Oxygen Cylinder Supply Problem
-
మొదలైన ఆక్సిజన్ కొరత
-
ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం: డాక్టర్ల నిర్లక్ష్యంతోనే..
సాక్షి, మంచిర్యాల: డాక్టర్ నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతిచెందిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గోదావరిఖనికి చెందిన కడారి అయిలమ్మ(65)ను అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులు ఈనెల27న చేర్పించారు. నాలుగు రోజులుగా కొంత అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని కొంత చికిత్స అవసరమని అడ్మిట్ చేసుకున్నారు. బుధవారం ఉదయం, సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన ఆసుపత్రి వైద్యుడు రాత్రి మాత్రం ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని పేర్కొన్నాడు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో అయిలమ్మ కుటుంబ సభ్యులు వేరే చోట నుంచి సిలిండర్ తీసుకొచ్చారు. అయితే ఆక్సీమీటర్‌తో పాటు సిలిండర్ బిగించడానికి స్పానర్ కూడా ఆసుపత్రిలో లేవు. పరిస్థితి విషమించిన అయిలమ్మకు చికిత్స చేసేందుకు డాక్టర్ రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అయిలమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
Corona: వేపచెట్ల కిందే చికిత్స... ప్రాణం నిలుస్తోంది!
లక్నో : మారుమూల ప్రాంతాల్లోని కరోనా బాధితులకు చికిత్స అందించడం కష్టతరంగా మారింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, ఆస్పత్రులు లేక, డాక్టర్లు ట్రీట్మెంట్ చేయకపోవడంతో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఓ రిమోట్ ఏరియాకు చెందిన కరోనా బాధితులు ఆర్ఎంపీ డాక్టర్ల సాయంతో చెట్లకిందే ట్రీట్మెంట్ చేయించుకొని ప్రాణాలతో బయటపడుతున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం.. మారుమూల గ్రామాల్లో సరైన వైద్యు సదుపాయాలు లేకపోవడంతో.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జేవార్ జిల్లాకు చెందిన కరోనా బాధితులు చెట్లకిందే కరోనా చికిత్స చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆక్సిజన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధితులు వేపచెట్లు ఉన్న స్థలాన్నే కరోనావార్డులుగా మార్చుకుంటున్నారు. స్థానికంగా ఉండే ఆర్ఎంపీ డాక్టర్ల సాయంతో ట్రీట్మెంట్ చేయించుకొని ప్రాణాల్ని కాపాడుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే బాధితులకు ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన వెంటనే వేపచెట్ల కింద మంచాలపై పడుకుటుంటున్నారు. దీంతో వెంటనే ఆక్సిజన్ లెవల్స్ పెరిగి ఉపశమనం లభిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మాజీ ప్రెసిడెంట్ యోగేశ్ తలన్ మాట్లాడుతూ.. "మాకు సరైన వైద్య సదుపాయాలు లేవు. కరోనా వచ్చిందని టెస్టులు చేయించుకుందామంటే ఆస్పత్రులు లేవు. అందుకే మేమంతా ఆరుబయట చెట్లకిందే కరోనాకు చికిత్స చేయించుకుంటున్నాం. ఎవరికైనా ఆక్సిజన్ సమస్య ఎదురైతే వేపచెట్ల కిందనే పడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆక్సిజన్ లెవల్స్ పెరిగినట్లు చాలా మంది చెబుతున్నారు’’ అని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో వైద్యసదుపాయాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. చదవండి : అయ్యో నా కూతురు చనిపోయింది సార్, మీకు డ్రామాలా ఉందా? -
