత నెలలో తీర్పు వెలువరించింది.
విద్యార్థినికి జరిగిన నష్టానికి రూ.3.64 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఆమె కట్టిన ఫీజు రూ.54,000 తిరిగి ఇచ్చేయాలని, మానసికంగా వేధించినందుకు రూ. 3 లక్షలు, కోర్టు ఫీజుల కింద రూ.10 వేలు కలిపి మొత్తం రూ.3.64 లక్షలు ఇవ్వాలంది. తాము బాగానే పాఠాలు చెప్పామని, మార్కులు తక్కువ రావడానికి విద్యార్థిని సరిగా చదవకపోవడమే కారణమని కోచింగ్ సెంటర్ తరపు న్యాయవాది వాదించారు.