లక్షలతో కాదు, ఒక్క ఫోన్ కాల్ తో కరోనా పేషెంట్లను బ్రతికిస్తున్నాడు
న్యూఢిల్లీ : కరోనా కష్ట సమయంలో వైద్యం కావాలంటే లక్షలు ఖర్చుపెట్టాల్సి వస్తుంది. ధనవంతులు హాస్పిటల్ ఖర్చుకు వెనకడుగు వేయడం లేదు గానీ సామాన్యులు మాత్రం హాస్పటల్ బిల్లుకు భయపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి వారి కోసం నేనున్నాను మీకేం కాదంటూ ఓ డాక్టర్ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. లక్షలు ఖర్చు చేయడం లేదు. సరైన సమయంలో ఒక్క ఫోన్ కాల్‌తో ప్రాణాల్ని కాపాడుతున్నాడు. అలా ఇప్పటి వరకు ఫోన్ కాల్స్ ద్వారా సుమారు 1000 మంది కరోనా పేషెంట్ల ప్రాణాలు కాపాడి ప్రాణ దాతగా నిలిచాడు. ఢిల్లీలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అమరేంద్రజా ఒక్క ఫోన్ కాల్‌తో కరోనా బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు లేక ఆస్పత్రికి వెళ్లాలంటే కరోనా బాధితులు భయపడే వారు. అలాంటి వారికి ఇంట్లో ఉండి కరోనాకు ట్రీట్మెంట్ ఎలా తీసుకోవచ్చు? బ్రీతింగ్ సమస్యల్ని ఎలా అధిగమించవచ్చు. కరోనా తగ్గించేందుకు ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలో చెబుతున్నారు. అలా చేయడం వల్ల 1000మంది కరోనా పేషెంట్ల ప్రాణాల్ని నిలబెట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. " కరోనా బాధితులకోసం ఫోన్ కాల్ ద్వారా వైద్య సేవల్ని అందిస్తున్నాను. ప్రతిరోజు 200 మందికి పైగా ఫోన్ కాల్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాను. కరోనా సోకితే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో వైద్యుల్ని సంప్రదిస్తే సరిపోతుంది. నాకు తెలిసినంత వరకు ఒక్క నెలలో 1000 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరే అవసరం లేకుండా వారి ప్రాణాల్ని కాపాడగలిగాను. ఈ క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలిచేందుకు కృషి చేస్తున్నట్లు డాక్టర్ అమరేంద్ర జా" తెలిపారు. -
వాట్ ఎన్ ఐడియా.. బైక్‌ను అంబులెన్స్‌గా మార్చి..
భోపాల్ : అంబులెన్స్ లేక తన ద్విచక్రవాహనంపై కరోనా బాధితుల్ని తరలిస్తున్నారంట. 3 కిలోమీటర్ల ప్రయాణానికి ఓ అంబులెన్స్ డ్రైవర్ రూ.10 వేలు ఛార్జ్ చేస్తున్నాడంట. ఇలాంటి వార్తల్ని మనం పేపర్లలో చదివి, టీవీల్లో చూసినప్పుడు కరోనా కష్టకాలంలో బాధితులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఈ దోపిడీ ఏంటని తిట్టుకునే ఉంటాం. కానీ, ఓ వెల్డర్ మాత్రం అలా చేయలేదు. మనసుంటే సేవ చేయటానికి మార్గం ఉంటుందని నిరూపిస్తూ సదరు వెల్డర్ కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు తన బైక్‌నే అంబులెన్స్‌గా మార్చేశాడు. వివరాలు.. మధ్యప్రదేశ్ ధార్‌కు చెందిన ఓ వెల్డర్‌కు పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో వార్తలు చదివే అలవాటుంది. ఎప్పటిలాగే ఫేస్ బుక్‌లో ఓ అంబులెన్స్ డ్రైవర్ కరోనా బాధితుల నుంచి కేవలం 3 కిలోమీటర్లకు రూ.10వేలు వసూలు చేస్తున్నాడనే వార్త ఆయన్ను కదిలించింది. అంతే అంబులెన్స్‌లు లేక ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితుల్ని ఎలాగైనా అదుకోవాలని అనుకున్నాడు. అలా అనుకున్నదే తడువుగా వెల్డింగ్ పనిచేసే ఆయనకు ఓ ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఇప్పుడు సూపర్ హిట్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్క్రాప్‌తో 20 నుంచి 25వేల రూపాయలు ఖర్చు పెట్టి ఓ మినీ అంబులెన్స్‌ను తయారు చేశాడు. ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు కరోనా బాధితులకు మెడిసిన్ అందించేలా సెటప్ చేశాడు. కరోనా బాధితుడితో పాటూ మరో ఇద్దరు వ్యక్తులు అంబులెన్స్ కూర్చునేలా డిజైన్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా అంబులెన్స్ తయారు చేసిన వ్యక్తి మాట్లాడుతూ.. కరోనా వల్ల సామాన్యులు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్‌లో కిలోమీటర్ దూరానికే వేలల్లో వసూలు చేయడం నన్ను ఎంతగానో బాధించింది. అందుకే కరోనా బాధితులకోసం స్క్రాప్‌ను ఉపయోగించి అంబులెన్స్‌ను తయారు చేశా. లాక్ డౌన్ వల్ల స్క్రాప్‌తోనే అంబులెన్స్‌ను డిజైన్ చేయించాల్సి వచ్చిందని అన్నాడు. ఏదేమైనా, పేద ప్రజలకు సకాలంలో ట్రీట్మెంట్ అందించేలా ఇలాంటి అంబులెన్స్‌లను తయారు చేస్తే బాగుంటుందని అంటున్నాడు. -
క్షణమొక యుగంలా గడిచింది, లేదంటే 100 ప్రాణాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రి యాజమాన్యం ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించుంటే వందకు పైగా రోగుల ప్రాణాలు ఆక్సిజన్ లేక గాల్లో కలిసేవి. వెంటనే అప్రమత్తం కావడంతో మరో జైపూర్ ఘటనను పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డారు. ఆస్పత్రి యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఆస్పత్రిలో సుమారు 100 మందికి పైగా రోగులు వైద్యం చేయించుకుంటున్నారు. అందులో ఎక్కువ మంది రోగులకు ఆక్సిజన్ సిలిండర్లతోనే వారి వైద్యం జరుగుతోంది. ఇంతలో ఆక్సిజన్ నిల్వలు రోగులకు సరిపడా లేదని సిబ్బందికి తెలిసింది. వారు ఈ సమాచారాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలిపారు. కరోనా నేపథ్యంలో బయట మార్కెట్లో ఎక్కడ కూడా అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం లేదు. ఇక జైపూర్ గోల్డెన్ హాస్పిటల్లో విషాదం పునరావృతమవుతుందనే భయాందోళనల మధ్య ఆస్పత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మరుతోంది. గంటలు తరబడి ఆస్పత్రి యాజమాన్యం సిలిండర్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరకు కోర్టు తలుపు తట్టగా అధికారులు స్పందించి షేరింగ్ ప్రాతిపదికన గ్యాస్ ట్యాంకర్‌ను సిద్ధం చేశారు. కానీ ఇక్కడ ఇంకో సమస్య వచ్చి పడింది. ఆక్సిజన్ తీసుకొచ్చిన ట్యాంకర్ ఆస్పత్రిలోకి వెళ్లే వీలు లేకుండా పోయింది. దారి చిన్నది కావడంతో ఆస్పత్రి ఎల్ఎంఓ (లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్) ట్యాంక్ ఉన్న ప్రాంతంలోకి ట్యాంకర్ రాలేకపోయింది. ‘మేము ఎలక్ట్రానిక్ సుత్తులతో మా గోడ భాగాన్ని పగలకొట్టడం ప్రారంభించాము. కానీ దీనికి సమయం పట్టేలా ఉందని గ్రహించి.. అధికారులకు విషయం చెప్పడంతో జేసీబీని రప్పించారు. జేసీబీ గోడలను బద్దలు కొట్టడంతో హుటాహుటిన ఆక్సీజన్ ట్యాంకర్‌తో సేవలను పునరుద్ధరించి రోగులకు ఆక్సిజన్‌ను అందించామని ’ ఆస్పత్రి యజమాని చావ్లా తెలిపారు. ఇక ఆక్సీజన్ సరఫరా అయ్యేంత వరకు తమవారి ప్రాణాలు గాల్లో దీపంలా తోచాయని బాధితుల బంధువులు చెప్పుకొచ్చారు. ఆస్పత్రి యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు. ( చదవండి: ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లపై కేంద్రం కీలక నిర్ణయం ) -
కరోనా రోగులకు మరో షాక్?!
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభణతో ఓ పక్క దేశంలోని కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు సహా ప్రభుత్వాస్పత్రులన్నీ కిక్కిరిసి పోతుండగా, ఉన్నంతలో వారికి తగిన చికిత్సను అందించేందుకు కుస్తీ పడుతోన్న వైద్య సిబ్బందికి ఇప్పుడు పెనం మీద పిడుగు పడిన చందంగా ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఎదురయింది. కరోనా వైరస్‌తో ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరవుతోన్న రోగులకు వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్ అందించడం అవసరమన్న విషయం అర్థమైందే. దేశంలో కరోనా రోగుల సంఖ్య ఇప్పటికే 80 లక్షలు దాటిపోగా వారిలో కొన్ని లక్షల మందికి ఆక్సిజన్ వెంటిటేటర్లు అవసరం అవుతున్నాయి. (చదవండి : ఫ్యూచర్ మహమ్మారులు మరింత డేంజర్..!) దేశంలో వైద్య అవసరాలతోపాటు గ్లాస్, స్టీల్ పరిశ్రమలకు కూడా ఆక్సిజన్ సిలిండర్లు అవసరం. గ్లాస్, స్టీల్ పరిశ్రమలకు తాత్కాలికంగా గ్యాస్ సరఫరాను నిలిపివేసి వైద్య అవసరాలకే ఆక్సిజన్ సిలిండర్లను మళ్లించినప్పటికీ సెప్టెంబర్ నెలలో దేశంలోని ఆస్పత్రులకు రోజుకు మూడు వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కొరత ఏర్పడిందని ‘ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ గ్యాసెస్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్’కు చెందిన రాజీవ్ గుప్తా తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం కరోనా వైరస్ దాడికి ముందు దేశంలో రోజుకు 6, 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరిగేది. వాటిలో వైద్య అవసరాలకు వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌కు మించి అవసరం పడలేదు. (చదవండి : అమ్మ ఉద్యోగం పోయింది.. టీ అమ్ముతున్నా) మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిలో 70 నుంచి 80 శాతం గ్లాస్, స్టీల్ పరిశ్రమలు వినియోగించుకునేవని పంజాబ్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి కంపెనీ ‘హైటెక్ ఇండస్ట్రీస్’ అధిపతి ఆర్ఎస్ సచ్దేవ్ తెలిపారు. వైద్య అవసరాలకు ఆక్సిజన్ సిలిండర్లను మళ్లించినట్లయితే పరిశ్రమలు నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటి, రెండు సిలిండర్ల కొరత ఏర్పడితే సర్దు కోవచ్చుగానీ, లోడుల లెక్కన కొరత ఏర్పడితే నష్టాన్ని భరించడం కష్టమని ఆయన చెప్పారు. అయినప్పటికీ తమ ప్రాథమిక ప్రాథామ్యం వైద్య అవసరాలు తీర్చడమని రాజీవ్ గుప్తా తెలిపారు. కోవిడ్ దండయాత్ర కారణంగా వైద్య అవసరాల కోసం ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచామని ఆయన చెబుతున్నప్పటికీ అది ఎంత అన్నది ఆయన చెప్పలేక పోయారు. దేశవ్యాప్తంగా వైద్య అవసరాలకు ఆక్సిజన్ కొరత ఉందని కేరళలోని మనోరమ గ్యాసెస్ అధినేత ఆంథోని జోసఫ్ తెలిపారు. దేశంలోని అవసరాలకు తమ ఉత్పత్తులు చాలడం లేదని ఆయన చెప్పారు. పీకల మీదకు వచ్చేవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ విపక్షాలు చేస్తోన్న విమర్శల్లో నిజం లేకపోలేదన్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఆస్పత్రుల కోసం ఓ లక్ష మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్ ఉత్పత్తి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ అక్టోబర్ 14వ తేదీన ప్రభుత్వ రంగంలోని ‘హెచ్ఎల్ఎల్ (హిందుస్థాన్ లాటెక్స్ లిమిటెడ్) లైవ్ కేర్’ ద్వారా బిడ్డింగ్‌లను ఆహ్వానించింది. అవి ఎప్పుడు ఖరారు అవుతాయో, అదనపు ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎవరికి ఎరుకో! దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 15 శాతం మందికి ఆస్పత్రి వైద్య సేవలు అవసరం అవుతున్నాయని, వాటిలో ఐదు శాతం కేసులకు ఆక్సిజన్ వెంటిలేటర్ల ద్వారా అత్యవసర వైద్య సేవలు అవసరం అవుతున్నాయని ‘ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఓ విలేకరుల సమావేశంలో చెప్పారు.(చదవండి : ఎఫ్డీసీ నుంచి 800ఎంజీ ఫావిపిరావిర్) కరోనా కారణంగా వైద్య అవసరాలకు ఆక్సిజన్ వినియోగం అంతకుముందుకన్నా ఏడెనిమిదింతలు పెరగడం ఆక్సిజన్ కొరతకు ఓ కారణం కాగా, లాక్డౌన్ నాటి నుంచి ఆక్సిజన్ పరిశ్రమలు ఊపిరి పీల్చుకోకుండా పని చేస్తుండడంతో దేశంలోని కొన్ని పరిశ్రమలు ‘బ్రేక్‌డౌన్’ అవడం మరో కారణం. వార్శిక మెయింటెనెన్స్‌లో భాగంగా ఏటా కొన్ని రోజుల పాటు ఈ పరిశ్రమలను మూసి వేయాల్సి ఉంటుందన్న తెల్సిందే. దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గత ఏప్రిల్ నెల నాటికి 57,924 బెడ్లకు ఆక్సిజన్ సపోర్ట్ ఉండగా, వాటి సంఖ్య అక్టోబర్ నాటికి 2,65,046 చేరుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీ నాటికి దేశంలో 43,033 మంది ఆక్సిజన్ థెరపీ తీసుకుంటుండగా, అక్టోబర్ ఒకటవ తేదీ నాటికి వారి సంఖ్య 75,098కి చేరుకుంది. ఆక్సిజన్ అవసరాలు ఇలాగే పెరిగితే కిమ్కర్తవ్యం?! -
మరో గోరఖ్‌పూర్ ఘటన రిపీట్ కానివ్వొద్దు
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతం. బుందేల్‌ఖండ్ ప్రాంతం ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఒకే ఒక్క ఆస్పత్రి వైపు పరుగులు తీస్తారు. 700 పడకల పెద్ద ఆస్పత్రి అది. అలాంటిది సమస్యలకు మాత్రం నిలయంగా ఉంది. ముఖ్యంగా గోరఖ్‌పూర్ ఘటన తరహా ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా లేమి ఇక్కడ కూడా దర్శనమిస్తోంది. బాబా రాఘవ దాస్ ఆస్పత్రి ఉదంతం అనంతరం మహారాణి లక్ష్మి బాయి కాలేజీ ఆస్పత్రి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్డీ ఆస్పత్రి మాదిరిగానే ఇక్కడా ఆస్పత్రి యాజమాన్యం సిలిండర్ల సరఫరా కంపెనీకి బకాయిలు ఉన్నారు. అయితే గోరఖ్‌పూర్ ఉదంతం అనంతరం అప్రమత్తమై రంగంలోకి దిగిన అధికారులు హుటాహుటినా కంపెనీకి రూ. 36 లక్షలను చెల్లించేశారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే... ఆస్పత్రి, కంపెనీ ఒప్పందం ఈ యేడాది మార్చికే పూర్తయిపోయినప్పటికీ వాళ్లు ఇంకా సిలిండర్ల సరఫరాను కొనసాగించటమే. మరోపక్క టెండర్లు నిర్వహించాల్సిన ఆస్పత్రి వర్గాలు కూడా నిబంధనలను పెడ చెవిన పెట్టేశాయి. ఆస్పత్రికి రోజుకు 120 నుంచి 150 సిలిండర్ల అవసరం ఉండగా, కేవలం 25 నుంచి 50 సిలిండర్లను మాత్రమే వాళ్లు సరఫరా చేయగలుగుతున్నారు. సిలిండర్లు సప్లై చేస్తున్న గౌరీ గ్యాస్ కంపెనీ చాలా చిన్నది కావటంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతుందని ఇదే ఆస్పత్రిలో సేవలు అందించిన రిటైర్డ్ వైద్యుడు ఒకరు తెలిపారు. ఇలాంటి సమయంలో బీఆర్డీ ఆస్పత్రి మాదిరి జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే తాను 18 ఏళ్లుగా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నానని, ఖరగ్‌పూర్ ఘటన మాదిరి పరిస్థితులు ఇక్కడేం కనిపించలేదని విధులు నిర్వహిస్తున్న మరో వైద్యుడు చెబుతున్నాడు. కానీ, రోగుల అనుభవాలు మాత్రం భయానకంగా ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి ఆయింట్ మెంట్ పూయటం తప్ప వేరే చికిత్స చేయకపోవటం, రైలు నుంచి కింద పడి గాయపడ్డ ఓ బాలుడికి స్ట్రెచ్చర్ కూడా అందించకపోవటం లాంటి పరిస్థితులు అక్కడ దర్శనమిచ్చాయి. యూపీతోపాటు మధ్యప్రదేశ్ నుంచి ఏడు జిల్లాల ప్రజలు నిత్యం ఇక్కడకు చికిత్స కోసం వస్తుంటారు. యూపీలో దాదాపు ప్రతీ ఆస్పత్రిలో ఇలాంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల జాప్యం, అరకోర సిబ్బంది వంటి సమస్యలే ప్రజలకు మెరుగైన వైద్యాన్ని దూరం చేస్తున్నాయి. కనీసం ఇప్పుడు విమర్శల నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటే గోరఖ్‌పూర్ తరహా మృత్యు ఘోషలు పునరావృతం కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.